Telangana News: కాంగ్రెస్‌కు అధికారమిస్తే అంధకారమే.. కేసీఆర్‌
Sakshi News home page

Praja Ashirvada Sabha: కాంగ్రెస్‌కు అధికారమిస్తే అంధకారమే.. కేసీఆర్‌

Published Mon, Nov 20 2023 1:32 AM | Last Updated on Wed, Nov 22 2023 11:45 AM

- - Sakshi

నాగర్‌కర్నూల్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

నాగర్‌కర్నూల్‌/అలంపూర్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ఆదివారం సీఎం కేసీఆర్‌ అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఒకప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ పరిస్థితులను ప్రజలకు వివరించారు. అభివృద్ధిని చూపి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సభలకు అన్ని చోట్లా వేలాదిగా గులాబీ శ్రేణులు తరలివచ్చారు. సీఎం ప్రసంగం కార్యకర్తల్లో జోష్‌ నింపింది.

మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మిస్తాం..
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం వస్తోందని.. ఆ పార్టీ ఉన్నన్ని రోజులు మన బతుకులు ఏం అయ్యాయో అందరికీ తెలుసని, పేదల ఆకలి బాధలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదని, ఆగం పట్టించి బతులకు నాశనం చేశారన్నారు. ఆనాడు జరిగిన అన్యాయాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వస్తున్నామన్నారు.

కాంగ్రెస్‌కు మరిచిపోయి ఓటేస్తే ధరణి తీసి బంగాళఖాతంలో కలుపుతామని చెబుతున్నారని విమర్శించారు. బోయలను బీసీలో పెడితే మాట్లాడలేదని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పెండింగ్‌ పెడితే పట్టించుకోదని ఆరోపించారు. అదే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే.. నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని కింద పడేసి కూర్చుంది తప్ప ముందుకు కదల్చలేదన్నారు.

ఈసారి కేంద్రం మెడలు వంచైనా వాల్మీకులను గిరిజనులుగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆర్డీఎస్‌ మీద తుమ్మిళ్ల కట్టుకున్నామని, దీని ద్వారా 30– 35 వేల ఎకరాలకు నీళ్లొస్తున్నాయన్నారు. మిగిలిన వాటికి నీళ్లందించడానికి మల్లమ్మకుంట రిజర్వాయర్‌ కావాలని, తప్పకుండా రిజర్వాయర్‌ నిర్మిస్తామని, త్వరలోనే చిన్నోనిపల్లిని పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ బతుకు పోరాటం
కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని కేసీఆర్‌ అన్నారు. ‘ఇందిరమ్మ మనువడు రాహుల్‌గాంధీ మొన్న కొల్లాపూర్‌కు ఎందుకు వచ్చిండు.. మనల్ని ఆగం పట్టించేందుక.. మళ్ల కరెంట్‌ బంద్‌ పెట్టేందుక.. మనకు ముళ్ల కిరీటం పెట్టేందుక అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు.

ఇప్పుడు మనమే ఇతరులకు తిండి పెట్టే స్థితికి చేరుకున్నాం. కొల్లాపూర్‌లో ఒకప్పుడు గుంపు మేసీ్త్రలు ఉండేవాళ్లు.. ఇక్కడి నుంచి బొంబాయికి పనులకు వెళ్లే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మనమే ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నాం. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. తెలంగాణ బతుకుదెరువు పోరాటం అని.. మన బతుకు, మన తలరాత రాసే ఓట్లు ఇవి. హర్షవర్ధన్‌రెడ్డి ఏం పని చేసిండు.. ఇంతకు ముందున్న ఆయన ఏం పని చేసిండు.. అనేది మీకు తెల్వదా.. పోలీసోళ్లకు పట్టిచ్చుడు. కేసులు పెట్టుడు. ముఠా రాజకీయాలు కట్టుడు. కక్ష తీసుకొనుడు.

ఇవి తప్ప వేరే పనేమైనా చేసిండా’ అని పరోక్షంగా మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. ‘ఐదేళ్లు మంత్రిగా ఉండే అందుకే మీరు కోపంతో ఆయనను ఓడగొట్టేసిండ్రు. మళ్ల ఇప్పుడు కొత్త వేషం వేసుకొని వస్తడు. మళ్ల మాట్లాడతడు. వారు ఇంతకుముందు పెట్టిన వెలుగులేంటి.. హర్షవర్ధన్‌రెడ్డి ఖరాబ్‌ చేసిందేంది. ఆయనకు ఎందుకు ఎయ్యాలె ఓటు. ఓట్లు ఒట్టిగనే ఏయొద్దు. దయచేసి మీ గ్రామాల్లో చర్చించండి అని ఓటర్లను కోరారు.

మీ ఎమ్మెల్యే హర్ష నన్ను అ డుగుతుంటడు. కాల్వల బాగుకు, అభివృద్ధి పనుల కు నిధులు ఇవ్వండని కోరుతుంటడు. సింగోటం– గోపల్‌దిన్నె లింక్‌ కెనాల్‌ పూర్తిచేస్తం. బాచారం హైలెవెల్‌ కెనాల్‌ త్వరలోనే పూర్తవుతది. మామిడి మార్కెట్‌ను పెట్టుకొని దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతం. మీ ఎమ్మెల్యే మామూలోడు కాదు. బీజేపోళ్లు వచ్చి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొందామని, వంద కోట్లకో ఎమ్మెల్యేను కొంటామని లంగ దుకాణం పెట్టిండ్రు.

మీ ఎమ్మెల్యే నిజాయితీగా నిలబడి ఆ దొంగలను పట్టిచ్చి జైళ్ల పెట్టిచ్చిండు. ఇంత న్యాయంగా, నిజాయితీ ఉండే మీ ఎమ్మెల్యే కొల్లాపూర్‌లో కొన్ని కాలేజీలు పెట్టిచ్చిండు. మొన్ననే కొన్ని పనులకు నిధులు ఇచ్చాం. వంద పడకల ఆస్పత్రి తెప్పిచ్చిండు. మున్సిపల్‌ అభివృద్ధికి రూ.25 కోట్లు ఇచ్చాం. హర్ష కోరిన మరిన్ని పనులు కూడా చేస్తాం. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించండి.’అని కోరారు.

పదేళ్ల క్రితం ఎట్లుండె..ఇప్పుడెట్లుందో చూడండి..

రైతులకు ప్రాజెక్టు కాల్వల ద్వారా సాగునీరందిస్తే ఏ రాష్టంలో అయినా పన్నులు వసూలు చేస్తారు.. కానీ, కేఎల్‌ఐ ద్వారా పారే నీటికి పన్ను లేదని, పాతబకాయిలు కూడా రద్దు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో పాలమూరుకు పెండింగ్‌ జిల్లా అనే పేరు పెట్టారని, ప్రతి ప్రాజెక్టు పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని, ఫలితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వరికుప్పలే కనిపిస్తున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం పాలమూరు ఎట్లుండె.. ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలన్నారు. పాలమూరు చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా.. కనీసం మంచినీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. నిజాం కాలంలోనే నాగర్‌కర్నూల్‌ జిల్లాగా ఉండేదని, కాంగ్రెస్‌ హయాంలో ఆగం చేస్తే.. తెలంగాణ వచ్చాక మళ్లీ జిల్లా చేశామని కేసీఆర్‌ అన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మార్కండేయ లిఫ్టు మంజూరు చేశామని, నాలుగు రోజుల క్రితం నీరు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ఇటీవల పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పంపు ప్రారంభించామని, వట్టెం రిజర్వాయర్‌ పూర్తయితే మరో 40– 50 వేల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ ప్రభుత్వమే మన తలరాత ఐదేళ్లు రాస్తుందన్నారు.

సాగునీటి కష్టాలు తీరుస్తా.. 
కల్వకుర్తి రైతుల సాగుకష్టాలు తీర్చే బాధ్యత తనదేనని సీఎం అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ రైతుల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 80వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కల్వకుర్తిలో ఇంజినీరింగ్‌ కళాశాల, ఐటీ హబ్, కొత్తమండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆయా సభల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామ్‌రెడ్డి, ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్, నాయకులు ఎడ్మ సత్యం, విష్ణు వర్ధన్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, రంగినేని అభిలారావు, గౌరారం వెంకట్‌రెడ్డి, విజయ్, తిరుపతమ్మగౌడ్, రఘువర్ధన్‌రెడ్డి, విజయలక్ష్మీ, కిషన్‌నాయక్, బోజ్యానాయక్, నరేందర్‌రెడ్డి, చంద్రశేఖరాచారి, జాఫర్, రుక్మద్దీన్, సురేందర్‌రావు పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement