మరుగున‘బడి’
మరుగున‘బడి’
Published Wed, Dec 21 2016 11:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మూణ్ణాళ్ల ముచ్చటగా.. స్వచ్ఛ బడులు
ఆయాల పునర్నియామకం జరిగేదెన్నడో?
జిల్లాలో ఇంటిముఖం పట్టనున్న 2,526 శానిటేషన్ వర్కర్లు
రాష్ట్రంలో మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేక 29శాతం బాలికలు బడులకు తర చూ వెళ్లడం లేదని జాతీయ సంస్థ అధ్యయనంలో తేలింది. కళాశాల స్థాయిలో 12శాతం మంది ఇదే సమస్య కారణంగా బడి మానేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి, బాలికల హాజరు శాతం పెరిగేలా ప్రభుత్వం అన్ని బడుల్లో మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టి పెట్టింది. బడులను స్వచ్ఛంగా ఉంచాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇది మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు నియమించిన శానిటేషన్ వర్కర్లను అక్టోబరు నుంచి నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - రాయవరం
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణను ఎస్‌ఎస్‌ఏ 2014 నవంబర్ నుంచి చేపడుతోంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్‌ఎస్‌ఏ నేరుగా నిధులను పాఠశాల ఎస్‌ఎంసీ అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు డ్వాక్రా మహిళలను శానిటేషన్ వర్కర్లగా నియమించే బాధ్యతను గతేడాది డీఆర్‌డీఏకు అప్పగించారు. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అయితే వీరికి ఐదు నెలలుగా వేతనాలు అందకపోగా, అకస్మాత్తుగా వీరిని ఇంటికి పంపించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులే శానిటేషన్ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.రెండువేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.నాలుగు వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఐదు నెలలకు రావాల్సిన వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.రెండు కోట్ల 78లక్షల 15వేలు విడుదల కావాల్సి ఉంది.
స్వచ్ఛబడులంటే ఇలాగేనా..
పాఠశాల హెచ్‌ఎంలకు వచ్చిన మెసేజ్‌లో శానిటేషన్ వర్కర్లను సెప్టెంబరు నెలాఖరు వరకు మాత్రమే వేతనాలు ఇస్తామని తెలిపారు. శానిటేషన్ వర్కర్లను తొలగించడంతో పాఠశాలల్లో మరుగుదొడ్లను విద్యార్థులు, ఉపాధ్యాయులే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థులతో ఎలా శుభ్రం చేయిస్తారు? లేకుంటే ఉపాధ్యాయులే శుభ్రం చేస్తారా? అనే ప్రశ్నలను విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క స్వచ్ఛభారత్ అంటూ ఊదరగొడుతున్న సర్కార్ మరోపక్క ఆయాలను తొలగించడంపై స్వచ్ఛభారత్‌పై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
శానిటేషన్ వర్కర్లను నియమించాలి..
ప్రభుత్వం పాఠశాలల్లో వెంటనే శానిటేషన్ వర్కర్లను నియమించాలి. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి.
– టీవీ కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
ఇదేనా చిత్తశుద్ధి?
స్వచ్ఛబడులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? స్వచ్ఛ బడుల పథకంపై ప్రభుత్వం వెంటనే స్పందించి శానిటేషన్ వర్కర్లను పునర్నియమించాలి.
– కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ
ఇంకా ఆదేశాలు రాలేదు..
పాఠశాలల్లో శానిటేషన్ వర్కర్లను తొలగించాలంటూ వచ్చిన మౌఖిక ఆదేశాలను పాఠశాల హెచ్‌ఎంలకు పంపించాం. తిరిగి వారిని పునర్నియామకం చేసుకోవడానికి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఎ.నాగరాజు, ఎంఈవో, రాయవరం
Advertisement