సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
♦ ప్రభుత్వ సెలవు దినంగా గురునానక్ జయంతి ప్రకటన
హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. సిక్కుల గురువు గురునానక్‌దేవ్‌జీ మహారాజ్ 545(ప్రకాష్ ఉత్సవ్)వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అఫ్జల్‌గంజ్ అశోక్‌బజార్‌లోని గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విశాల్‌దివాన్(ఆధ్యాత్మిక సభ)లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,మూడు వందల ఏళ్లుగా నగరంతో అనుబంధం ఉన్న సిక్కులు సామూహిక ప్రార్థనలు నిర్వహిం చుకునేందుకు, సభలు, సమావేశాల ఏర్పాటుకు కమ్యూనిటీ భవనం, ప్రార్ధనామందిరం కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులను అందజేయనున్నట్లు వెల్లడిం చా రు. దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద గురుద్వారా నగరంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
సెలవు దినంగా నానక్ జయంతి
గురునానక్ జయంతి రోజును ఇక నుంచి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.అపారమైన ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో, కష్టపడేతత్వం గల సిక్కుల జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం కేసిఆర్ తన కుటుంబం తరపున రూ.1.16 లక్షల చెక్కును గురుద్వారా నిర్మాణం నిమిత్తం నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు 30వేలమంది సిక్కులు కుటుంబాల సమేతంగా పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిక్కు మతగురువులు భక్తి, భజన కీర్తనలు ఆలపించడంతో పాటు గురునానక్ దేవ్‌జీ మహరాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలను, సందేశాలను బోధించారు.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ, అల్పాహారం, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గురుద్వారాల ఛైర్మన్ గురుచరణసింగ్‌బగ్గా, టీఆర్‌ఎస్ పార్టీ గోషామహల్, అంబర్‌పేట్ నియోజకవర్గాల ఇంచార్జిలు ప్రేమ్‌కుమార్‌ధూత్, ఎడ్ల సుధాకర్‌రెడ్డి, అశోక్‌బజార్ గురుద్వారా శ్రీ గురుసింగ్‌సభ అధ్యక్షుడు కుల్‌దీప్‌సింగ్‌బగ్గా, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు బల్‌దేవ్‌సింగ్ బగ్గా, కార్యదర్శులు ఇంద్రజిత్‌సింగ్ టుటేజా, అవతార్‌సింగ్ కనూజా, గురుద్వారాల ప్రబంధక్ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో సిక్కుసోదరులు పాల్గొన్నారు.