Pandora Papers: అంతా పెద్దలే! | Sakshi Editorial On Pandora Papers | Sakshi
Sakshi News home page

Pandora Papers: అంతా పెద్దలే!

Published Wed, Oct 6 2021 12:26 AM | Last Updated on Wed, Oct 6 2021 12:27 AM

Sakshi Editorial On Pandora Papers

కళ్ళ ముందున్నా... కనిపించకుండా దాచిన నిజాలు బయటపడ్డప్పుడు కొందరికి కష్టం కలగచ్చు. మరికొందరికి కోపం రావచ్చు. అత్యధికులకు ఆ నిజాలతో ఆశ్చర్యం తప్పదు. ఆర్థిక లావాదేవీల రహస్యపత్రాల్ని ‘పండోరా పేపర్స్‌’ పేరిట ఆదివారం బయటపెట్టినప్పుడూ అంతే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోటీశ్వరులు అపరిమిత ఆదాయాన్ని పన్ను బెడద లేని పనామా, దుబాయ్‌ లాంటి దేశాల్లో ఆఫ్‌షోర్‌ కంపెనీలు, ట్రస్టులకు గుట్టుగా దోచిపెట్టి, దాచిపెట్టిన నిజం ఇప్పుడు మరోసారి సంచలనమైంది. రాజకీయాలు, వినోదం, వ్యాపారం, ఆటలు, ఆధ్యాత్మికత దాకా వివిధ రంగాల ‘పెద్ద మనుషుల’ పేర్లు డొల్ల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లు దాచినవారి జాబితాలో బయట పడ్డాయి. దేశాల నేతల సహా 130 మంది బిలియనీర్లు ఈ బాపతువారేనన్నది కళ్ళు తిరిగే నిజం. 

పరిశోధనే ప్రాణంగా గడిపే జర్నలిస్టుల కృషితో ‘ఇంటర్నేషనల్‌ కన్సార్టియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌’ (ఐసీఐజే) అయిదేళ్ళ క్రితం 2016లో ‘పనామా పేపర్స్‌’ను బయటపెట్టి తేనెతుట్టెను కదిలించింది. ఇప్పుడు ‘పండోరా పేపర్స్‌’తో మరో బాంబు పేల్చింది. అమెరికాలోని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ మొదలు భారత్‌లోని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ దాకా 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది దాకా జర్నలిస్టులు చేసిన పరిశోధన ఇది. మన దేశం నుంచి పలువురు ఐసీఐజే డేగకళ్ళకు చిక్కారు. దాంతో పన్నులెగవేస్తూ, ఆదాయాన్ని అక్రమంగా విదేశాల్లో దాచిపెడుతున్నట్టు పేర్లు బయటకొచ్చిన భారతీయులపై నిజనిర్ధారణ కోసం దర్యాప్తు జరపాలని కేంద్రం సోమవారం ఆదేశించాల్సి వచ్చింది. కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు సారథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, రిజర్వ్‌ బ్యాంక్, ఆర్థిక గూఢచర్య విభాగం (ఎఫ్‌ఐయు)తో కూడిన బృందం ఈ దర్యాప్తు సాగించనుంది.

మునుపటి ‘పనామా పేపర్స్‌’ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడీ ‘పండోరా పేపర్స్‌’ ఆ స్థాయిలో కాకపోయినా, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం రేపుతోంది. అనిల్‌ అంబానీ, సచిన్‌ టెండూల్కర్, జాకీష్రాఫ్, నీరా రాడియా లాంటి ప్రసిద్ధుల పేర్లు బయటకొచ్చాయి. పాతికేళ్ళ పైచిలుకుగా ఇలాంటి ‘పెద్దలు’ ఇంద్రభవనాలు, సముద్రతీర నివాసాలు, విలాసవంతమైన నౌకలు లాంటి ఆస్తిపాస్తుల రూపంలో తమ సంపదను దాచేస్తున్నారని కథనం. ప్రపంచం నలుమూలల్లోని 14 వేర్వేరు న్యాయ, ఆర్థికసేవల సంస్థల నుంచి సేకరించిన కోటీ 20 లక్షల రహస్యఫైళ్ళను తిరగేస్తే, తేలిన విషయమిది. ఇలా రహస్యంగా సంపదను పోగేసుకున్న వారిలో జోర్డాన్‌ రాజు, చెక్‌ ప్రధాని సహా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ – పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ల సన్నిహితులూ ఉన్నారు.

దేశ ఆర్థిక మంత్రి సహా అనేకులు ఆ జాబితాలో ఉండడం ఇమ్రాన్‌కు మింగుడుపడడం లేదు. ఎందుకంటే, ఆయన తన రాజకీయ బద్ధవిరోధి, మాజీ పీఎం నవాజ్‌ షరీఫ్‌ను ప్రభుత్వ పీఠంపై లేకుండా చేసింది అప్పట్లో బయటపడ్డ ‘పనామా పేపర్స్‌’ సాయంతోనే! ఇప్పుడీ ‘పండోరా పేపర్స్‌’ తన పీకలకు చుట్టుకుంటుందేమోనని దర్యాప్తుకు ఆదేశించారు. విచారణను ఎదుర్కొంటున్నవారు అధికార హోదాల్లో ఉంటే గనక, ఆ దర్యాప్తు ఆశించిన ఫలితాలివ్వదన్నది ఆ రోజుల నుంచి ఇమ్రాన్‌ వాదన. ఆ వాదనకు కట్టుబడి ఇప్పుడీ సన్నిహిత సహచరులను కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవి నుంచి వైదొలగమని ఆయన ఆదేశిస్తారా? ప్రధాని హోదాలో ఇమ్రాన్‌కు ఇది అగ్నిపరీక్షే. 

ఆర్థిక సలహాదార్ల పక్కావ్యూహంతో కొందరు ధనికులు ప్రభుత్వాల కన్నుగప్పి తమ సంపదను వేర్వేరు దేశాల్లో పెట్టడం చాలాకాలంగా ఉన్నదే. అయితే, విదేశీ ఖాతాలు, ఆఫ్‌షోర్‌ రిజిస్టర్డ్‌ ట్రస్టు లన్నింటిలోనూ దొంగ డబ్బే ఉందనలేం. వాటిలో అన్నీ కాకున్నా, కొన్నయితే అక్రమమే. ‘పండోరా’ లాంటి వెల్లడింపుల వల్ల అలాంటి బడా బాబుల జాతకాలు కట్టగట్టుకు బయటకొస్తాయి. ఆ సమాచారం ఆధారంగా వారి వివరాల కూపీ లాగి, అక్రమాలకు పాల్పడినట్టుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నిజానికి, మన దేశీయులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్ల మేర విదేశాలకు పంపే వీలుంది. అదే ప్రవాస భారతీయులకైతే ఆ పరిమితి అనేక రెట్లు ఎక్కువ. ప్రపంచమొక కుగ్రామమైన వేళ విదేశీ వ్యాపార ఒప్పందాలు, ఆదాయాలు మామూలయ్యాయి. అందుకే, అక్రమాలకు పాల్పడినట్టు తేలేంత వరకు ఈ సంపన్నులందరూ చట్టరీత్యా నిర్దోషులే.

వేధింపులు లేకుండా, వేగంగా దర్యాప్తు జరపడం అవసరం. నిజానికి, మనదేశంలో పన్ను భారం అమితంగా పెరిగేసరికి, సంపన్నులు పక్కచూపులు చూడడమూ పెరుగుతోంది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల నుంచి వెనక్కి వెళ్ళలేని వర్తమానంలో మన ప్రభుత్వాలు ఒక పని చేయవచ్చు. దేశంలో నుంచి భారీమొత్తంలో బయటకు ధనం తీసుకువెళ్ళే సంపన్నులకు ప్రోత్సాహ కాలు తగ్గించవచ్చు. మన పన్నుల విధానాన్ని అలా మార్చుకోవచ్చు. అదే సమయంలో శరవేగంతో దూసుకుపోతూ, అధిక రాబడినిచ్చే విపణిగా మన దేశపు ఆకర్షణ కొనసాగేలానూ జాగ్రత్తపడాలి.

అసలీ బెడద పోవాలంటే, బ్రిటన్‌లో లాగా ప్రతి ట్రస్టు, సంస్థ తాలూకు అసలైన ప్రయోజనం పొందే యజమాని ఎవరో తెలిసే పద్ధతి ప్రపంచమంతా ఉండాలి. విదేశీ మదుపరులకు కనిష్ఠమైన పన్నుతో ఆకర్షిస్తున్న ‘స్వర్గధామ’ దేశాలు తమ గడ్డ మీది సంస్థల చట్టబద్ధమైన యజమానులెవరో బయటపెట్టాలి. అలా వెల్లడించడానికి ‘జీ–20’ దేశాలు తుది గడువు పెట్టాలి. ప్రపంచవ్యాప్త కనిష్ఠ పన్ను 15 శాతం ఉండేలా చూస్తే, అసలీ దేశాల్లో దాచే అవసరమూ రాకపోవచ్చు. అలాంటివి లేనంత వరకు పనామా, పండోరా – ఇలా పెద్దల గుట్టు విప్పే పరిశోధనలు మరెన్నో రాక తప్పదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement