commodes
-
రెండున్నర లక్షలు మాయం.. డబ్బుకోసం వెతుకుతుండగా బాత్రూంలోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: నగదు దొంగిలించాడు కానీ.. పట్టుబడితే శిక్షిస్తారేమోనన్న భయంతో ఆ డబ్బును బాత్రూంలోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో అక్షరాలా రూ.రెండున్నర లక్షలు మరుగుదొడ్లోని మ్యాన్హోల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.18లో నివసించే ప్రకాశ్‌చంద్ జైన్ అనే వ్యాపారి దీపావళి సందర్భంగా ఈ నెల 2వ తేదీన రాత్రి బంధుమిత్రులతో కలిసి ఇంట్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట రూ. 3.50 లక్షల నగదు కట్టలు ఉంచాడు. పూజల అనంతరం ఏర్పాటుచేసిన విందు కోసం 18 మంది కేటరింగ్ సిబ్బంది వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో విందు ముగిశాక ప్రకాశ్‌చంద్‌తో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను పంపించేందుకు గేటు వరకు వెళ్లారు. చదవండి: (ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో) అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కేటరింగ్ బాయ్ షేక్ చాంద్ రజాక్ అమ్మవారి ఎదుట పెట్టిన డబ్బు కట్టలను ఎవరూ చూడకుండా తన జేబులో పెట్టుకున్నాడు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన ప్రకాశ్‌చంద్‌కు నగదు కట్టలు కనిపించలేదు. దీంతో డబ్బుకోసం అందరూ వెతుకుతుండగా తనను ఎక్కడ పట్టేస్తారోనని రజాక్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి రూ. 2.50 లక్షలను వెస్ట్రన్ టాయ్లెట్లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో డబ్బు కట్టలన్నీ డ్రెయినేజీ పైపుల్లోంచి మ్యాన్హోల్లోకి వెళ్లాయి. దొంగలించిన నగదులో రూ. 75 వేలను తన ప్యాంట్ జేబులో దాచుకోగా దొంగను గుర్తించిన యజమాని వాటిని తీసుకొని మిగతా డబ్బుకోసం ఆరా తీశారు. కమోడ్‌లో పడేసానని చెప్పగానే అందులో చూడగా రూ. 500 నోట్లు నాలుగు తేలుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించి బుధవారం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజాక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: TS: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల) -
స్వచ్ఛాగ్రహం
చుట్టూ ఉన్న వాళ్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంది. మూడు రోజులు బడి మానుకుంది. ఆత్మగౌరవం, ఆరోగ్యమే ముఖ్యమని వాదించింది. పట్టుబట్టి మరుగుదొడ్డి కట్టించింది. బహిర్గత బహిర్భూమి వల్ల రోగాల బారిన పడతామని, మహిళలకు ఆత్మగౌరవం ముఖ్యమని మరుగుదొడ్డి నిర్మిస్తేనే బడికి వెళ్తానని పట్టుబట్టింది. చివరకు ఆ తల్లితండ్రులు తలొగ్గి మరుగుదొడ్డి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న భవాని బహిర్గత మలమూత్ర విసర్జన వలన జరిగే నష్టాల గురించి పాఠశాలలో ఉపాధ్యాయులు వివరించడంతో నిర్ఘాంతపోయింది. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్కుమార్ కిశోర బాలికలకు ఈ విషయమై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. పుట్టినప్పటినుండి తాను, తన తల్లితండ్రులు ఆరుబయటికే ఒంటికి, రెంటికి పోతున్నామని, దీనివల్ల తమతోపాటు తమ చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో నష్టపోతున్నారని ఆందోళన చెందింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన భవాని మరుగుదొడ్ల నిర్మాణం కోసం తల్లితండ్రులను ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకుంది. తల్లి పార్వతమ్మ, తండ్రి కృష్ణయ్యలను మరుగుదొడ్డి నిర్మించాలని కోరింది. దీనికి వారు ఆర్థికస్థితిగతులు, తమ పరిస్థితులను చెప్పి తమవల్లకాదని తేల్చి చెప్పారు. ఎలాగైనా ఒప్పించాలనే పంతంతో మూడురోజుల పాటు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. బడికి వెళ్లాలంటూ తల్లితండ్రులు ఒత్తిడి చేయడంతో తాను బడిమానుకుంటున్నానని. తనకు మరుగుదొడ్డి నిర్మిస్తేనే చదువుకుంటానని పట్టుబట్టింది.. ‘‘మరుగుదొడ్డి కట్టేందుకు పైసలు లేవమ్మా! పంట చేతికి వచ్చిన తరువాత కట్టుకుందాం లేమ్మా’’ అని తల్లితండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రభుత్వమే పైసలు ఇస్తుందని, ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని భవాని వివరించింది. ఇక తప్పేటట్టు లేదని తల్లితండ్రులు నిశ్చయించుకుని మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. వారంరోజుల్లో నిర్మాణం పూర్తి కానుంది. దీంతో తన సమస్య పరిష్కారం అయిందని అంతటితో విషయాన్ని వదిలేయకుండా బహిరంగ మలమూత్ర విసర్జనలకు వెళుతున్న మహిళలకు ఇలా బయటికి వెళ్లడం తప్పని చెప్పింది. అందరితోనూ. చివాట్లు తింది. అయినా రోజు ఉదయం అదేపనిగా చెబుతోంది. పాఠశాలలో సైతం తోటివిద్యార్థులకు మరుగుదొడ్ల ప్రాముఖ్యత, ఆత్మగౌరవం, లాభనష్టాల గురించి వివరిస్తోంతది. కలెక్టర్ అభినందనలు... విద్యార్థిని భవాని పట్టుబట్టి మరుగుదొడ్డిని నిర్మించుకుంటున్న విషయం సాక్షి దినపత్రికలో ప్రచురితం కావడంతో విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఆ విద్యార్థినిని జిల్లా కేంద్రానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించి ఒక సైకిల్, కొత్తబట్టలు, పుస్తకాలు, నోటుపుస్తకాలు, ఇతర వస్తువులను భవానికి బహూకరించారు. చదువుకుంటున్న విద్యార్థులు భవానిని ఆదర్శంగా తీసుకుని మరుగుదొడ్లు లేని కుటుంబాల వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాధికారి సుచీందర్‌రావు, డీఆర్డీఓ.గణేష్, ఎంపీడీఓ.శ్రీపాద్, ఏపీఓ.సుకన్యలు విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. – మహ్మద్ రఫి, సాక్షి, ఆత్మకూర్ (వనపర్తిజిల్లా) ఆత్మగౌరవమే ముఖ్యం బహిర్గత మలమూత్రవిసర్జనల వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. దీనికితోడు మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మా ఇంటినుండే ఆత్మగౌరవమే ముఖ్యమనే విషయాన్ని చాటిచెప్పాలనుకున్నాను. బడిమానేసి మరుగుదొడ్డి నిర్మించే విధంగా అమ్మానాన్న లను ఒప్పించాను. ఊర్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నాను. జిల్లా కలెక్టర్ నాకు అభినందించి బహుమతులను అందచేయడంతో నాకు భాద్యత మరింత పెరిగింది. – భవాని, విద్యార్థిని, ఆరేపల్లి గ్రామం, ఆత్మకూర్ మండలం -
ఊరు మెచ్చిన కోడలు
‘‘ఏమిటీ? దాన్ని ఇంట్లోనా?’’ ముఖం చిట్లించిందొకామె. ‘‘దేవుడి గది, వంటగదితోపాటు అది కూడా ఇంట్లోనేనా,భగవంతుడా!’’ మరొకామె. ‘‘ఇల్లు దాటి పదడుగులు వేస్తే పొలాలే.కావల్సినంత ఖాళీ ఉంది. చెట్ల మరుగుఉంది. మా ఊరికి దాంతో పనిలేదు’’ఇంకొకామె. ‘‘చెరువు గట్టున చేయాల్సినపని ఇంట్లోనా, ఛీఛీ’’ మరో పెద్దాయన.‘దేవుడా, వీళ్లకు ఎలా చెప్పాలి?! తామెలాంటి స్థితిలో జీవిస్తున్నదీ వీళ్లకు తెలియడం లేదసలు’.. ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంది విమలా కాదమ్. మరుసటి రోజు ఎప్పటిలాగానే కాలేజ్‌కి వెళ్లింది విమల. తన ఫ్రెండ్స్ పాతికమందికి ఈ సంగతి చెప్పింది. అంతా అంగీకరించారు. ఇంటికి వచ్చి మూడు ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసింది. ఆ ప్రశ్నలివి.. ‘గడచిన ఐదేళ్లుగా గ్రామంలో పాముకాటు మరణాలెన్ని? అవి ఎప్పుడు జరిగాయి?’‘ఆడవాళ్ల మీద అఘాయిత్యాలెన్ని? ఎప్పుడు?’‘నీటి కాలుష్యం కారణంగా వానలు కురిసినప్పుడు రోగాల పాలయిన వాళ్లెందరు?’ఆ తర్వాత విమలా కాదమ్ తన ఫ్రెండ్స్ బృందాన్ని ఊళ్లో దించింది. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఇళ్ల మీద వాలిపోయారు. ఇంట్లో వాళ్ల మీద ఈ మూడు ప్రశ్నలతో దాడి చేశారు. చెరువు గట్టునే చేటు! బలాత్కారాలు, పాము కాట్లన్నీ బహిర్భూమి కోసం పొలాల్లోకి, చెట్ల మరుగుకు వెళ్లినప్పుడే జరిగాయని బదులిచ్చారు గ్రామస్థులు. ఇక నీటి కాలుష్యం వల్ల వచ్చిన అనారోగ్యాలకైతే లెక్కే లేదు. వానాకాలంలో అతిసార వంటి రోగాల రూపంలో ప్రాణాలు తీస్తున్నది చెరువు గట్టు ‘వాడకమే’నని వారికి తెలియజెప్పారు స్టూడెంట్స్. గ్రామస్థులను చైతన్యవంతం చేయడానికి జరిగిన ఈ దాడిలాంటి ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చే సూచనలు కనిపించాయి. వేడెక్కిన ఇనుము చల్లబడక ముందే దానిని మలుచుకోవాలి. ఇక అందరికీ నచ్చ చెప్పే పని మొదలైంది. దేవుడి పూజ గది ఉన్నంత మాత్రాన ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి ఉండకూడదనే అపోహను మొత్తానికి వారు తుడిచేయగలిగారు. ‘దీపం’ ఉండగానే ఆలోచన విద్యార్థులను చూసి గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. ‘‘స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇంటింటికీ మరుగుదొడ్డి కట్టించాలని ప్రభుత్వ ఆదేశం. నిధులు కూడా దండిగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికంటే ముందే ఎవరికివారే మరుగుదొడ్డి కట్టించుకున్న ఇరవై శాతం మంది మినహా స్వచ్ఛభారత్ ప్రయత్నంలో ఒక్క దొడ్డిని కూడా కట్టించలేకపోయాం. ఈ చైతన్యోద్యమంలో మేమూ నడుస్తాం’ అని ఆ పెద్దలు చొరవ చూపారు. తమ వంతుగా ఇంటికి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల డబ్బు ఇచ్చారు. స్కీమ్ ఉండగానే కట్టించుకోవడం మేలని గ్రామస్థులు కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి సిద్ధం అయ్యారు. మరో ఆరు మిగిలే ఉన్నాయి నాలుగు వేల ఐదొందల జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇప్పుడు 800 మరుగుదొడ్లు ఉన్నాయి. మరో వంద మంది కూడా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఆ గ్రామం పేరు ఉమ్రాని. కర్ణాటక రాష్ట్రం, చిక్కోడి తాలూకాలో ఉంది. విమల కాదమ్ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో అక్కడి అధికారులకు ఆమె ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోందిప్పుడు. ‘‘మరో ఆరు గ్రామాలు ఇలాగే కొరకరాని కొయ్యలుగా మిగిలి ఉన్నాయి, ఆ గ్రామాలకు వెళ్లి వాళ్లకూ చెప్పండి ప్లీజ్’ అని రిక్వెస్ట్ చేశారు తాలూకా ఆఫీసర్. పరీక్షలై పోయిన తర్వాత తన ‘చైతన్య యాత్ర’ ప్రారంభించబోతోంది విమలా కాదమ్. ►అధికారులు చెయ్యలేని పనిని కళాశాల విద్యార్థిని విమలా కాదమ్ చేయగలిగింది! మరుగుదొడ్డ నిర్మాణానికి మొరాయించిన గ్రామస్థుల మనసును ఆమె మార్చగలిగింది. ►కర్ణాటక, హుబ్లీలో ఇటీవల జరిగిన యువ సదస్సులో విమలా కాదమ్ ‘బెస్ట్ లీడర్ 2018’ అవార్డు అందుకున్నారు. అయితే ఆమె తనను గోప్యంగా ఉంచుకోడానికే ఇష్టపడడంతో సదస్సు నిర్వాహకులు మీడియాను ఫొటోలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ►మరుగుదొడ్ల నిర్మాణం కోసం విమలా కాదమ్ నేతృత్వంలో గ్రామస్థులలో చైతన్యం తెచ్చేందుకు బయల్దేరిన సహ విద్యార్థులు. ►అక్షయ్‌కుమార్ నటించిన ‘టాయిలెట్’ సినిమాలోని ఒక సన్నివేశం: ఈ చిత్రంలో చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో విమలా కాదమ్కు నిత్యమూ కనిపించేవట. ‘ఇదా! నా మెట్టినూరు!!’ విమలా కాదమ్ 2016లో పెళ్లి కారణంగా చదువును మధ్యలో ఆపేసింది. పెళ్లి తర్వాత మళ్లీ చదువుకోవడానికి అత్తగారింటికి దగ్గరలో చిక్కోడి తాలూకాలో ఉన్న ఎ.ఎ.పాటిల్ ఉమెన్స్ కాలేజ్‌లో చేరింది. అక్షయ్‌కుమార్ నటించిన ‘టాయిలెట్’ సినిమాలో ఆమె చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో నిత్యమూ కనిపించేవి. ఓసారైతే వయసు మళ్లిన మహిళలు ముధోల్– నిప్పని స్టేట్ హైవే దగ్గర బారుగా నిలబడి ఉన్నారు. రోడ్డు దాటితే అంతా ఖాళీ పొలాలే. వాళ్లు వెళ్తున్నది టాయిలెట్ అవసరం తీర్చుకోవడానికి అని తెలిసి నివ్వెరపోయింది విమల. తాను కోడలిగా వచ్చింది ఇలాంటి ఊరికా అనిపించింది ఆమెకు. ఏదో ఒకటి చేసి తీరాలనుకుంది. అనుకున్న పని చేసి చూపించింది. దాంతో ఊరు స్వచ్ఛ గ్రామంగా మారింది. విమల ఊరు మెచ్చిన కోడలు అయింది. ఇటీవలే ఆమె హుబ్లీలో జరిగిన 8వ ‘యువ సదస్సు’లో ‘బెస్ట్ లీడర్ (ఇన్ కమ్యూనిటీ ఇంపాక్ట్) 2018’ అవార్డు అందుకుంది. – మంజీర -
టాయిలెట్ ఫౌంటెయిన్..!
పేరు చూసి కంగారుపడకండి.. వీటిలో నుంచి వచ్చేవి మామూలు నీళ్లే. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి కదా? అందుకే కాస్త కొత్తగా ఉండాలని ఫౌంటెయిన్కి ఇలా యూరినల్స్, టాయిలెట్ కమోడ్స, సింకులు తగిలించారు అంతే. చైనా సెంట్రల్ గౌంగ్డంగ్ ప్రావిన్సులోని ఫోషన్ నగరంలో దీన్ని నిర్మించారు. వంద మీటర్ల పొడవు, ఐదు మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ఫౌంటెయిన్ నిర్మాణానికి దాదాపు పదివేల టాయిలెట్ బౌల్స్ వినియోగించారు. వీటన్నం టినీ ట్యాప్ కనెక్షన్‌తో అనుసంధానం చేశారు. వాటిలో నుంచి ఆగుతూ ఆగుతూ వచ్చే జలపాతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.