కల్యాణలక్ష్మి ఏదీ?
- బీసీలకు దక్కని పథకం ఫలాలు
- జిల్లా వ్యాప్తంగా1,338 దరఖాస్తుల రిజిస్ట్రేషన్
- విచారణపై కానరాని స్పష్టత
- వార్డెన్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు
- మార్గదర్శకాలు మళ్లీ మారే అవకాశం ఉందంటున్న అధికారులు
నల్లగొండ: వెనకబడిన తరగతుల వారిపై కల్యాణ‘లక్ష్మి’ ఇంకా కనికరించలేదు. రాష్ట్రప్రభుత్వం 2014లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీసీలు, ఈబీసీ అమ్మాయిలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసింది. ఏప్రిల్1, 2016 నుంచి వివాహం చేసుకున్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1338 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది.
కానీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు తరచు మారుస్తుండడంతో సంబంధిత అధికారులు ఎటూ తేల్చు కోలేకపోతున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను పరిశీలించే బాధ్యతను తొలుత సంక్షేమ హాస్టళ్ల వారెన్లు, ఏబీసీడబ్ల్యూఓలకు అప్పగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కల్యాణ లక్ష్మి దరఖాస్తులను వార్డెన్‌లు విచారణ చేయొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటికే దరఖాస్తుల విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వార్డెన్లు అధికారుల ఆదేశాలతో ఆ ప్రక్రియను నిలిపేశారు.
సంక్షేమ అధికారులను తప్పించి దరఖాస్తులను విచారించే బాధ్యత ను తహసీల్దార్లకు కట్టబెడుతున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదు. ఇవేమీ తెలియని దరఖాస్తుదారులు అటు వార్డెన్ల దగ్గరికి.. మరో వైపు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నారు. వార్డెన్‌ల వద్దకు వెళ్లిన దరఖాస్తుదారులను తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లమని చెప్పి పంపిస్తున్నారు. దీంతో తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు అక్కడా చేదు అనుభవమే ఎదురవుతోంది.
మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు..
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా విచారణ చేసి వధువు ఖాతాలో రూ.51 వేలు జమ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు తప్ప విచారణ జోలికి వెళ్లలేదు. 1338 దరఖాస్తులకు గాను ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున రూ.63.23 కోట్లు లెక్కకట్టారు. దీంట్లో అర్హులైన వారిని ఎంపిక చేసిన అనంతరం ప్రభుత్వం నగదు ప్రోత్సాహాన్ని అందజేయనుంది. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు... ఆలేరు-15, అనుముల-21, ఆత్మకూరు (ఎం)-29, ఆత్మకూరు (ఎస్)-19, భువనగిరి అర్బన్-13, భువనగిరి-35, బీబీనగర్ 16, బొమ్మలరామారం 9, చందంపేట 12, చండూరు 29, చిలుకూరు 27, చింతపల్లి1, చిట్యాల 38, చివ్వెంల 13, చౌటుప్పుల్ 20, దామరచర్ల 29, దేవరకొండ23, దేవరకొండ అర్బన్ 4, గరిడేపల్లి 31, గుండాల 20, గరిడేపల్లి 9, గుర్రంపోడు 28, హుజూర్‌నగర్ 18, అర్వపల్లి 33, కనగల్ 20, క ట్టంగూరు 12, కేతేపల్లి 16, కోదాడ 31, మర్రిగూడ 21, మఠంపల్లి 13, మేళ్లచెర్వు 22, మిర్యాలగూడ 28, మిర్యాలగూడ అర్బన్ 4, మోతె 16, మోత్కూరు 25, తుర్కపల్లి 6, మునగాల 31, మునుగోడు 35, నడిగూడెం 17, నకిరేకల్ 25, నల్లగొండ 56, నల్లగొండ అర్బన్ 6, నాంపల్లి 13, సంస్థాన్ నారాయణ్ పూర్ 16, నార్కట్‌పల్లి 18, నేరేడుచర్ల 14, నిడమనూరు 23, నూతనకల్ 18, పీఏపల్లి 15, పెద్దవూర 9, పెన్‌పహాడ్ 15, పోచంపల్లి 12, రాజాపేట 13, రామన్నపేట 28, శాలిగౌరారం 31, సూర్యాపేట 37, సూర్యాపేట అర్బన్ 8, తిప్పర్తి 30, తిరుమలగిరి 27, త్రిపురారం 12, తుంగతుర్తి 32, వలిగొండ 35, వేములపల్లి 17, యాదగిరిగుట్ట 29.
తహసీల్దార్లకే విచారణ బాధ్యతలు
కల్యాణ లక్ష్మి దరఖాస్తుల విచారణ బాధ్యతలు వార్డెన్‌లు, ఏబీసీడబ్ల్యూఓలు చేయొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ ప్రక్రియను నిలిపేశాం. తహసీల్దార్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని ఉన్నతాధికారులు చెప్పారు. దీనికి సంబంధి ంచిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో జారీ కానున్నాయి. అందువల్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందకూడదని కోరుతున్నాం.
- రాజశేఖర్, బీసీ కార్పొరేషన్ డీడీ