
'కల్యాణలక్ష్మి' అక్రమాలపై ఏసీబీ విచారణ
మల్దకల్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొంతమంది అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ మండలంలో విచారణ చేపట్టారు. శనివారం మధ్యాహ్నం మల్దకల్‌లో పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించారు. అందులో ఏ అధికారి ఎక్కడ సంతకాలు పెట్టారో నోట్ చేసుకున్నారు.
బోగస్ లబ్ధిదారులే..
విచారణ సమయంలో మల్దకల్ వీఆర్‌ఓ ప్రదీప్‌కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఏసీబీ అధికారులు బృందంగా విడిపోయి ఇంటింటికి తిరిగి పూర్తి సమాచారం సేకరించారు. కొందరు లబ్ధిదారులు కల్యాణలక్ష్మా.. అదేంటీ.. అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు దరఖాస్తు చేసుకున్న విషయం తమకు తెలియదన్నారు. మా పెళ్లయి ఆరేళ్లయిందని కొందరు.. మాకు పిల్లలున్నారని మరికొందరు ఏసీబీ అధికారులకు వివరించారు. అటునుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి రికార్డులు పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు బ్యాంకు మేనేజర్‌కు తెలపడంతో జాబితా అందజేశారు. అక్రమాలపై ఇంకా లోతుగా విచారణ జరిపి త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ రాందాస్‌తేజ తెలిపారు.