సాక్షి, బంజారాహిల్స్: నగదు దొంగిలించాడు కానీ.. పట్టుబడితే శిక్షిస్తారేమోనన్న భయంతో ఆ డబ్బును బాత్రూంలోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో అక్షరాలా రూ.రెండున్నర లక్షలు మరుగుదొడ్లోని మ్యాన్‌హోల్‌లోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.18లో నివసించే ప్రకాశ్‌చంద్ జైన్ అనే వ్యాపారి దీపావళి సందర్భంగా ఈ నెల 2వ తేదీన రాత్రి బంధుమిత్రులతో కలిసి ఇంట్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు.
సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట రూ. 3.50 లక్షల నగదు కట్టలు ఉంచాడు. పూజల అనంతరం ఏర్పాటుచేసిన విందు కోసం 18 మంది కేటరింగ్ సిబ్బంది వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో విందు ముగిశాక ప్రకాశ్‌చంద్‌తో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను పంపించేందుకు గేటు వరకు వెళ్లారు.
చదవండి: (ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో)
అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కేటరింగ్ బాయ్ షేక్ చాంద్ రజాక్ అమ్మవారి ఎదుట పెట్టిన డబ్బు కట్టలను ఎవరూ చూడకుండా తన జేబులో పెట్టుకున్నాడు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన ప్రకాశ్‌చంద్‌కు నగదు కట్టలు కనిపించలేదు. దీంతో డబ్బుకోసం అందరూ వెతుకుతుండగా తనను ఎక్కడ పట్టేస్తారోనని రజాక్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి రూ. 2.50 లక్షలను వెస్ట్రన్ టాయ్‌లెట్‌లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో డబ్బు కట్టలన్నీ డ్రెయినేజీ పైపుల్లోంచి మ్యాన్‌హోల్‌లోకి వెళ్లాయి.
దొంగలించిన నగదులో రూ. 75 వేలను తన ప్యాంట్ జేబులో దాచుకోగా దొంగను గుర్తించిన యజమాని వాటిని తీసుకొని మిగతా డబ్బుకోసం ఆరా తీశారు. కమోడ్‌లో పడేసానని చెప్పగానే అందులో చూడగా రూ. 500 నోట్లు నాలుగు తేలుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించి బుధవారం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజాక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
(చదవండి: TS: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల)
Comments
Please login to add a commentAdd a comment