సాక్షి,సిటీ బ్యూరో: కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లకు ఎన్నికల గ్రహణం పట్టింది. గత నెల రోజులుగా దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో పడటంతో ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో ముహుర్తాలు ఖరారు చేసుకున్న తల్లితండ్రులకు ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్లు తప్పడం లేదు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం, సవాలక్ష కొర్రీల కారణంగా వ«ధువుకు చేయూత అంతంతమాత్రంగా మారింది. కొత్త దరఖాస్తులతో పాటు పరిశీలనకు నోచుకున్న దరఖాస్తుల అమోదం, మంజూరు కూడా పెండింగ్‌లో పడింది. ఇప్పటికే మంజూరైన ఆర్థిక చేయూతకు ట్రెజరీ అధికారులు కొర్రీలు వేస్తున్నారు. దీంతో బిల్లులు విడుదల కావడం లేదు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే నిరుపేద తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు
ఎన్నికల ప్రభావం
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలపై ఎన్నికల విధుల ప్రభావం పడింది. రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఆయా పథకాల అమలును పట్టించుకోవడం లేదు. దీనికితోడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ శాఖకు గుడిబండగా మారింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ సిబ్బందికి ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధృవీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధులతో పాటు ఎన్నికల డ్యూటీ పేరుతో అదనపు భారం పడింది. దీంతో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి.
నత్తనడక..
హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల అమలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి
మొత్తం 8 వేల మంది కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా అందులో రెండు వేల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక చేయూత అందినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షాదీ ముబారక్ పథకం కింద సుమారు రెండువేల కుటుంబాలు ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు కేవలం ఐదు వందల కుటుంబాలకు మాత్రమే ఆర్థికసాయం అందినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం దరఖాస్తులు వివిధ దశలో పెండింగ్ ఉన్నట్లు
సమాచారం.
మళ్లీ అప్పుల పాలు
ప్రభుత్వం నిరుపేద కుటుంబాల్లో ఆడ బిడ్డల వివాహాలకు చేయూత అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పథకాలను ప్రకటించింది. రెండేళ్ల క్రితం సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసిన పథకాలను ఒక గొడుగు కిందకు తేవాలన్న లక్ష్యంతో పథకం పూర్తి స్థాయి అమలు బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్లకు దరఖాస్తుల విచారణ బాధ్యత అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అదనపు పనిభారం, బిజీ షెడ్యూల్‌తో దరఖాస్తులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడటంతో ఆర్థిక చేయూత అంతంత మాత్రంగా మారింది. కొద్దిరోజుల క్రితం రెవెన్యూ శాఖ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై దృష్టి సారించి విచారణ ప్రక్రియ వేగవంతం చేసినా ఎన్నికల షెడ్యూల్ కారణంగా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. తాజాగా రెండు పథకాల అమలుపై ఎన్నికల ప్రభావం పడటంతో ఇప్పట్లో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment