
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సిబ్బంది కోతలపర్వాన్ని కొనసాగిస్తోంది. ఇందులోభాగంగా తాజాగా ‘వాయిస్ ఆఫ్ అమెరికా’బ్రాడ్‌కాస్టర్ మీడియా సంస్థలోని మొత్తం సిబ్బందిని ప్రభుత్వం సెలవుపై పంపించింది. వాయిస్ ఆఫ్ అమెరికా అనేది ప్రభుత్వ నిధులతో పనిచేసే బహుళజాతి మీడియా సంస్థ. ఇది 40 భాషల్లో రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్, సోషల్‌మీడియాల్లో అమెరికా సంబంధ సమాచార, సాంస్కృతి కార్యక్రమాలను ప్రసారంచేస్తోంది. ఈ సంస్థలో మొత్తం 1,300 మంది సిబ్బంది ఉన్నారు.
వీళ్లందరినీ సెలవుపై పంపుతున్నట్లు ఈ బ్రాడ్‌కాస్టర్ మీడియా ఏజెన్సీ సీనియర్ మహిళా సలహాదారు కరీ లేక్ చెప్పారు. ‘‘యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా(యూఎస్‌ఏజీఎం) నిధులతో నడిచే వాయిస్ ఆఫ్ అమెరికా, ఆఫీస్ ఆఫ్ క్యూబా బ్రాడ్‌కాస్టింగ్‌లలో మీరు పనిచేస్తుంటేగనక వెంటనే మీ ఈ–మెయిల్‌ను చెక్ చేసుకోండి’’అని కరీలేక్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. శుక్రవారం ‘ప్రభుత్వ రంగ సిబ్బంది తగ్గింపు కొనసాగింపు’కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశాక ‘వాయిస్ ఆఫ్ అమెరికా’పై ప్రభుత్వం కన్నేసింది. దీంతో 83 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ‘వాయిస్ ఆఫ్ అమెరికా’మూగబోయిందని సంస్థ డైరెక్టర్ మైఖేల్ అబ్రమోవిట్జ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment