వాయనం: కలర్‌ఫుల్ బ్యాగ్స్ తయారు చేద్దామా!
పాలిథీన్ బ్యాగ్స్‌ని వాడకూడదని పర్యావరణవేత్తలు చెప్పడంతో వాటి వాడకం తగ్గిపోయింది. వాటి స్థానంలో పేపర్‌బ్యాగ్స్ వాడుతున్నారు. అయితే వాటి ఖరీదు పాలిథీన్ బ్యాగ్‌స కంటే కొంచెం ఎక్కువ. అదే కాస్త ఇబ్బంది. కానీ దీనికో మంచి పరిష్కార మేమిటంటే బ్యాగ్‌సని మనమే చేసుకోవడం!
నిజానికి పేపర్ బ్యాగ్ తయారు చేయడం చాలా తేలిక. పేపర్, గమ్, చిన్న తాడు, కత్తెర ఉంటే చాలు. ముందుగా పేపర్‌ను ముడతలు లేకుండా నేలమీద పరవాలి. బ్యాగ్ ఎంత పొడవు, వెడల్పు ఉండాలో... అంత పొడవు, వెడల్పు ఉన్న రెండు మూడు పుస్తకాలను దొంతరలాగా పేపర్ మీద పెట్టాలి. తర్వాత పేపర్‌ని అన్ని వైపులా మడవాలి (ఫొటో 1,2,3). ఒక పక్క వదిలేసి మిగతా అన్ని పక్కలా కాగితాన్ని గమ్‌తో అంటించాలి. అంటించని వైపున మడతను విప్పి పుస్తకాలు బయటకు తీసేయాలి (ఫొటో 4లో చూపినట్టు అవుతుంది). ఆపైన మడత విప్పిన వైపున కాగితాన్ని సమానంగా పట్టుకుని కత్తిరించాలి (ఫొటో 5). చివరిగా బ్యాగుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి తాడు లేక వైరును అమర్చుకోవాలి (ఫొటో 6). అంతే... బ్యాగ్ రెడీ అయిపోయినట్టే!
స్టేషనరీ షాపుల్లో రకరకాల కాగితాలు, డిజైన్లతో దొరుకుతాయి. తెచ్చుకుని ఒకేసారి నాలుగైదు బ్యాగ్స్ చేసి పెట్టేసుకుంటే... అస్తమానం బ్యాగ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. కాస్త మందంగా ఉన్నవి ఎంచుకుంటే ఎక్కువ బరువును తట్టుకుంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.
బ్యాచిలర్స్ కోసం భలే మెషీన్!
ఇడ్లీని మించిన టిఫిన్ మరొకటి లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇడ్లీని కాస్త ఎక్కువగానే తింటుంటాం మనం. అయితే బ్యాచిలర్స్‌కి వీటిని రోజూ తినే అదృష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంత కష్టపడి ఇడ్లీలు చేసుకోలేరు. పప్పు నానబెట్టాలి, కడగాలి, రుబ్బాలి, ఇడ్లీ గిన్నెల్లో వేయాలి, నీళ్లు పోసి కుక్కర్‌లో పెట్టి ఆన్ చేయాలి, కూత పెట్టేవరకూ చూసి ఆపాలి... అబ్బబ్బబ్బ, బోలెడు పని అంటారు వాళ్లు. అయితే వాళ్లకు తెలియనిది ఒకటుంది. ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ.
ఇక్కడున్న ఈ బుజ్జి మిషన్... ఇడ్లీలను చాల ఈజీగా వండేస్తుంది. ఇందులో ఉన్న గిన్నెల్లో పిండిని పోసి, మూతపెట్టి, స్విచ్ ఆన్ చేయడమే. క్షణాల్లో ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కాచుకుని కూచోవాల్సిన పని లేదు. ఇడ్లీలు తయారయ్యాక కుక్కర్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. కాబట్టి ఆన్‌చేసి, బయటకు కూడా వెళ్లి రావచ్చు. మరి పిండి సంగతేంటి అంటారా? ఆల్రెడీ మార్కెట్లో రెడీమేడ్ పిండి దొరకుతోంది. పచ్చళ్లూ దొరుకుతున్నాయి. కాబట్టి నో టెన్షన్. దీని ధర రూ. 1,100. ఆన్‌లైన్లో కొంటే రూ.900. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్‌కి గుడ్లు కూడా మంచి ఫుడ్డే కదా! అలాగని వాళ్లే కొనాలని లేదు. కరెంటుతో పని చేస్తుంది కాబట్టి గ్యాస్ అయిపోయినప్పుడు వాడుకోవడానికి అందరిళ్లలో ఉండటం మంచిదే!