బీసీ కులాలకు బడ్జెట్ భరోసా
ప్రజాకర్షక పథకాలు ప్రకటించనున్న ప్రభుత్వం
కొత్త పథకాలపై ముమ్మరంగా శాఖల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నాలుగో వార్షిక బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలకు తోడు పలు కొత్త పథకాలకు ఈ బడ్జెట్‌లో చోటు కల్పించనుంది. మానవీయకోణంతోపాటు సంక్షేమానికి పెద్దపీట వేసే సంకల్పంతో వీటికి రూపకల్పన చేస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు బ్యాంకును తెచ్చి పెట్టే వర్గాలను ఈసారి లక్ష్యంగా ఎంచుకుంటోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నాయి. సామాజికంగా, వ్యక్తిగ తంగా లబ్ధి చేకూర్చటంతోపాటు ప్రభుత్వానికి పేరు తెచ్చిపెట్టే బహుళ ప్రయోజనాలుండేలా ఆకర్షణీయంగా కొత్త పథకాలు రూపొందించా లని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సన్నిహిత మంత్రులతోపాటు అధికా రులకు ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడేళ్ల లో బడ్జెట్‌లో భారీ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే భారీ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల నత్తనడక, వరుసగా ఎదురవుతున్న అవాంతరాలపై సీఎం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2017ృ18 బడ్జెట్‌లో ఆకర్షణీయమైన చిన్న పథకాలకు చోటు కల్పించాలని.. ఎక్కువ మందికి తక్షణ ప్రయోజనం కల్పించేలా వాటిని డిజైన్ చేయాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా కల్యాణలక్ష్మి పథకానికి నగదు పెంపు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు రూ.15 వేల ప్రోత్సాహకం, బాలింతల సంక్షేమానికి కేసీఆర్ కిట్, భారీ సబ్సిడీతో గొర్రెల పెంపకం యూనిట్లు, మత్స్యకారులకు లాభాల పంట పండేలా చేపల పెంపకం.. తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే ఉన్నత స్థాయిలో జరిగిన సమాలోచనల మేరకు వివిధ శాఖలు వీటిపై కసరత్తు ప్రారంభించాయి.
75 శాతం సబ్సిడీతో గొర్రెలు
వ్యవసాయానికి అనుబంధంగా ఉండే గొర్రెల పెంపకానికి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వనుంది. ఏడాదికి లక్ష యూనిట్లు లక్ష్యంగా.. రెండేళ్లలో రెండు లక్షల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఒక్కో యూనిట్‌లో 22 గొర్రెలుం టాయి. 50 శాతం నుంచి 75 శాతం వరకు భారీ సబ్సిడీతో ఈ పథకానికి రూపకల్పన చేసేందుకు కసరత్తు మొదలైంది. దీంతో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని యోచిస్తోంది.
మత్స్యకారులకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్...
చేపల పెంపకాన్ని ప్రోత్సహించి మత్స్య కారులకు లాభాల పంట పండించేలా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి తెలంగాణలోని మత్స్యకారులందరినీ అందులో సభ్యులుగా చేర్చాలని యోచి స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకంతో పాటు విక్రయాలతో వచ్చిన లాభాలను వాటా లుగా పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి నిర్ణీత ఆదాయం సమకూరేలా విధివిధానాలు రూపొం దిస్తోంది.
కల్యాణలక్ష్మి సాయం పెంపు
కల్యాణలక్ష్మి పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం రూ.51 వేలు ఆర్థిక సాయంగా అందిస్తోంది. ‘షాదీ ముబారక్’పేరిట మైనారిటీలకు ఇదే పథకాన్ని వర్తింపజేస్తోంది. పెరుగుతున్న పెళ్లిళ్ల ఖర్చుల దృష్ట్యా నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచే ప్రతిపాదనలున్నాయి. గడిచిన మూడేళ్లలో ఈ పథకం ద్వారా దాదాపు 1.30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు రూ.15 వేలు
ఇప్పటివరకు అమల్లోకి తెచ్చిన పథకాలకు ప్రభుత్వం లక్ష్యాత్మకంగా, సందే శాత్మకంగా పేర్లు పెట్టింది. తొలిసారిగా ‘కేసీఆర్’పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంపొం దించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ప్రసూతి సమయంలో అవసరం లేకున్నా ఆప రేషన్లు చేసే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ దందాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఇప్పుడిస్తున్న ఆర్థిక సాయాన్ని తమిళనాడు తరహాలో రూ.15 వేలకు పెంచాలని యోచిస్తోంది. దీంతోపాటు మూడు నెలల పాటు బాలింతలు, శిశువుల సంరక్షణ బాధ్యతగా ‘కేసీఆర్ కిట్’ను కానుకగా అందించనుంది. తల్లులు, పిల్లలకు అవసరమయ్యే మందులు, సబ్బులు, షాంపూలతో ఈ కిట్‌ను అందించాలని యోచిస్తోంది.