తండా సమీపంలో అండర్‌పాస్ ఉందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండల పరిధిలోని పెద్దకుంట తండా గ్రామానికి చెందిన ప్రజలు జాతీయ రహదారిని దాటేందుకు వీలుగా గ్రామ సమీపంలో అండర్‌పాస్ ఉందో లేదో స్వయంగా వెళ్లి పరిశీలన చేయాలని హైకోర్టు పిటిషనర్ల తరఫు న్యాయవాది రచన వడ్డేపల్లి, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మేనేజర్ శైలజను ఆదేశించింది. తండాకు చెందిన మగవాళ్లంతా గత రెండేళ్ల కాలంలో 44వ జాతీయ రహదారి దాటుతూ మృత్యువాత పడ్డారని, అక్కడి మహిళల పరిస్థితి దుర్భరంగా ఉన్నందున వారిని ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. పరిశీలకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.
తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది. తండాకు చెందిన మగవాళ్లంతా గత రెండేళ్లలో 44వ జాతీయ రహదారి దాటుతూ మరణించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రచన చేసిన వాదనను ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదన్నారు. మృతుల సంఖ్యను ఎక్కువ చేసి, పత్రికా కథనాల ఆధారంగా గణాంకాలు చెబుతున్నారన్నారు.
తండావాసులు రోడ్డు దాటేందుకు వీలుగా సమీపంలోనే అండర్ పాస్ ఉందని, దీనిని వారు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. అదంతా అవా స్తవమని రచన విన్నవించారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ జోక్యం చేసుకుంటూ, గత విచారణ తర్వాత జిల్లా ఎస్పీ స్వయం గా వెళ్లి పరిశీలించారని, పిటిషనర్లు చెబుతున్నదానిలో వాస్తవం లేదన్నారు. తండాకు అండర్‌పాస్ ఎంత దూరంలో ఉందన్న అంశంపై భిన్న వాదనలున్నందున, అక్కడికి కలసి వెళ్లి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రచన, శైలజలను ధర్మాసనం ఆదేశించింది.