లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సోన్‌భద్ర నరమేధానికి సంబంధించి సంచలన విషయం వెలుగు చూసింది. 10 మంది రైతుల మరణానికి కారణమైన ఈ వివాదంలో కీలకమైన ల్యాండ్ డీల్ ఫైలు మాయమైపోయిందన్న వార్త కలకలం రేపుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, భూమి బదిలీ వివరాలను కలిగి ఉన్న 1955 ఫైలు మిస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ అటవీభూమి ఒక ట్రస్ట్ కిందకు ఎలా పోయింది అనేది ప్రశ్నార్ధంగా మారిన నేపథ్యంలో ఈ పేపర్లు మాయం కావడం గమనార్హం.
కాల్పుల ఉదంతం చోటు చేసుకున్న అయిదురోజుల తరువాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. జిల్లా రెవెన్యూ పత్రాల్లో దీనికి సంబంధించిన కీలక పత్రాలు లభించడం లేదని అధికారులు కూడా ధృవీకరించారు. డిసెంబర్ 17, 1955లో ఆదర్శ్ కోపరేటివ్ సొసైటీ పేరుతో రిజిస్టర్ అయిన పత్రాలు లభించడం లేదనీ, ఆరు దశాబ్దాల నాటి కేసుకు సంబంధించి తమ వద్ద1955 ఫైలు మినహా అన్ని పత్రాలు ఉన్నాయని సోన్‌భద్ర జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఘర్షణకు దారి తీసిన ఈ వివాదంలో 1950లో సుమారు 600 బిగాల భూమిని జమీందారీ నిర్మూలన , భూ సంస్కరణల చట్టం, బంజరు భూమిగా ప్రకటించారు. అనంతరం ఆ ప్రాంతంలోని ఆదివాసీలు (గోండ్లు) మూడు తరాలుగా ఆ భూమిని సాగు చేసుకొంటున్నారు. ఈ 600 బిగాల అధికారిక పత్రాలలో గ్రామ సభ భూమిగా నమోదు చేశారు. 1955లో, సుమారు 463 భిగాల భూమిని ఆదర్శ్ సహకారి సమితి అనే సమాజానికి బదిలీ చేశారు. బీహార్ కేడర్ మాజీ ఐఎఎస్ అధికారి ప్రభాత్ కుమార్ మిశ్రా దీన్ని స్థాపించారు. ఈ సొసైటీలో తన మామ మహేశ్ మిశ్రాను ప్రెసిడెంట్‌గాను, అతిని భార్య, కూతురిని ఆఫీసు బేరర్లుగాను నియమించారు. 1989 లో సిన్హా మరణం తరువాత, సుమారు 200 బిగాల భూమిని సిన్హా కుమార్తె, మిశ్రా భార్య అయిన ఆశా మిశ్రా, మనువరాలు వినీత పేరుతో బదిలీ చేశారు.
అయితే 2017లో ఈ భూమిని గ్రామ ప్రధాన్ యజ్ఞదత్‌తో పాటు మరో 10 మందికి రూ.2 కోట్లకు అమ్మారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా దత్ ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ భూమి తమదంటూ దత్ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేంచిన గోండ్లు, 2017 ఒప్పందం చట్టవిరుద్ధమంటూ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరస్పరం పలు కేసులు నమోదయ్యాయి. అయితే జూలై 6 న, 32 ట్రాక్టర్లు, 300 మందితో దత్ భూమికి మీదికి రావడంతో ఘర్షణ ముదిరింది. యజ్ఞదత్ మనుషులు నాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు.
ఇదిలావుండగా పదిమంది రైతుల హత్యపై నివేదిక సమర్పించాలని కోరుతూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సిఎస్‌టి) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసు జారీ చేసింది. కాగా మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అరెస్టు, ఎట్టకేలకు ఆమె బాధితులను కలవడంతోపాటు, కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment