అచ్చంపేట: ఎన్నికల్లో గెలుపొంది ప్రజాప్రతినిధిగా పేరు పొందాలని అనుకోని రాజకీయ నాయకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అందుకోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేయడం పరిపాటి. ప్రస్తుత ఎన్నికల్లో తమదే పైచేయి కావాలనే తలంపుతో కొందరు అభ్యర్థులు పంచాస్త్రాలను సంధిస్తున్నారు. ప్రధానంగా డబ్బు, మద్యం, అంగబలం, వాగ్దానం, ఫిరాయింపులను నమ్ముకుంటున్నారు.
ప్రతి ఎన్నికల్లో ఇవి రాజకీయాలను శాసిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇవి రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. ఓటర్లను నాయకులు అనేక రకాలుగా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఈ పంచాస్త్రాలను పావులుగా వాడుకున్నవారే రాజకీయాల్లో నెగ్గగలడు అనే స్థాయిలో నేటి రాజకీయాలు ఉన్నాయి.
డబ్బు: డబ్బుకు ఓటరు దాసోహం అన్నట్లుగా నోటు ఇచ్చి ఓటు వేయించుకునే పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మనిషికి పంచభూతాల్లో భూమి ఎంత అవసరమో రాజకీయాల్లో డబ్బుకు అంత ప్రాధాన్యం ఉంది. కోట్లను మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ఎన్నికల్లో గెలువడానికి యత్నిస్తున్నారు. అధికారం కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి వెనకాడటంలేదు.
మద్యం: పంచభూతాల్లో నీరు ఎంత ముఖ్యమో రాజకీయాస్త్రాల్లో మద్యానికి అంతకుమించి ప్రాధాన్యం ఉంది.పోటీల్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంతో ఆరంభించి, విజేతలయ్యే వరకు మద్యాన్ని ఏరులా పారించడం పరిపాటిగా మారింది. ఓటరుకు మద్యం బాటిల్స్ ఇచ్చి ఓటు వేయించుకునే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి.
అంగబలం: బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా రాజకీయ నాయకులకు అంగబలం లేకపోతే అన్ని చచ్చుబడినట్టే. అందుకే తమ చుట్టూ 10మంది ఉండేలా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తుంటారు నాయకులు. టికెట్ వస్తే ప్రచారానికి, రాకపోతే దిష్టిబొమ్మలు తగలబెట్టడానికి ఉపయోగపడ్తారు. లేదంటే ఎదుటి వ్యక్తులపై విమర్శలు చేస్తారు. మొత్తమ్మీద లీడర్‌కు అంగుబలం ప్రాణవాయువుతో సమానం.
వాగ్దానం: అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడంలో మన నాయకులు ఆరితేరారు. అధికారం చేజెక్కిన తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కనిపించకుండాపోవడం ఈ వాగ్దానభూత రాజకీయ లక్షణం. పక్కా ఇళ్లు, స్థలాలు, ఉచిత బీమా ఇతర ఉచిత పథకాలపై అనేక వాగ్దానాలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ అస్త్రం నాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఫిరాయింపులు: ఈ అస్త్రంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియకుండా పోతోంది. రాజకీయాల్లో ఈ అస్త్రానికి ప్రత్యేక స్థానం. గోడమీది పిల్లిలా, తక్కెడలోని కప్పలాంటి లక్షణాలతో టికెట్ రాకపోయినా, సరైన ప్రాధాన్యం దక్కకపోయినా లేదా తమ స్వప్రయోజనాల కోసమో నాయకులు ఈ అస్త్రాన్ని ఎక్కువగా వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment