సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రత్యక్ష విద్యా బోధన దెబ్బతిన్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షల్లో ఉండే 11 ప్రశ్నపత్రాలను ఆరుకు కుదించింది. ప్రశ్నల్లో రెట్టింపు చాయిస్ ఉండేలా ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 10 ప్రశ్నలకు జవాబు రాయాలని అడిగే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టనుంది. గతం లో 10 మార్కులకే ఉన్న ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలను 20 మార్కులకు పెంచేలా చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు లభించనుండగా, ఒత్తిడికి లోనుకాకుండా కూడా ఉంటారు. మే 17 నుంచి నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో వీటిని అమలు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షల సమయం పెంపు..
పదో తరగతి పరీక్షల సమయాన్ని ప్రభుత్వం మరో అర గంట పెంచింది. గతంలో 2.45 గంటలు ఉన్న పరీక్ష సమయాన్ని 3.15 గంటలకు పొడిగించింది. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించిన ఆన్‌లైన్ బోధన, ప్రస్తుతం చేపట్టబోయే ప్రత్యక్ష బోధనకు సంబంధించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో కోర్ కాన్సెప్ట్‌లు, బోధించించాల్సిన అంశాలకు సంబంధించి ఇప్పటికే కేలండర్‌ను ప్రకటించింది. వాటి ప్రకారమే ప్రశ్నలు అడిగేలా చర్యలు చేపట్టింది. జనరల్ సైన్స్ ప్రశ్నపత్రం కూడా ఒక్కటే ఉంటుంది. అయితే అందులో మూల్యాంకన సౌలభ్యం కోసం ఫిజికల్ సైన్స్ (పార్ట్–ఎ)కు, బయోలాజికల్ సైన్స్‌కు (పార్ట్–బి) వేర్వేరుగా జవాబు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాత పరీక్ష, ఇంటర్నల్స్ మార్కుల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 చొప్పున 600 మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ కోర్సుల్లోనూ ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.
ఇదీ ప్రశ్న పత్రాల స్వరూపం
– 2 ఫార్మేటివ్ అసెస్‌మెంట్స్ కింద ఇంటర్నల్స్‌కు 20 మార్కులు
– ఒక్కో ప్రశ్న పత్రంలో 20 ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలకు 20 మార్కులు
– వాక్య రూపంలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి.
60 మార్కుల కోసం ఇచ్చే ప్రశ్నల స్వరూపం
– వ్యాసరూప ప్రశ్నల విభాగంలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్‌లో ఇచ్చే 3 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. మరో సెక్షన్‌లోనూ 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. 8 మార్కులు ఉంటాయి. ఇందులో మొత్తంగా 16 మార్కులు.
– స్వీయ రచన విభాగంలో 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 4 చొప్పున 8 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 చొప్పున 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి.
– సృజనాత్మకత విభాగంలో 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి.
– అవగాహన, ప్రతిస్పందన విభాగంలో మూడు ప్యాసేజీలు ఉంటాయి. వాటికి 20 మార్కులు ఉంటాయి.
– గతంలో ద్వితీయ భాష మినహా మిగతా 5 సబ్జెక్టుల్లో రెండు చొప్పున 10 పేపర్లు ఉండేవి. ఇప్పుడు ద్వితీయ భాష, మిగతా 5 సబ్జెక్టులకు 5 పేపర్లే ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలవి 20 మార్కులు కలుపుకొని 80 మార్కులకు ఒక్కో ప్రశ్న పత్రాన్ని ఇస్తారు. ఇలా మొత్తంగా 480 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్ 20 మార్కులు ఉంటాయి. ఇలా ద్వితీయ భాష, 5 సబ్జెక్టుల్లో మొత్తం 120 మార్కులు ఉంటాయి.
– గతంలో హిందీ మినహా ఇతర సబ్జెక్టుల్లో ఉన్న 10 పేపర్లలో ఒక్కో పేపర్‌లో ఆబ్జెక్టివ్‌ను 5 మార్కులకు 10 ప్రశ్నలు ఇచ్చి ఒక్కో దానికి అర మార్కు ఇచ్చేవారు. ఇలా ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లలో కలిపి 10 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 20 మార్కులు ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment