సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు.
తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు.
పనులు.. పోస్టింగులు
ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.
అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది.
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు
ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి..
ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment