
కల్యాణమైంది.. ‘లక్ష్మి’ రాలేదు..!
♦ బీసీలకు అందని ద్రాక్షలా కల్యాణలక్ష్మి
♦ దరఖాస్తులకే పరిమితం
♦ రెండునెలలైనా కాసులు ఇవ్వని సర్కారు
♦ లబ్ధిదారుల నిరీక్షణ
చిత్రంలో కనిపిస్తున్న వధువు, వరుడి పేర్లు సంగీత, గంగాధర్. వధువుది సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామ పరిధిలోని లొంకతండా కాగా, వరుడిది కమ్మర్‌పల్లి మండలం మానాల. ఫిబ్రవరిలో వీరి వివాహమైంది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ కూడా చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. - సిరికొండ
ఇందూరు : ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన కల్యాణలక్ష్మి పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీసీలకు కూడా వర్తింపజేస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులో విఫలం అవుతోంది. దరఖాస్తులు చేసుకోవాలని రెండు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖకు జీవోఎంఎస్ నంబరు 5ను జారీ చేసింది. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చారుు. కానీ.. ఇంతవరకు సర్కారు ఒక్కరికి కూడా నయాపైసా అందజేయలేదు. పెళ్లి సమయంలో కాదు కదా.. పెళ్లి అయిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న పేదింటి ఆడ్డబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం నిధుల లేమి సాకుతో బీసీలకు ‘లక్ష్మి’ని దూరం చేస్తుంది.
దరఖాస్తులు 726
జిల్లాలో బీసీ జనాభా 13,00,174 ఉంది. ఇందులో 70 శాతం మంది పేదలు ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెళ్లిళ్లు చేసుకున్న పేదింటి బీసీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకు
ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు బీసీలు 671, ఓబీసీలు 55 మొత్తం కలిపి 726 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. అయితే వీటిని పరిశీలన జరిపి మంజూరు చేయాల్సి ఉంది. అయితే పరిశీలన అనంతరం పక్షం రోజుల్లో ప్రభుత్వం నుంచి నేరుగా వధువు ఖాతాలో డబ్బులు జమ కావాలి. కానీ.. దరఖాస్తులు చేసుకుని రెండు నెలలవుతున్నా ఇంతవరకు పరిశీలన జరగలేదు. నిధులూ జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే నిధులు ఆర్థికంగా దోహదపడుతాయని అనుకున్న తల్లిదండ్రులకు అందని ద్రాక్షలా మారాయి. 726 మంది దరఖాస్తు దారులకు ఒక్కొక్కరికి రూ.51,000 చొప్పున మొత్తం జిల్లాకు రూ.3.70 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి.
పరిశీలన బాధ్యతలు తహసీల్దార్‌లకు అప్పగింత కల్యాణలక్ష్మి పథకం బీసీ, ఓబీసీలకు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన బాధ్యతలు తొలుత సహాయ సంక్షేమాధికారులు (ఏబీసీడబ్ల్యూఓ), వసతిగృహ వార్డెన్‌లకు అప్పగించింది. బీసీ సంక్షేమలో వార్డెన్‌లు తక్కువగా ఉండటంతో పరిశీలన ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో పరిశీలన బాధ్యతలను మండలాల తహసీల్దార్‌లకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో నమోదైన 726 దరఖాస్తులు ఇంత వరకు పరిశీలనకే నోచుకోలేదు. ఫలితంగా లబ్ధిదారులకు మరింత ఆలస్యం కానుంది.
ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు జరుగుతుంది. ఇప్పటి వరకు 726 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే పరిశీలన బాధ్యతలు వార్డెన్‌లకా? తహసీల్దార్‌లకా? అనే విషయంపై స్పష్టత రావాలి. పరిశీలన తరువాత మంజూరు చేస్తాం. ఆ తరువాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తరువాయి. - విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి