Donald Trump Charged Over Secret Documents Case - Sakshi
Sakshi News home page

రహస్య పత్రాల కేసు.. చిక్కుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌!.. రుజువైతే వందేళ్ల శిక్ష!!

Published Fri, Jun 9 2023 10:12 AM | Last Updated on Sat, Jun 10 2023 5:29 AM

Donald Trump Charged Over Secret Documents - Sakshi

అమెరికా అధ్యక్షుడు ఎవరైనా పదవి దిగిపోయిన వెంటనే తన అధీనంలో ఉన్న ప్రభుత్వ డాక్యుమెంట్లు జాతీయ ఆర్కీవ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ ఏజెన్సీ (ఎన్‌ఏఆర్‌ఏ)కి అప్పగించాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆ రహస్య పత్రాలన్నీ జాతి సంపదగా భావిస్తారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి పాలైన కొద్ది నెలలకి అంటే 2021 మేలో ఎన్‌ఏఆర్‌ఏ ట్రంప్‌ రహస్య పత్రాలు పూర్తిగా ఇవ్వలేదని తొలిసారిగా బయటపెట్టింది.

రెండు డజన్ల బాక్సుల్లో ఉండే పత్రాలు ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై విచారణ మొదలై ట్రంప్‌ అధీనంలో ఉన్న రహస్య పత్రాలన్నీ ఆర్కీవ్స్‌కు ఇవ్వాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2021 జనవరిలో అధ్యక్షుడిగా గద్దె దిగిన ట్రంప్‌ వందలాది పత్రాలను తన అధీనంలోనే ఉంచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో ట్రంప్‌ తరఫు లాయర్లు మరో 30 పత్రాలు అందజేశారు. అంతకు మించి తమ దగ్గర ఏవీ లేవని స్పష్టం చేశారు. 2022 ఆగస్టులో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగి ఫ్లోరిడాలోని ట్రంప్‌ ప్రైవేటు ఎస్టేట్‌ మార్‌ ఎ లాగోలో సోదాలు చేపడితే 15 బాక్సుల్లో 184 కీలక పత్రాలు లభించాయి.

ఇందులో 67 విశ్వసనీయ పత్రాలు, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే తరహా రహస్య పత్రాల కేసులో ట్రంప్‌ హయాంలో ఉపాధ్య’క్షుడిగా వ్యవహరించిన మైక్‌ పెన్స్, అంతకు ముందు ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై కేసులు నమోదై ఉన్నాయి. వైట్‌ హౌస్‌ నుంచి అత్యంత కీలకమైన డాక్యుమెంట్లను ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగానే తీసుకువెళ్లారా ? గూఢచర్య చట్ట నిబంధనల్ని ట్రంప్‌ ఉల్లంఘించారా ? అన్న దిశగా ప్రాసిక్యూషన్‌ విచారణ సాగిస్తోంది.అయితే శ్వేతసౌధం ఖాళీ చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంతో హడావుడిగా తీసుకువెళ్లిన సామాన్లలో పత్రాలు కూడా వచ్చి ఉంటాయని ట్రంప్‌ కార్యాలయం అప్పట్లో సమర్థించుకుంది.  
 

ట్రంప్‌ ఎదుర్కొంటున్న కేసులు ఇవే..!
హష్‌ మనీ
అగ్రరాజ్యం చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న ఒక మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ హష్‌ మనీ కేసులో నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పుడు తనతో లైంగిక సంబంధాలున్నా­యని ఆరోపించిన పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్‌ నోరు మూయించడానికి 1.30 లక్షల డాలర్లను ము­ట్టజెప్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ట్రంప్‌ లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వా­రా సొమ్ములు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ట్రంప్‌ మన్‌హట్టన్‌ క్రిమినల్‌ కోర్టుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 4న హాజరయ్యారు. 

 ఎన్నికల్లో అక్రమాలు
2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించడానికి ముందే జో బైడెన్‌పై గెలుపు తనదేనంటూ ట్రంప్‌ ప్రచారం చేయడంపై విచారణ జరుగుతోంది. జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్‌ రాఫెన్స్‌పెర్గర్‌తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడుతూ జార్జియాలో జరిగిన రీకౌంట్‌లో తనకు అదనపు ఓట్లు లెక్కించాలంటూ మాట్లాడిన సంభాషణ బయటకు రావడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్‌ మధ్య ఈ కేసులో  నేరాభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.  


 క్యాపిటల్‌పై దాడి
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ట్రంప్‌ ఓటమి భారాన్ని తట్టుకోలేక క్యాపిటల్‌ భవనంపై దాడికి తన అనుచరుల్ని ఉసిగొల్పిన ఘటనకు సంబంధించిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. కొలంబియా జిల్లా కోర్టులో ట్రంప్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. అదే సమయంలో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను కాంగ్రెస్‌ ధ్రువీకరించకుండా అడ్డుకోవాలని అప్పటి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపై కూడా కేసు నమోదై ఉంది.  

అక్రమ వ్యాపారాలు
డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌లో చేసిన వ్యాపారాల్లో నిబంధనల్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడ్డారని, తన ఆస్తుల్ని కూడా తప్పుడుగా చూపించారంటూ న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటిషియా జేమ్స్‌ కేసు నమోదు చేశారు. ట్రంప్‌ న్యూయార్క్‌ రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు కొనసాగించకుండా నిషేధం విధించాలంటూ ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటికే ట్రంప్‌ను అటార్నీ జనరల్‌ తన కార్యాలయంలోనే కొన్ని గంటలు ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఈ కేసు అక్టోబర్‌లో విచారణకు రానుంది.  

కాలమిస్ట్‌పై అత్యాచారం
మూడు దశాబ్దాల క్రితం తనపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ వేసిన కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ను న్యూయార్క్‌ కోర్టు మే 9న దోషిగా తేల్చింది. 1990లో మన్‌హటన్‌లోని ఒక డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ట్రంప్‌ తనపై అత్యాచారం చేశారంటూ 2019లో న్యూయార్క్‌ కోర్టులో ఆమె పిటిషన్‌ వేశారు. ఏప్రిల్‌ 25న దీనిపై విచారణ మొదలైంది. కరోల్‌ను అబద్ధాల కోరుగా ప్రచారం చేసి ఆమె పరువుని బజారుకి ఈడ్చినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ న్యూయార్క్‌ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్‌ న్యాయనిపుణుల బృందం పై కోర్టుకు వెళ్లనుంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement