‘పూలన్‌దేవి’ కేస్‌ డైరీ మాయం | Behmai massacre case diary missing | Sakshi
Sakshi News home page

‘పూలన్‌దేవి’ కేస్‌ డైరీ మాయం

Published Sun, Jan 19 2020 4:16 AM | Last Updated on Sun, Jan 19 2020 7:57 AM

Behmai massacre case diary missing - Sakshi

కాన్పూర్‌ దేహత్‌: బందిపోటు రాణి పూలన్‌ దేవి.. 1981 ఫిబ్రవరి 14వ తేదీన ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్‌ కులస్తులైన 20 మందిని పూలన్‌దేవి ముఠా ఊచకోత కోసింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆగ్రహంతో ఆమె ఈ రూపంలో తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు నలబై ఏళ్ల పాటు కోర్టులో వివిధ పరిణామాల మధ్య కొనసాగిన ఈ కేసు తుది దశకు రాగా, మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

బెహ్మాయి హత్యకాండగా పేరున్న ఈ ఘటనకు సంబంధించిన కీలకమైన కేసు డైరీ మాయమైంది. కోర్టు రికార్డుల్లో నుంచి బెహ్మాయి హత్యాకాండ కేసు డైరీ కనిపించకుండా పోయిందని సిబ్బంది చెప్పడంతో తీర్పును ప్రత్యేక కోర్టు (ఉత్తరప్రదేశ్‌లోని బందిపోటు ప్రభావిత ప్రాంత) జడ్జి సుధీర్‌ కుమార్‌ ఈనెల 24కు వాయిదా వేసినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ పోర్వాల్‌ తెలిపారు. దీని వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసు తుది తీర్పులో అలవిమాలిన జాప్యం, అనుమానాస్పదంగా కేసు డైరీ మాయంకావడాన్ని అలహాబాద్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళతామని తెలిపారు.  

భారత బందిపోటు రాణి!
రాజకీయాల్లోకి ప్రవేశించిన పూలన్‌దేవి సమాజ్‌వాదీ పార్టీ తరఫున 1996, 1999 ఎన్నికల్లో మిర్జాపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమెపై ఉన్న 55 కేసులను ‘ప్రజాభీష్టం మేరకు’అప్పటి యూపీ సీఎం ములాయం సింగ్‌  ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాన్ని కాన్పూర్‌ కోర్టు పక్కనబెట్టింది. తనపై కేసులన్నిటినీ కొట్టేయాల్సిందిగా పూలన్‌దేవి సుప్రీంకోర్టులో 2001లో పిటిషన్‌ వేయగా.. ముందుగా కాన్పూర్‌ కోర్టులో లొంగిపోవాలని కోర్టు సూచించింది. అవేమీ జరగకుండానే, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉండగా పూలన్‌దేవిని అదే ఏడాది దుండగులు కాల్చి చంపారు. సంచలనాలమయమైన ఆమె జీవిత కథ ఆధారంగా శేఖర్‌ కపూర్‌ దర్శకత్వంలో తీసిన ‘ఇండియాస్‌ బాండిట్‌ క్వీన్‌: ది ట్రూ స్టోరీ ఆఫ్‌ పూలన్‌దేవి’ సినిమా హిట్టయ్యింది.  పూలన్‌ దేవి పాత్రధారి సీమా బిశ్వాస్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందారు.

అత్యాచారానికి తీవ్ర ప్రతీకారం
బందిపోటు రాణి పూలన్‌ దేవి ముఠా 1981 ఫిబ్రవరి 14వ తేదీన కాన్పూర్‌ దేహత్‌ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్‌ కులస్తులైన 20 మందిని ఊచకోత కోసింది. ఆ గ్రామంలోని ఠాకూర్‌ కులస్తులు లాలా రామ్, శ్రీరామ్‌ అనే వారు తనపై అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగానే ఆమె ఈ హత్యాకాండకు ఒడిగట్టిందని చెబుతారు. ఈ ఘటన అప్పట్లో యూపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటి సీఎం వీపీ సింగ్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి అయిన విషయం తెలిసిందే.

ఈ కేసులో పూలన్‌ దేవితోపాటు 35 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో 8 మంది పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా మరో ముగ్గురు జాడ తెలియకుండా పోయారు. రెండేళ్ల తర్వాత 1983లో పూలన్‌దేవి మధ్యప్రదేశ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కింద పూలన్‌దేవి ఆ రాష్ట్రంలో లొంగిపోయారు. దీంతో ఆమెను ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు అప్పగించడానికి బదులుగా అప్పటి సీఎం అర్జున్‌ సింగ్‌ ఆమెను జైలుకు తరలించారు.

యూపీ పోలీసులు, కాన్పూర్‌ కోర్టు ఎన్ని సమన్లు, నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పంపినా ప్రభుత్వం పూలన్‌దేవికి అందజేయకుండా వెనక్కి పంపింది. 11 ఏళ్లపాటు గ్వాలియర్, జబల్పూర్‌ జైళ్లలో గడిపిన ఆమె..ఎటువంటి విచారణ లేకుండానే 1994లో జైలు నుంచి విడుదలయ్యారు. హత్యాకాండకు సంబంధించి పూలన్‌దేవి ముఠాలోని పోషా జైలు జీవితం గడుపుతుండగా, బిఖా, విశ్వనాథ్, శ్యామ్‌బాబు అనే వారు బెయిల్‌పై బయట ఉన్నారు. మాన్‌సింగ్‌ సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులపై 2012లో నేరారోపణ జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement