Pandora
-
పండోరా క్లస్టర్
అంతరిక్షంలో మనకు సుదూరంలో ఉన్న ‘పండోరాస్ క్లస్టర్’ తాలూకు అద్భుత దృశ్యాలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తొలిసారిగా తన అత్యాధునిక నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో ఇలా అందంగా బంధించింది! మూడు భారీ గెలాక్సీల సమూహాలు పరస్పరం కలసిపోయి ఒక మెగా క్టస్టర్‌గా ఏర్పడ్డ తీరును నాన్ని కూడా ఈ క్లస్టర్లో గమనించవచ్చని నాసా చెబుతోంది. అంతేగాక ఈ కలయిక వల్ల పుట్టుకొచ్చిన అతి శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల పండోరాకు ఆవల మరింత సుదూరాల్లోని గెలాక్సీలను కూడా పరిశీలించడం జేమ్స్ వెబ్‌కు సులువుగా మారిందట! పండోరా క్లస్టర్‌ను భూమి నుంచి ఇంత స్పష్టంగా వీక్షించగలగడం ఇదే తొలిసారి. -
Pandora Papers: అంతా పెద్దలే!
కళ్ళ ముందున్నా... కనిపించకుండా దాచిన నిజాలు బయటపడ్డప్పుడు కొందరికి కష్టం కలగచ్చు. మరికొందరికి కోపం రావచ్చు. అత్యధికులకు ఆ నిజాలతో ఆశ్చర్యం తప్పదు. ఆర్థిక లావాదేవీల రహస్యపత్రాల్ని ‘పండోరా పేపర్స్’ పేరిట ఆదివారం బయటపెట్టినప్పుడూ అంతే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోటీశ్వరులు అపరిమిత ఆదాయాన్ని పన్ను బెడద లేని పనామా, దుబాయ్ లాంటి దేశాల్లో ఆఫ్‌షోర్ కంపెనీలు, ట్రస్టులకు గుట్టుగా దోచిపెట్టి, దాచిపెట్టిన నిజం ఇప్పుడు మరోసారి సంచలనమైంది. రాజకీయాలు, వినోదం, వ్యాపారం, ఆటలు, ఆధ్యాత్మికత దాకా వివిధ రంగాల ‘పెద్ద మనుషుల’ పేర్లు డొల్ల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లు దాచినవారి జాబితాలో బయట పడ్డాయి. దేశాల నేతల సహా 130 మంది బిలియనీర్లు ఈ బాపతువారేనన్నది కళ్ళు తిరిగే నిజం. పరిశోధనే ప్రాణంగా గడిపే జర్నలిస్టుల కృషితో ‘ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ (ఐసీఐజే) అయిదేళ్ళ క్రితం 2016లో ‘పనామా పేపర్స్’ను బయటపెట్టి తేనెతుట్టెను కదిలించింది. ఇప్పుడు ‘పండోరా పేపర్స్’తో మరో బాంబు పేల్చింది. అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ మొదలు భారత్‌లోని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దాకా 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది దాకా జర్నలిస్టులు చేసిన పరిశోధన ఇది. మన దేశం నుంచి పలువురు ఐసీఐజే డేగకళ్ళకు చిక్కారు. దాంతో పన్నులెగవేస్తూ, ఆదాయాన్ని అక్రమంగా విదేశాల్లో దాచిపెడుతున్నట్టు పేర్లు బయటకొచ్చిన భారతీయులపై నిజనిర్ధారణ కోసం దర్యాప్తు జరపాలని కేంద్రం సోమవారం ఆదేశించాల్సి వచ్చింది. కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు సారథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక గూఢచర్య విభాగం (ఎఫ్ఐయు)తో కూడిన బృందం ఈ దర్యాప్తు సాగించనుంది. మునుపటి ‘పనామా పేపర్స్’ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడీ ‘పండోరా పేపర్స్’ ఆ స్థాయిలో కాకపోయినా, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం రేపుతోంది. అనిల్ అంబానీ, సచిన్ టెండూల్కర్, జాకీష్రాఫ్, నీరా రాడియా లాంటి ప్రసిద్ధుల పేర్లు బయటకొచ్చాయి. పాతికేళ్ళ పైచిలుకుగా ఇలాంటి ‘పెద్దలు’ ఇంద్రభవనాలు, సముద్రతీర నివాసాలు, విలాసవంతమైన నౌకలు లాంటి ఆస్తిపాస్తుల రూపంలో తమ సంపదను దాచేస్తున్నారని కథనం. ప్రపంచం నలుమూలల్లోని 14 వేర్వేరు న్యాయ, ఆర్థికసేవల సంస్థల నుంచి సేకరించిన కోటీ 20 లక్షల రహస్యఫైళ్ళను తిరగేస్తే, తేలిన విషయమిది. ఇలా రహస్యంగా సంపదను పోగేసుకున్న వారిలో జోర్డాన్ రాజు, చెక్ ప్రధాని సహా రష్యా అధ్యక్షుడు పుతిన్ – పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ల సన్నిహితులూ ఉన్నారు. దేశ ఆర్థిక మంత్రి సహా అనేకులు ఆ జాబితాలో ఉండడం ఇమ్రాన్‌కు మింగుడుపడడం లేదు. ఎందుకంటే, ఆయన తన రాజకీయ బద్ధవిరోధి, మాజీ పీఎం నవాజ్ షరీఫ్‌ను ప్రభుత్వ పీఠంపై లేకుండా చేసింది అప్పట్లో బయటపడ్డ ‘పనామా పేపర్స్’ సాయంతోనే! ఇప్పుడీ ‘పండోరా పేపర్స్’ తన పీకలకు చుట్టుకుంటుందేమోనని దర్యాప్తుకు ఆదేశించారు. విచారణను ఎదుర్కొంటున్నవారు అధికార హోదాల్లో ఉంటే గనక, ఆ దర్యాప్తు ఆశించిన ఫలితాలివ్వదన్నది ఆ రోజుల నుంచి ఇమ్రాన్ వాదన. ఆ వాదనకు కట్టుబడి ఇప్పుడీ సన్నిహిత సహచరులను కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవి నుంచి వైదొలగమని ఆయన ఆదేశిస్తారా? ప్రధాని హోదాలో ఇమ్రాన్‌కు ఇది అగ్నిపరీక్షే. ఆర్థిక సలహాదార్ల పక్కావ్యూహంతో కొందరు ధనికులు ప్రభుత్వాల కన్నుగప్పి తమ సంపదను వేర్వేరు దేశాల్లో పెట్టడం చాలాకాలంగా ఉన్నదే. అయితే, విదేశీ ఖాతాలు, ఆఫ్‌షోర్ రిజిస్టర్డ్ ట్రస్టు లన్నింటిలోనూ దొంగ డబ్బే ఉందనలేం. వాటిలో అన్నీ కాకున్నా, కొన్నయితే అక్రమమే. ‘పండోరా’ లాంటి వెల్లడింపుల వల్ల అలాంటి బడా బాబుల జాతకాలు కట్టగట్టుకు బయటకొస్తాయి. ఆ సమాచారం ఆధారంగా వారి వివరాల కూపీ లాగి, అక్రమాలకు పాల్పడినట్టుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నిజానికి, మన దేశీయులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్ల మేర విదేశాలకు పంపే వీలుంది. అదే ప్రవాస భారతీయులకైతే ఆ పరిమితి అనేక రెట్లు ఎక్కువ. ప్రపంచమొక కుగ్రామమైన వేళ విదేశీ వ్యాపార ఒప్పందాలు, ఆదాయాలు మామూలయ్యాయి. అందుకే, అక్రమాలకు పాల్పడినట్టు తేలేంత వరకు ఈ సంపన్నులందరూ చట్టరీత్యా నిర్దోషులే. వేధింపులు లేకుండా, వేగంగా దర్యాప్తు జరపడం అవసరం. నిజానికి, మనదేశంలో పన్ను భారం అమితంగా పెరిగేసరికి, సంపన్నులు పక్కచూపులు చూడడమూ పెరుగుతోంది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల నుంచి వెనక్కి వెళ్ళలేని వర్తమానంలో మన ప్రభుత్వాలు ఒక పని చేయవచ్చు. దేశంలో నుంచి భారీమొత్తంలో బయటకు ధనం తీసుకువెళ్ళే సంపన్నులకు ప్రోత్సాహ కాలు తగ్గించవచ్చు. మన పన్నుల విధానాన్ని అలా మార్చుకోవచ్చు. అదే సమయంలో శరవేగంతో దూసుకుపోతూ, అధిక రాబడినిచ్చే విపణిగా మన దేశపు ఆకర్షణ కొనసాగేలానూ జాగ్రత్తపడాలి. అసలీ బెడద పోవాలంటే, బ్రిటన్‌లో లాగా ప్రతి ట్రస్టు, సంస్థ తాలూకు అసలైన ప్రయోజనం పొందే యజమాని ఎవరో తెలిసే పద్ధతి ప్రపంచమంతా ఉండాలి. విదేశీ మదుపరులకు కనిష్ఠమైన పన్నుతో ఆకర్షిస్తున్న ‘స్వర్గధామ’ దేశాలు తమ గడ్డ మీది సంస్థల చట్టబద్ధమైన యజమానులెవరో బయటపెట్టాలి. అలా వెల్లడించడానికి ‘జీ–20’ దేశాలు తుది గడువు పెట్టాలి. ప్రపంచవ్యాప్త కనిష్ఠ పన్ను 15 శాతం ఉండేలా చూస్తే, అసలీ దేశాల్లో దాచే అవసరమూ రాకపోవచ్చు. అలాంటివి లేనంత వరకు పనామా, పండోరా – ఇలా పెద్దల గుట్టు విప్పే పరిశోధనలు మరెన్నో రాక తప్పదు. -
నల్ల ధనవంతుల గుట్టురట్టు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఆదివారం బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్ అని భావిస్తున్నారు. వీరిలో భారతదేశానికి చెందిన బడా బాబులు ఉండడం గమనార్హం. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. వీరిలో అమెరికా, ఇండియా, పాకిస్తాన్, యూకే, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. ► జోర్డాన్ రాజు, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు పండోరా పత్రాల్లో ఉన్నాయి. ► పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. ► ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ► బయోకాన్ సంస్థ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు. భారత్‌లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి ట్రస్టును ఏర్పాటు చేసింది. అతడు పారిపోవడానికి నెల రోజుల ముందు ఈ ట్రస్టును నెలకొల్పారు. ► 2016లో వెలుగులోకి వచి్చన పనామా పేపర్ల లీకు తర్వాత నల్ల ధనవంతులు అప్రమత్తమయ్యారు. విదేశాల్లోని తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా పునర్వ్యస్థీకరించుకున్నారు. అంటే ఆస్తులను చాలావరకు అమ్మేసుకొని, నగదుగా మార్చుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. ► జోర్డాన్ రాజు అబ్దుల్లా2 అమెరికా, యూకేలో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడబెట్టాడు.. ► పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయి. ► ఇమ్రాన్ ఖాన్ మిత్రుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంది. ► రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయి. ► యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 3,12,000 పౌండ్ల మేర స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారు. ఐసీఐజే ట్వీట్ తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేస్తామని ఐసీఐజే ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 600 మందికిపైగా పాత్రికేయులు ఈ ‘పండోరా పత్రాలను’సేకరించారని వెల్లడించింది. ఎంతో శ్రమించి పరిశోధన సాగించారని, ధనవంతుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక రహస్యాలను తెలుసుకున్నారని వివరించింది. -
ఉబెర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్!
యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందిస్తున్న ఉబర్, తన డ్రైవర్లకు మ్యూజిక్ ఆఫర్ చేయనుంది. దీనికోసం ఆన్ లైన్ రేడియో స్టేషన్ పండోరాతో జతకట్టింది. రైడింగ్ సమయాల్లో తేలికగా మ్యూజిక్ ను ఆలకించేందుకు వీలుగా తమ డ్రైవర్లకు కోసం ఈ ఆన్ లైన్ స్టేషన్ తో జతకట్టినట్టు ఉబర్ సోమవారం వెల్లడించింది. ఈ ఒప్పందం వల్ల రైడింగ్ సమయంలో డ్రైవర్లకు ఎలాంటి అలసట లేకుండా ఉండటంతో పాటు, ఆటోమోటివ్ మార్కెట్లో పండోరా ఉనికి చాటుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు పండోరా ఆపరేట్ చేసే ఆన్ లైన్ మ్యూజిక్ సేవల్లో ఈ ప్రోగ్రామ్ నేటి(సోమవారం) నుంచి ప్రారంభమవుతుందని ఉబర్ పేర్కొంది. మొదటి ఆరు నెలలు ఎలాంటి యాడ్ ల లేకుండా ఈ ఆఫర్ ను డ్రైవర్లకు అందిస్తుంది. అమెరికాలోని 450,000మంది యాక్టివ్ ఉబర్ డ్రైవర్లకు పండోరా మ్యూజిక్ సేవలు అందించేందుకు రెడీ అయింది. అయితే ఇంతకముందే పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ స్పాటిఫై తో డీల్ కుదుర్చుకుని రైడింగ్ సమయంలో సెలక్ట్ మ్యూజిక్ లను ఉబర్ తన డ్రైవర్లకు అందించింది. ప్రస్తుతం మ్యూజిక్ అనుభవాన్ని పునురుద్ధరించిన నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ను పండోరా ఆన్ లైన్ రేడియో స్టేషన్ తో కలిసి పునః ప్రారంభించింది. దీంతో ఉబర్ డ్రైవర్లు, ప్యాసెంజర్లు రైడింగ్ సమయంలో ఇక నుంచి తేలికగా మ్యూజిక్ ను ఆలకించవచ్చు. చాలామంది పండోరా శ్రోతలు ఉచిత యాడ్ లతో మ్యూజిక్ ను ఆస్వాదిస్తున్నారు. అయితే ఆన్ డిమాండ్ సర్వీసును ప్రారంభించాలని కాలిఫోర్నియా చెందిన ఈ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.