కల్యాణలక్ష్మి అక్రమాలపై కొరడా
♦ అక్రమాలకు పాల్పడ్డ అధికారులు, సిబ్బందిపై చర్యలకు సర్కారు ఆదేశం
♦ మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు అనర్హులకు లబ్ధి
♦ తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన కిందిస్థాయి అధికారులు
♦ శాఖాపర విచారణలో వెల్లడి
♦ తప్పుడు పత్రాలిస్తే క్రిమినల్ చర్యలు: ఎస్సీశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి తోడుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కల్యాణలక్ష్మి’ పథకంలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఈ పథకానికి సంబంధించి పలు అవినీతి ఉదంతాలు బయటపడడంతో శాఖాపరంగా విచారణ జరిపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు అనర్హులు లబ్ధి పొందారని గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ 5 కేసుల్లో చట్టాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది, నకిలీ లబ్ధిదారులపై చర్య లు తీసుకోవాలని ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి కలెక్టర్‌కు సూచించారు.
తప్పుడు పత్రాలతో..: ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద వివాహ సమయంలో ఆడపిల్లలకు రూ. 51 వేలు అందిస్తారు. నిరుపేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు సహాయపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ కిందిస్థాయిలో అధికారులు, సిబ్బంది కలసి బోగస్ లబ్ధిదారులతో ఈ సొమ్మును స్వాహా చేస్తున్నారు. అప్పటికే పెళ్లయిన వారు, పిల్లలున్న వారు, రెండో వివాహం చేసుకున్న వారితో దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వచ్చిన సొమ్మును పంచుకుంటున్నారు.
‘కల్యాణలక్ష్మి’లో అనర్హులు లబ్ధిపొందుతున్నారని, దీనికి అధికారులు సహకరిస్తున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన డెరైక్టర్ ఎం.వి.రెడ్డి విచారణ జరిపించారు. వీఆర్వోలు, వీఏవోలు, వార్డెన్లు ఇచ్చే తప్పుడు ధ్రువపత్రాల ద్వారా అక్రమాలకు అవకాశం ఉండడంతో... పకడ్బందీగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో ఒకరు ఈ పథకం ద్వారా అక్రమంగా లబ్ధి పొందారని కొద్దిరోజుల క్రితం తేలింది. మహబూబ్‌నగర్ జిల్లాలో బయటపడిన 5 కేసులపై శాఖాపర విచారణ జరిపి, ఆయా అంశాలను తేల్చింది.
అధికారులపైనా చర్యలు
మహబూబ్‌నగర్ జిల్లాలో 5 కేసులపై విచారణ జరిపి, అక్రమాలు గుర్తించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రయోజనం పొందిన అనర్హుల నుంచి సొమ్మును రెవెన్యూ యాక్ట్ ప్రకారం తిరిగి వసూలు చేస్తాం. కొన్నికేసుల్లో నిధులు విడుదల చేయకుండా నిలిపేశాం. కల్యాణలక్మి పథకం కింద లబ్ధిపొందేందుకు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తప్పవు. సంబంధిత వెరిఫికేషన్ అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు చేపడతాం.
- ఎం.వి.రెడ్డి, ఎస్సీశాఖ డెరైక్టర్