జడ్చర్ల: పరిశ్రమల వాడగా గుర్తింపు పొందిన జడ్చర్ల నియోజకవర్గంలో పాగ వేసేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలవాలని బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి సారిగా బరిలో నిలిచిన అనిరుధ్‌రెడ్డి విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
1961లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడగా, 1962లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఐదు సార్లు టీడీపీ విజయం సాధించగా.. నాలుగు సార్లు కాంగ్రెస్, మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ మద్ధతుతో బీఆర్‌ఎస్ గెలుపొందగా, 2008లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2009లో బీఆర్‌ఎస్ మద్ధతుతో టీడీపీ గెలుపొందగా.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి విజయం సాధించారు.
స్వతంత్ర అభ్యర్థుల విజయం..
1962లో కొత్త కేశవులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా.. 1967లో ఎల్‌ఎన్.రెడ్డి (లక్ష్మీనర్సింహారెడ్డి) ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1983లో ఎం.కృష్ణారెడ్డికి టీడీపీ బీఫాం సకాలంలో అందకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.
అత్యధిక, అత్యల్ప మెజార్టీలు..
1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మరాఠి సత్యనారాయణకు 72,758 ఓట్లు పోలవ్వగా, 53,779 మెజార్టీతో విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం.కృష్ణారెడ్డిపై కేవలం 1,051 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
హ్యాట్రిక్ దక్కేనా?
జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎవరూ గెలుపొందలేదు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినా.. వరుసగా విజయం సాధించకపోవడంతో ఎవరికీ హ్యాట్రిక్ దక్కలేదు. టీడీపీ నుంచి ఎం.చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్) 1996, 1999, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సి.లక్ష్మారెడ్డి 2004, 2014, 2018 ఎన్నికల్లో గెలపొందారు. ఈ విడత ఎన్నికల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపొందితే హ్యాట్రిక్ దక్కుతుంది.
తొలి ఎమ్మెల్యే కొత్త కేశవులు..
జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1962లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పట్టణానికి చెందిన కొత్త కేశవులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త కేశవులు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి కె.జనార్దన్‌రెడ్డిపై 4,830 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొత్త కేశవులుకు 17,927 ఓట్లు రాగా, జనార్దన్‌రెడ్డికి 13,097 ఓట్లు వచ్చాయి.
రెండు ఉప ఎన్నికలు..
జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి రెండు సార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1996లో టీడీపీకి చెందిన ఎం.సత్యనారాయణ హత్యకు గురి కావడంతో ఉపఎన్నిక రాగా, అతడి సోదరుడు ఎం.చంద్రశేఖర్ మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి విజయం సాధించారు.
బీసీ నియోజకవర్గంగా గుర్తింపు..
నియోజకవర్గంలో బీసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బీసీ అభ్యర్థులకు మొదటి నుంచి కలిసి వస్తోంది. మొదటి నుంచి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. 1972, 1978లలో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన బీసీ అభ్యర్థి నర్సప్ప ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్ర సత్యనారాయణ విజయం సాధించారు. ఆయన మరణాంతరం ఆయన సోదరుడు ఎర్ర శేఖర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన ఎం.కృష్ణారెడ్డి ఒకసారి ఇండిపెండెంట్‌గా, మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు. వీరి తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు.
భౌగోళిక స్వరూపం..
జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉండగా, మిగతా ఐదు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయి. అదేవిదంగా ఓ వైపు 44వ జాతీయ రహదారి ఉండగా.. మరో వైపు 167వ నంబర్ జాతీయ రహదారి ఉంది. నియోజకవర్గంలో జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట, మిడ్జిల్, ఊర్కొండ మండలాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment