లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఘోరవాల్ పట్టణం సమీపంలోని మారుమూల గ్రామం ఉభాలో గ్రామపెద్ద మనుషులు బుధవారం విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ ‘భూమిని స్వాధీనం చేసుకోవడంలో తన దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి ముందుగానే నిశ్చయించుకునే, వందల సంఖ్యలో మనుషులను వెంటబెట్టుకుని గ్రామ పెద్ద యజ్ఞా దత్ వచ్చాడు.
32 ట్రాక్టర్లలో దాదాపు 200 మంది బలగాన్ని, ఆయుధాలను అతను తీసుకొచ్చాడు. 200 మంది యజ్ఞా దత్ మనుషులు వివాదంలో ఉన్న భూమి వద్దకు చేరుకున్నారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న మేమంతా అక్కడకు వెళ్లగానే, కనీసం మాట్లాడే సమయం కూడా ఇవ్వకుండా వారు తుపాకులతో మాపై కాల్పులు ప్రారంభించారు. యజ్ఞా దత్ మనుషులు తుపాకులు, ఆయుధాలతో వచ్చినట్లు మాకు ముందుగా తెలియదు. వారు కాల్పులు జరుపుతుండటంతో ప్రాణాలను కాపాడుకోవడానికి మేం తలో దిక్కుకు పరుగెత్తాం. దాదాపు అర్ధగంట పాటు వారు కాల్పులు జరిపారు.
కింద పడ్డ వారిని లాఠీలతో కొట్టారు’అని వివరించారు. ఎన్నో ఏళ్లుగా తాము ఈ భూమినే సాగు చేసుకుంటున్నామనీ, తమకు ఇదే జీవనాధారమనీ, ఇప్పుడు యజ్ఞా దత్ వచ్చి తమ భూములు లాక్కోడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. కాగా, కాల్పుల ఘటనలో 25 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. 36 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ భూమికి సంబంధించిన వివాదం కారణంగా బుధవారం ఉభా గ్రామంలో ఆ గ్రామపెద్ద యజ్ఞా దత్ మనుషులు బుధవారం గోండు జాతి గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపగా తొమ్మిది మంది మరణించడం తెలిసిందే.
ఖననానికి స్థలంపై అధికారులతో వాగ్వాదం
కాల్పుల ఘటనలో చనిపోయిన వారిని ఖననం చేసే స్థలంపై ఉభా గ్రామస్తులు గురువారం అధికారులతో వాదనకు దిగారు. 10 మంది మృతదేహాలను తాము వివాదాస్పద స్థలంలోనే పూడుస్తామని గ్రామస్తులు పట్టుబట్టారు. అధికారులు మాత్రం ఆ స్థలంలో వద్దనీ, సాధారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారో వీరి మృతదేహాలను కూడా అక్కడే ఖననం చేయాలని సూచిస్తున్నారు. గురువారం సాయంత్రానికి కూడా ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర శాసనమండలి కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్ర ఎస్పీ,ఎస్టీ కమిషన్ కూడా ఈ ఘటనపై సొంతంగా విచారణ జరపాలని నిర్ణయించింది. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆరోపించింది. ఘటనా స్థలాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ బృందం పరిశీలించి, దీనిపై సుప్రీంకోర్టు చేత జ్యుడీషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment