బీసీల ‘కల్యాణలక్ష్మి’ మార్గదర్శకాలు సిద్ధం
♦ సీఎం వద్దకు ఫైలు..
♦ సంతకం కాగానే ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గా ల కల్యాణలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యా యి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆమోదముద్ర వేసిన ఫైలును ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ సీఎంకు పంపారు. సీఎం సంతకం చేయగానే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. నిర్ణీత తేదీ (ఏప్రిల్ 1,2016) తర్వాత వివాహాలు చేసుకునేవారికే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద 2016-17 బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
దీని కింద బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన దాదాపు 60 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఆర్థికసాయం కోసం వచ్చే దరఖాస్తులను బట్టి అదనపు బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించే అవకాశముంది. పేదింటి వధువు బ్యాంక్ అకౌంట్‌లో రూ.51 వేలు నేరుగా జమ చేసేలా ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణలక్ష్మి, మైనారిటీల కోసం షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల మార్గదర్శకాలనే కొంచెం అటుఇటుగా అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందిన తర్వాత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయా వివరాలు, సమాచారాన్ని పరిశీలించి డబ్బును మంజూరు చేస్తారు. అనంతరం పెళ్లి కుమార్తె బ్యాంక్ అకౌంట్‌లో రూ.51 వేలు జమ అవుతాయి.
కావాల్సిన అర్హతలు
♦ తెలంగాణకు చెందిన బీసీ, ఈబీసీ అవివాహిత అమ్మాయిలై ఉండాలి.
♦ వధూవరులిద్దరికీ 18 ఏళ్ల వయస్సు నిండాలి
♦ కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ళీ ఏప్రిల్ 1, 2016 తర్వాత పెళ్లిళ్లు చేసుకునేవారికే వర్తింపు ళీ మొదటిసారి వివాహం చేసుకున్నవారే అర్హులు.
జత చేయాల్సిన పత్రాలు
♦ పుట్టిన తేదీ సర్టిఫికెట్, ళీ కుల,కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
♦ వధూవరుల ఆధార్‌కార్డులు ళీ పెళ్లికూతురు ఫొటోతో ఆమె పేరిట బ్యాంక్ ఖాతా వివరాలు ళీ గ్రామ పంచాయతీ/ఎమ్మార్వో/మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన పెళ్లి ధ్రువీకరణపత్రం ళీ ఆన్‌లైన్‌లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి