కల్యాణలక్ష్మి దరఖాస్తులకు లైన్ క్లియర్
♦ అందుబాటులోకి ‘ఈపాస్’ సేవలు...
♦ ఉపకార వేతన దరఖాస్తుకు 30 వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తులకు మార్గం సుగమమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గత నెల పన్నెండో తేదీ నుంచి ఈపాస్‌లో సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ స్తంభించిన విషయం తెలిసిందే. కొత్తగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావడం, వాటి పరిధిలోని గ్రామాలు, విద్యాసంస్థల వివరాలను వెబ్‌సైట్లో విభజించేందుకు ప్రభుత్వం సేవల్ని నిలిపివేసింది. తాజాగా ‘ఈపాస్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నెల రోజులపాటు కసరత్తు చేపట్టిన సాంకేతిక బృందం తాజాగా ప్రక్రియను పూర్తి చేసింది. 2016–17 విద్యాసంవత్సరంలో పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఫ్రెషర్స్‌తోపాటు రెన్యువల్(సీనియర్) విద్యార్థులు ఈపాస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2014–15, 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఈపాస్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో కొందరి పెళ్లిళ్లు జరిగాయి. నిబంధనలకు లోబడి ఉన్నవారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియలో పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతా నంబర్‌ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద పంపిణీ చేసే నగదును నేరుగా ఆ ఖాతాలో జమ చేయనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతా నంబర్‌ను ప్రభుత్వం అనివార్యం చేసింది.