బాలికల హాస్టల్ లోకి పోకిరీలు
♦ బాత్‌రూంలో వీడియో చిత్రీకరించే యత్నం
♦ ఒకరిని పట్టుకున్న సిబ్బంది
♦ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
బోధన్ టౌన్ : పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసిన పోకిరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వెంకన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముగ్గురు యువకులు బుధవారం ఉదయం పట్టణంలోని బాలికల వసతి గృహం గోడపైనుంచి లోపలికి ప్రవేశించారు. బాలికలు బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీనిని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడంతో సిబ్బంది పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పోకిరీలు పారిపోవడానికి యత్నించారు. ఇద్దరు యువకులు పారిపోగా.. సాయిసిద్ధార్థ పట్టుబడ్డాడు. అతడికి దేహశుద్ధి చేసి ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పారిపోయిన ఇద్దరు యువకులనూ అదుపులోకి తీసుకుని ముగ్గురికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సుమోటోగానే కేసునమోదు చేసుకున్నామని తెలిపారు.
వసతి గృహనికి భద్రత కరువు
నిరుపేద విద్యార్థుల కోసం పట్టణంలోని రాకాసీపేట్‌లో ఏర్పాటు చేసిన సమీకృత బాలికల వసతి గృహనికి భద్రత కరువయ్యింది. బాలికల వసతి గృహంలో వార్డెన్‌లు అందుబాటులో ఉండరు. భద్రత లేకపోవడంతో హాస్టల్ చుట్టూ పోకిరీలు చేరి బాలికలను ఆటపట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రివేళలో వసతిగృహం లోకి రాళ్లు విసురుతున్నారని బాలికలు గతంలో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వసతి గృహం గోడ ఎత్తులేకపోవడంతో పోకిరీలు తరచూ ఆమ్మాయిలను ఆటపట్టిస్తున్నారు. భద్రత కోసం హాస్టల్ వద్ద మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరినా ఫలితం లేదు. ముగ్గురు యువకులు మూడు రోజులుగా వసతి గృహం వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని తెలిసింది. అధికారులు స్పందించి హాస్టల్ వద్ద భద్రత పెంచాలని, బాలికలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.