SRDP
-
హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్.. అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు :12.50 మీటర్లు లేన్లు : 3 ప్రయాణం : ఒక వైపు -
హైదరాబాద్‌ను కరుణించని నిర్మల.. అంచనాలు తలకిందులు
కేంద్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి ‘బూస్టర్’ దక్కలేదు. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎస్సార్డీపీ పనులకు నిధులు విదిల్చలేదు. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.48వేల కోట్లు కేటాయించినప్పటికీ, వీటిలో గ్రేటర్ నగరానికి ఎన్ని నిధులందుతాయో చెప్పలేని పరిస్థితి. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం శూన్య హస్తమే చూపింది. ప్రధానంగా జలమండలి, మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కరువైంది. రెండు అంశాల్లో మాత్రం నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర బడ్జెట్లో నగరానికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్లో ఈసారి జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ పనులకు నిధులందుతాయేమోనని పలువురు ఎదురు చూశారు. కానీ.. నిధులు కనిపించలేదు. జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్లతో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అప్పులు, బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడంతోపాటు సొంత ఖజానా నిధులు సైతం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. నగరాభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్రం సహకారం కూడా ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎస్సార్డీపీ పనులకు కేంద్రం తనవంతుగా రూ.1400 కోట్లు ఆర్థిక సహకారం అందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నగరంలో నిర్మిస్తున్న లింక్‌రోడ్లు, స్లిప్రోడ్ల కోసం మరో రూ.800 కోట్లు అడిగారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాయడం తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి ఎంతోకొంత సహకారం అందగలదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. (చదవండి: ఒక్కరోజే 2,850 కరోనా కేసులు) పోస్టాఫీసులకు మహర్దశ ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. పరుగులు పెట్టనున్న వందే భారత్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్–ముంబయి.కాచిగూడ–బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం. (చదవండి: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం! ) -
రయ్.. రయ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లలో మరొకటి అందుబాటులోకి రానుంది. ఖాజాగూడ సైడ్ నుంచి మైండ్‌స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే దీన్ని ప్రారంభించాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ నెల 4న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. వాస్తవానికి దీపావళికే ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని అనుకున్నా... కొన్ని పనులు మిగిలిపోవడంతో వాయిదా పడింది. దాదాపు కిలోమీటర్ పొడవున మూడు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసొస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఎస్సార్డీపీ పనుల 4వ ప్యాకేజీలో భాగంగా బయోడైవర్సి టీ వద్ద రెండు ఫ్లైఓవర్ల అంచనా వ్యయం రూ.69.47 కోట్లు కాగా.. ఇది రెండో వరుస ఫ్లైఓవర్. గచ్చిబౌలి వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్ వైపు వెళ్లే మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐటీ కారి డార్ మార్గంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు చేపట్టిన పనుల్లో అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. వీటివల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొత్త ఫ్లైఓవర్‌తో మరికొంత సౌలభ్యం కలగనుంది. బయోడైవర్సిటీ వద్ద మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తయితే జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులుండవని అధికారులు చెబుతున్నారు. మరో ఆర్నెల్ల్లలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పూర్తయిన ఫ్లైఓవర్ వివరాలివీ..పొడవు- 990 మీటర్లు వెడల్పు- 11.50 మీటర్లు లైన్లు- 3 పిల్లర్లు- 28 వయాడక్ట్ స్పాన్ పొడవు- 570 మీటర్లు అప్రోచెస్పొడవు- 255 మీటర్లు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు వెళ్లే వాహనాల సంఖ్య 2015లో 14,001 ఉండగా అది 2035 నాటికి 30,678కి చేరుకుంటుందని అంచనా -
భలే చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ వంటి ప్రాజెక్టుల పనులకు అవసరమైన ఆస్తుల/భూసేకరణకు ‘టీడీఆర్ సర్టిఫికెట్లు’ తీసుకునేందుకు ముందుకొస్తున్న వారు పెరుగుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం తగ్గుతోంది. ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు ఎన్నో ఆస్తులు సేకరించాల్సి వస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, బయో డైవర్సిటీ జంక్షన్, ఎల్బీనగర్ ఒవైసీ జంక్షన్లలోనే వందల ఆస్తులు సేకరించాల్సి ఉంది. వాటన్నింటికీ పరిహారంగా నగదు చెల్లిస్తే.. ప్రాజెక్టులకు ఎంత వ్యయమవుతుందో నష్ట పరిహారాలకు అంతకంటే ఎక్కువ వ్యయమయ్యే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా అమలులో ఉన్నప్పటికీ ఆస్తులు కోల్పోయే యజమానులు పెద్దగా ఉపయోగించుకోని టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్) గురించి టౌన్‌ప్లానింగ్ విభాగం ఏడాదిన్నరగా విస్తృత ప్రచారంతో పాటు తగిన అవగాహన కల్పిస్తోంది. దీంతో ఈ హక్కును వినియోగించుకునేవారు క్రమేపీ పెరుగుతున్నారు. దశాబ్దకాలంగా జీహెచ్ఎంసీ జారీ చేసిన టీడీఆర్ సర్టిఫికెట్లు 115 మాత్రమే కాగా, ఈ ఏడాది లోనే 323 టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. టీడీఆర్ ప్రయోజనమిలా.. ప్రాజెక్టులకు అవసరమైన ఆస్తులు, భూసేకరణ చేసినప్పుడు నష్టపరిహారంగా నగదు చెల్లించడం తెలిసిందే. దాని బదులు భూములు కోల్పోయేవారికి వారు కోల్పోయే ప్లాట్ ఏరియాకు నాలుగు రెట్లు(400 శాతం) బిల్టప్ ఏరియాతో మరో స్థలంలో నిర్మాణం చేసుకునేందుకు హక్కు కల్పించే పత్రమే టీడీఆర్ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్తో హక్కుదారులు 400 శాతం బిల్టప్ ఏరియాతో నిర్మాణాలు చేసుకోవచ్చు. లేదా తమకున్న ఈ హక్కు సర్టిఫికెట్‌ను బిల్డర్లకు అమ్ముకోవచ్చు. ఈ హక్కు పొందేవారు భవన నిర్మాణ నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల్లో అనుమతించే అంతస్తుల కంటే అదనంగా మరో అంతస్తును కూడా నిర్మించుకోవచ్చు. బహుళ అంతస్తుల్లో (18 మీటర్ల ఎత్తుకు మించిన భవనాల్లో) అయితే రెండు అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణకు దాదాపు రూ.200 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చే ఆస్తులను ఇలా టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేసి జీహెచ్ఎంసీ సమకూర్చుకుంది. -
రయ్.. రయ్
సాక్షి సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)... నగరంలో ట్రాఫిక్ చింతలను తీర్చేందుకు, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం. ఈ ప్రాజెక్టు కింద వివిధ దశల్లో రూ.25 వేల కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించగా... దాదాపు రూ.7వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.300 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గాయి. మరికొన్ని ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గడిచిన 10 నెలల కాలంలో వివిధ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉండడం, బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు మార్కెట్ పరిస్థితి బాగాలేకపోవడం, వడ్డీ రేటు అధికంగా ఉండడం తదితర కారణాలతో జీహెచ్ఎంసీ బాండ్లకు వెళ్లలేదు. కొన్ని మార్గాల్లో భూసేకరణ, యుటిలిటీస్ తరలింపు పనుల్లో జాప్యం లాంటి కారణాలతో పనుల్లో వేగం తగ్గింది. త్వరలోనే బాండ్ల ద్వారా రూ.400 కోట్లు సేకరించేందుకు, భూసేకరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్, సిబ్బందిని నియమించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్సార్డీపీ పనుల్లో తిరిగి వేగం పుంజుకుంటుందని కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పనులు, ఎదురవుతున్న అవాంతరాలు, ఆయా దశల్లోని పనుల స్థితిగతులపై ‘సాక్షి’ రిపోర్టు. మూడేళ్ల క్రితం ప్రారంభం గ్రేటర్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీ ప్రయాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఎస్సార్డీపీ ప్రాజెక్టు చేపట్టింది. గతేడాది వరకు ఈ పనులు వేగంగానే జరగ్గా... ఇటీవల కొంత మందగించాయి. ఈ పనుల కోసం రెండు దశల్లో జీహెచ్ఎంసీ రూ.395 కోట్లు సేకరించింది. ఈ నిధులను ఇతర పనులకు కేటాయించే వీలు లేకపోవడంతో పనులు ముందుకు సాగాయి. అయితే ఏప్రిల్ నుంచి నిధులు లేకపోవడంతో బాండ్లు/ బ్యాంకు రుణాల ద్వారా తీసుకునేందుకు చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ త్వరలోనే రూ.400 కోట్లు సేకరించనుంది. ప్రాజెక్టుల వివరాలివీ... ♦ ఎల్బీనగర్ ఐదు జంక్షన్లలో (ఎల్బీనగర్, కామినేని, నాగోల్, బైరామల్‌గూడ, చింతల్‌కుంట) 8 ఫ్లైఓవర్లు, 2 అండర్‌పాస్‌లు. అంచనా వ్యయం రూ.448 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.167 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సవరానికి రూ.105 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. 35 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. ♦ మైండ్‌స్పేస్, బయో డైవర్సిటీ పరిసరాల్లో పనులకు అంచనా వ్యయం రూ.379 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.284 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.40 కోట్లు అవసరం. భూసేకరణకు రూ.64 కోట్లు ఖర్చు చేశారు. 80 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. బయో డైవర్సిటీ వద్ద మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. ♦ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లేన్ల రహదారి (ఎలివేటెడ్ కారిడార్)కి అంచనా వ్యయం రూ.150 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.65 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.40 కోట్లు, భూసేకరణకు రూ.20 కోట్లు అవసరం. సివిల్ పనులు 52 శాతం పూర్తయ్యాయి. 21 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ♦ దుర్గం చెరువుపై కేబుల్ స్టే బ్రిడ్జి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.90 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.94 కోట్లు అవసరం. సివిల్ పనులు 63 శాతం పూర్తయ్యాయి. ♦ షేక్‌పేట – విస్పర్‌వ్యాలీ... సెవెన్ టూంబ్స్ (షేక్‌పేట), ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ వరకు ఆరు లేన్లుగా రెండువైపులా రాకపోకలకు ఫ్లైఓవర్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.333.55 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.181 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. 88 ఆస్తులు సేకరించాల్సి ఉండగా.. 13 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. ♦ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో ఫ్లైఓవర్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.263 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.138 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. సివిల్ పనులు 63 శాతం పూర్తయ్యాయి. 160 ఆస్తులు సేకరించాల్సి ఉండగా... 40 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. ♦ ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.63 కోట్లు కాగా.. ఇప్పటి వరకు చేసిన రూ.15 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.37 కోట్లు అవసరం. 19 శాతం మేర పనులు పూర్తయ్యాయి. 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్‌కు 38 పిల్లర్లకు గాను 13 పూర్తయ్యాయి. 13 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ♦ బహదూర్‌పురా జంక్షన్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.69 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.28 కోట్లు అవసరం. 780 మీటర్ల పొడవుండే దీనికి 9 పిల్లర్లకు గాను నాలుగింటి పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 47 ఆస్తులకు గాను ఆరింటిని సేకరించారు. నిధులకు కొరత లేదు బాండ్ల ద్వారా నిధుల సేకరణ కోసం శుక్రవారం ముంబై వెళ్తున్నాం. రూ.400 కోట్లు సేకరిస్తాం. రానున్న 6 నెలల్లో మరో రూ.3,000 కోట్ల మేర పనులకు టెండర్లు పూర్తి చేసి ప్రారంభిస్తాం. భూసేకరణ, యుటిలిటీస్ తరలింపులో జాప్యం నిజమే. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్, సిబ్బందిని నియమిస్తాం. నిధుల లేమితో పనులు ఆగిపోలేదు. బాండ్ల నిధులు ఖర్చయ్యాక కూడా దాదాపు రూ.100 కోట్లు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేశాం. వడ్డీ భారం పెరగకుండా ఉండేందుకు పనుల పురోగతి మేరకు ఎప్పటి కప్పుడు నిధులు సేకరిస్తాం. – ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తయిన పనులివీ... ♦ అయ్యప్పసొసైటీ అండర్‌పాస్ ♦ మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్ ♦ మెండ్స్పేస్ ఫ్లైఓవర్ ♦ చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్ ♦ కామినేని ఎడమవైపు ఫ్లైఓవర్ ♦ ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ ♦ రాజీవ్‌గాంధీ ఫ్లైఓవర్ మొత్తం రూ.6,759 కోట్లు ఎస్సార్డీపీ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన వాటిలో ఎన్జీటీ తీర్పులు, టెండర్లకు ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉండడం తదితర కారణాలతో దాదాపు రూ.1297 కోట్ల పనులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. రూ.292 కోట్ల పనులు పూర్తయి.. పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
మళ్లీ అప్పు!
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మరోసారి అప్పు బాట పట్టనుంది. ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు, రహదారుల విస్తరణ తదితర పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ పనుల కోసం మొత్తం రూ.3500 కోట్లు రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతించింది. ఇందులో రూ.1000 కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ.2500 కోట్లు బ్యాంకు లోన్ల(రుపీ టర్మ్‌లోన్–ఆర్టీఎల్) ద్వారా తీసుకునేందుకు జీహెచ్ఎంసీ ఇప్పటికే అనుమతి పొందింది. బాండ్ల జారీ ద్వారా ఒకసారి రూ.200 కోట్లు, మరోసారి రూ.195 కోట్లు మొత్తం రూ.395 కోట్లు సేకరించారు. సదరు నిధులు గత మార్చినాటికి ఖర్చయిపోయాయి. అప్పటి నుంచే బాండ్ల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికలు రావడం, కొన్ని ఆర్థిక సంస్థలు భారీ మొత్తాలు చెల్లించక డిఫాల్ట్ కావడం.. బాండ్ల మార్కెట్ స్థిరంగా లేకపోవడంతో పరిస్థితులు కుదుటపడ్డాక బాండ్ల జారీకి వెళ్లాలనుకున్నారు. ప్రస్తుతం ముంబైలో వరదలతో పాటు బాండ్ల ద్వారా రుణాలు సేకరిస్తే ఎక్కువ వడ్డీ పడే అవకాశం ఉండటంతో ‘రుపీ టర్మ్‌లోన్’కు వెళ్లాలని నిశ్చయించారు. ఈ మేరకు గ్రేటర్ ఉన్నతాధికారులు ఇప్పటికే బ్యాంకర్లతో ఒక దఫా సమావేశం కూడా నిర్వహించారు. టెండర్ ద్వారా బ్యాంక్ ఎంపిక తొలిసారిగా బాండ్ల ద్వారా జీహెచ్ఎంసీ రూ.200 కోట్లను 8.90 శాతం కూపన్‌రేటు(వడ్డీ)కు తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే 9.5 శాతం.. అంతకంటే ఎక్కువ కూపన్‌రేటు ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఈ వడ్డీకి బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. టెండరు ఆహ్వానిస్తే పోటీపడి బ్యాంకులు మరింత తక్కువ వడ్డీకే ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎస్బీఐ క్యాపిటల్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. బాండ్ల ద్వారా, బ్యాంకుల ద్వారా నిధులు సేకరించే సేవలందించేందుకు జీహెచ్ఎంసీ ఎస్బీఐ క్యాపిటల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైన ప్రక్రియ పూర్తిచేసి ఈ నెలాఖరు నాటికి రూ.305 కోట్లు సేకరించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే రూ.395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించడంతో మరో రూ.305 కోట్లు సేకరిస్తే మొత్తం ఎస్సార్డీపీ పనుల కోసం రూ.700 కోట్లు సేకరించినట్లవుతుంది. ఈ నిధులు ఖర్చయ్యాక అవసరాన్ని బట్టి మళ్లీ బాండ్ల జారీ ద్వారా కానీ, బ్యాంక్ రుణాల ద్వారా కానీ తీసుకోనున్నారు. తెచ్చిన నిధులన్నీ ఖర్చు ఎస్సార్డీపీ పనుల కోసమే ఈ రుణాల నిధులు ఖర్చు చేయాల్సి ఉండటంతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించే వీలులేదు. మరోవైపు ఇతర పద్దులకు చెందిన నిధులను ఎస్సార్డీపీ పనులకు ఖర్చు చేసినా, రుణం పొందాక సదరు పద్దులోకి మళ్లించే అవకాశం లేదు. గత మార్చిలో బాండ్ల నిధులు ఖర్చయిపోవడంతో తర్వాత పెండింగ్‌లోని బిల్లులు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ జనరల్ ఫండ్స్ నుంచే ఇప్పటి వరకు దాదాపు రూ.52 కోట్లు చెల్లించారు. ఇది ఇతర పనులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్సార్డీపీ పనులకు సంబంధించి ప్రస్తుతం దాదాపు రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఖజానాలో కూడా నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఇక నిధులు సేకరించడం తక్షణాసరం కావడంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి కానీ, వచ్చేనెల తొలివారం లోగా కానీ నిధులందనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి, వివిధ పన్నుల వసూళ్లు తదితరమైనవి అధ్యయనం చేసిన ఆర్థిక సంస్థలు ఏఏ (స్టేబుల్) రేటింగ్నిచ్చాయి. ఆ రేటింగ్తోనే జీహెచ్ఎంసీ బాండ్ల జారీకి వెళ్లింది. తొలివిడతలో 2018 ఫిబ్రవరిలో రూ.200 కోట్లు 8.90 వడ్డీకే లభించినప్పటికీ, ఆగస్టులో రెండో విడత రూ.195 కోట్లను 9.38 వడ్డీకి తీసుకున్నారు. మూడో విడత రూ.305 కోట్ల సేకరణ కూడా బాండ్ల ద్వారానే చేయాలనుకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బ్యాంకుల వైపు మళ్లారు. బాండ్ల ద్వారా సేకరిస్తే మొత్తం రూ.305 కోట్లలో రూ.205 కోట్లను ‘గ్రీన్‌షూ ఆప్షన్’ ద్వారా తీసుకునేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. గ్రీన్ షూ ఆప్షన్ అంటే.. బాండ్ల ద్వారా నిధులిచ్చేందుకు ముందుకొచ్చే సంస్థల్లో రెండు మూడు సంస్థల నుంచి నిధులు సేకరించేందుకు సిద్ధమైనప్పుడు వాటిలో దేనికి ఎక్కువ వడ్డీ చెల్లిస్తే.. అదే వడ్డీని తక్కువ వడ్డీకి ముందుకొచ్చిన వాటికి కూడా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విడతల వారీగానే సేకరణ ఎస్సార్డీపీ పనుల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు కాగా, వీటిలో రూ.395 కోట్లు బాండ్ల జారీ ద్వారా సేకరించారు. భూసేకరణ వంటి పనులన్నీ పూర్తయితే ఈ ఏడాది మరో రూ.1500 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఒకేసారి అన్ని నిధుల్ని తీసుకుంటే వడ్డీ ఎక్కువవుతుంది కనుక పనుల పురోగతిని బట్టి విడతల వారీగా నిధులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రూ.305 కోట్ల సేకరణకు సిద్ధమయ్యారు. ఎస్పార్‌డీపీలో భాగంగా ఎల్బీనగర్, బయోడైవర్సిటీ, రోడ్ నెంబర్ 45, షేక్‌పేట, కొండాపూర్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. వీటిలో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిని ఈ ఏడాది లోగా ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం. -
మార్గం సుగమం
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) పనుల్లో భాగంగా చేపట్టిన మూడు కీలకమైన ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. ఆయా మార్గాల్లో పనులకు అడ్డంకిగా మారిన ఓవర్ హెడ్లైన్ల తరలింపునకు విద్యుత్ శాఖ అనుమతినిచ్చింది. దీంతో రూ.750 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు శరవేగంగా జరగనున్నాయి. షేక్‌పేట నుంచి విస్పర్‌వ్యాలీ (మహాప్రస్థానం) వరకు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుల నుంచి దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జి వరకు, కొత్తగూడ, కొండాపూర్ మార్గాల్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్టులను చేపట్టింది. ఇవి పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీల వైపు రాకపోకలు సాగించే వారికి... ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి మియాపూర్ వరకు కూడా రాకపోకలు సాగించే వారికి ఎంతో సదుపాయంగా ఉంటుంది. నిత్యంఈ మార్గాల్లో ప్రయాణించే లక్షల మందికి ట్రాఫిక్ నరకం తప్పుతుంది. ఈ ఉద్దేశంతోనే ఎస్సార్డీపీలో భాగంగా ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే పనులు పురోగతిలో ఉన్నప్పటికీ, పూర్తి చేసేందుకు ఆయా మార్గాల్లో టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 220 కేవీ, 132 కేవీ ఓవర్ హెడ్లైన్లను మళ్లించాల్సి వచ్చింది. వాటిని భూగర్భంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులు దాదాపు ఏడాదిన్నరగా కసరత్తు చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు మార్గం సుగమమైంది. జీహెచ్ఎంసీ వాటి తరలింపు పనులకయ్యే దాదాపు రూ.115 కోట్లను ట్రాన్స్‌కోకు చెల్లించింది. ట్రాన్స్‌కో పనులు ప్రారంభించిందని జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ ప్రాజెక్టుల సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. ట్రాన్స్‌కో ఓవర్ హెడ్లైన్ తరలింపు పనులు పూర్తయ్యేలోగా, దానికి సమాంతరంగా మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ మార్గాల్లో ఆయా పనులు జరుగుతున్నప్పటికీ ఓవర్ హెడ్లైన్ల మళ్లింపు, ఆస్తుల సేకరణ కూడా పూర్తయితే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పనులు త్వరితగతిన పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇవీ ప్రాజెక్టులు ♦ షేక్‌పేట – మహాప్రస్థానం ఫ్లైఓవర్ సెవెన్ టూంబ్స్ జంక్షన్, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్లను కలిపే ఆరు లేన్ల ఫ్లైఓవర్ ఇది. దీని ద్వారా రెండువైపులా రాకపోకలు సాగించొచ్చు. అంచనా వ్యయం: రూ.333.55 కోట్లు ♦ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు/ గ్రేడ్ సెపరేటర్లు. అంచనా వ్యయం: రూ.263.09 కోట్లు ♦ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జిని కలిపే ఎలివేటెడ్ కారిడార్. అంచనా వ్యయం: రూ.150 కోట్లు -
మరో ఏడు కారిడార్లలో ట్రాఫిక్ ఫ్రీ
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా ఇప్పటికే వివిధ మార్గాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ..త్వరలో మరో ఏడు కారిడార్లలో ‘ట్రాఫిక్ ఫ్రీ’ చర్యలు చేపట్టనుంది. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్కడ ఏవి అవసరమైతే ఆ పనులు చేయనుంది. అందులో భాగంగా మరికొన్ని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులు జరుగనున్నాయి. ఏయే మార్గాల్లో ట్రాఫిక్ పరిష్కారానికి ఏయే పనులు చేయాలో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లకు బాధ్యతలప్పగించారు. కన్సల్టెంట్ సంస్థలనుంచి డీపీఆర్‌లు అందాక టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఓవైపు ఇప్పటికే పనులు ప్రారంభమైన ఎల్బీనగర్ జంక్షన్, కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్,బయోడైవర్సిటీపార్క్ జంక్షన్, షేక్‌పేట్ సెవెన్ టూంబ్స్, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూకాలనీజంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్, దుర్గంచెరువుపై కేబుల్‌స్టే బ్రిడ్జి, తదితర పనుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడంతోపాటు మరోవైపు ఈ కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ, కామినేని, మైండ్స్పేస్ల వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ వీలైనంత త్వరితంగా ట్రాఫిక్చిక్కుల్ని తొలగించాలని భావిస్తున్నారు. తాము చేపట్టిన ఫ్లై ఓవర్లు,తదితర పనులతోనే మరోమారు నగర ప్రజలు అధికారం కట్టబెట్టారని భావిస్తోన్న టీఆర్ఎస్ నేతలు సైతం ఎస్సార్డీపీ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ట్రాఫిక్ చిక్కులు తొలగనున్న కారిడార్లు ఇవే... ♦ సంగీత్ జంక్షన్–ఉప్పల్–ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్ (అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు). ♦ సచివాలయం– ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం–లిబర్టీ– బషీర్‌బాగ్– జీపీఓ– అఫ్జల్‌గంజ్ (రూ. 500కోట్లు). ♦ పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్–హయత్‌నగర్–ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్ (రూ.600 కోట్లు). ♦ ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్–పంజగుట్ట–బేగంపేట–హరిహరకళాభవన్–సంగీత్ జంక్షన్( రూ.800 కోట్లు). ♦ తార్నాక–మౌలాలి–ఈసీఐఎల్క్రాస్రోడ్స్–దమ్మాయిగూడ (రూ.500 కోట్లు). ♦ ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్–నేరేడ్మెట్–తిరుమలగిరి క్రాస్‌రోడ్స్(రూ. 300 కోట్లు). ♦ జేబీఎస్–ఆర్పీరోడ్– నెక్లెస్‌రోడ్–సెక్రటేరియట్–లక్డికాపూల్–మాసాబ్‌ట్యాంక్ జంక్షన్(రూ. 1200 కోట్లు). -
అంబర్పేట్ టు బోడుప్పల్ ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నేషనల్ హైవే, జీహెచ్ఎంసీల భాగస్వామ్యంతో చేపట్టనున్న పనులు ఇంకొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరిగేటప్పుడు సిటీజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి మళ్లింపులతో నరకం అనుభవిస్తున్నారు. ఫ్లైఓవర్ల పనులు పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుండడంతో సుదీర్ఘకాలం ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేవు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల పనుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తప్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని భావించిన జీహెచ్ఎంసీ... ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యేంత వరకు ప్రజలు సాఫీగా ప్రయాణించేందుకు 100–150 అడుగుల మేర విశాలమైన రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప్పల్, అంబర్పేట్ చేనెంబర్ వద్ద త్వరలో ప్రారంభం కానున్న ఫ్లైఓవర్ల పనుల్ని దృష్టిలో ఉంచుకొని... ఆ మార్గంలో ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించేందుకు ఆలోచన చేసింది. ఇందుకుగాను మేయర్, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అంబర్పేట్ అలీకేఫ్ నుంచి బోడుప్పల్‌లోని ఏషియన్ సినీస్క్వేర్ మల్టీప్లెక్స్ వరకు 150అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. తద్వారా యాదాద్రి, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి అంబర్పేట్ మీదుగా కోర్ సిటీలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు సదుపాయం కలుగనుంది. దీంతోపాటు మలి దశలో అంబర్పేట్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూసీ వెంబడి సమాంతరంగా మరో రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు. తద్వారా అంబర్పేట్, మలక్‌పేట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల వారికి సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ఆస్తుల సేకరణ వంటివి ఉండటంతో ప్రస్తుతానికి అలీకేఫ్ నుంచి ఏషియన్ సినీ స్క్వేర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే రూపొందించాల్సిందిగా మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు సూచించారు. అంబర్పేట్, ఉప్పల్ల వద్ద ఫ్లైఓవర్ల పనులు ప్రారంభమయ్యేలోగా ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి ఆస్తుల సేకరణ అవసరం లేకపోవడంతో వీలైనంత తొందనగా పనులు చేపట్టనున్నారు. అంబర్పేట్, ఉప్పల్ ఫ్లైఓవర్లకు సంబంధించి ఆస్తుల సేకరణ ప్రక్రియ ముమ్మరం చేశారు. మరోవైపు అలీకేఫ్ నుంచి జిందా తిలస్మాత్ వరకు 80అడుగుల వెడల్పుతో వైట్‌టాపింగ్ రోడ్డునిర్మించనున్నారు. అంబర్పేట్ చేనెంబర్ వద్ద రద్దీ సమయంలో గంట కు 15వేల వాహనాలు వెళ్తుండగా, ఉప్పల్ వద్ద దాదాపు 20వేల వాహనాలు వెళ్తున్నాయి. భవిష్యత్‌లో ఇవి మరింత పెరగనుండడంతో ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి ఈ ప్రాజెక్టులు చేపట్టారు. -
‘ఫ్లైఓవర్లతో ప్రయాణం ఇక సుఖమయం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం నగరంలో రూ.1523 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్ 765డీలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్కరీ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోన్న హైదరాబాద్ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో రోల్ మోడల్‌గా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలోని (ఎస్పీడీఆర్) ప్రాజెక్టులకు కూడా కేంద్ర సహకారం ఉంటే త్వరగా పూర్తి చేయొచ్చని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకు తెలంగాణ ప్రభుత్వం స్కైవే నిర్మించాలనే ప్రతిపాదన చేసిందని వివరించారు. ఈ స్కైవే నిర్మాణానికి రక్షణ శాఖ అధీనంలోని 100 ఎకరాల భూమి అవసరమవుతోందనీ, కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఎకరాల రక్షణ శాఖ స్థలానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే, శాశ్వత ప్రాతిపదికన ప్రతి ఏటా 30 కోట్లు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర, రాష్ట్రాల నిధులతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. -
2018 డిసెంబర్‌కు మూడు స్కైవేలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిర్మించాలను కుంటున్న 3 స్కైవేలను 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేసే లక్ష్యంతో అందుకు తగ్గట్టుగా ప్రణా ళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన అంశాలపై గురువారం బంజారాహిల్స్ క్యాంప్ కార్యాలయంలో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో పలు ప్రాంతాల్లోని ఎస్సార్ డీపీ(వ్యూహాత్మక రహదారుల ప్రాజెక్టు) పనులను వేగ వంతం చేయాలన్నారు. ఎస్సార్డీపీ పనుల కోసం రూ.2,691 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు లభించాయని చెప్పారు. ఈ నిధుల్లో ప్రాధాన్యత కింద తీసుకోవాల్సిన పను లపై ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు అవసరమైనన్ని నిధులిస్తామన్నారు. రాజీవ్ రహదారిపై తూముకుంట వరకు స్కైవే కోసం రక్షణ శాఖ భూములు అవసరం ఉన్నందున ఆ శాఖతో వేగంగా చర్చలు జరపాలని కేటీఆర్ ఆదేశించారు. జాతీ య రహదారుల శాఖతోనూ చర్చలు జరిపి నాగ్‌పూర్ హైవేపై నిర్మించే స్కైవే విషయంలో పూర్తిస్థాయి స్పష్టత కోసం ప్రయత్నించాలని సూచించారు. -
కాంట్రాక్టులు.. కమీషన్లేనా..!
♦ కేబీఆర్ పార్కు పరిరక్షణ పట్టదా? ♦ ఎస్ఆర్డీపీ వద్దు ‘సేవ్ కేబీఆర్ పార్క్’ ♦ సదస్సులో వక్తలు సోమాజిగూడ: అనాలోచితమైన విధానాలు, లోపభూయిష్టమైన అభివృద్ధి పథకాలు, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ పర్యావరణానికి తూట్లు పొడిచే విధానాలను ప్రభుత్వం అవలంబి స్తోందని పలువురు పర్యావరణవేత్తలు ఆభిప్రాయపడ్డారు. ఎస్ఆర్డిపీ (స్ట్రాటజిక్ రోడ్ డవలప్మెంట్ ప్లాన్) పథకాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజ లు, నిపుణుల అభిప్రాయలు స్వీకరించి శాస్త్రీయ, పర్యావరణ ప్రియమైన విధానాలతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ రైజింగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బేగంపేట సెస్ భవన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ కేబీఆర్ పార్క్ ’ సదస్సులో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పట్టణీకరణ నిపుణురాలు కరుణాగోపాల్, అనంత్ మరింగంటి తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఎస్ఆర్డిపీ నిర్మాణ పథకాలను తీవ్రంగా తప్పు పట్టారు. నగరానికి ఆత్మలాంటి ఉద్యానవనాలు, చెరువులను కాపాడుకోవాలన్నారు. చార్మినార్, మక్కామజీద్ లాంటి హెరిటేజ్ భవనాలను పక్కన పెట్టి హైటెక్ భవనాలను చూపుతూ హైదరాబాద్ నగర ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తక్కువ చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి తక్కువ ఖర్చుతో చక్కటి ప్రత్యామ్నాయాలు ఉండగా భారీ ఖర్చు, పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఫ్లైఓవర్ల నిర్మా ణం ఎందుకని ప్రశ్నించారు. కేబీఆర్ పార్క్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో నిర్మించే ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భారీ కాంట్రాక్ట్‌లు, కమీషన్ల మోజుతో నిర్మించే ఇలాంటి ప్రాజెక్ట్‌లు భవిష్యత్‌లో గుదిబండగా మారుతాయని , జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం కేబీఆర్ పార్క్ వద్ద భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో హైదరాబాద్ రైజింగ్ సంస్థ ప్రతినిధి శిల్పా శివరామన్తోపాటు పలువురు పర్యావరణప్రియులు పాల్గొన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఉచిత పథకాలతో అమాయక ఓటర్లను బుట్టలోవేసుకుంటున్న పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడుతూ పనికిమాలిన పథకాలు ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన నిర్ణయాలు, ప్రాజెక్ట్‌లతో పాలకులు మందుకు వెళుతుంటే మన పాలకులు మాత్రం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ లాబీల ప్రయోజనాల మేరకు పనిచేస్తూ విధ్వంసం చేస్తున్నారు. ఎస్ఆర్డీపీ కార్యక్రమానికి వ్యతిరేకంగా పర్యావరణవాదులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ప్రాజెక్ట్ నిలిపివేసే వరకు కలిసికట్టుగా పోరాడదాం. - మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాజీ వైస్ చైర్మన్, ఎన్డీఎంఏ కేబీఆర్ పార్క్ సిటీకి ఆక్సిజన్ నగరానికి కేబీఆర్ పార్క్ ఒక మణిహారం లాంటిది. ఒక ఆక్సిజన్ మాస్క్. ఇలాంటి పార్క్‌కు ఎస్ఆర్డీపీతో తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రయోజనాల మేరకు పనిచేస్తూ కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి జీవితాలను పణంగా పెడుతున్నారు. కాలుష్యంతో సతమతమవుతున్న నగరాలలో ఉన్న అతికొద్ది పార్కులను కూడా ధ్వంసం చేస్తున్నారు. దీంతో అవి నరకాలుగా మారుతున్నాయి. అర్థంపర్థం లేని పట్టణీకరణ మానవ విధ్వంసానికి దారి తీస్తుంది. కనీస అవసరాలు తీరక సామాన్యులు నానాపాట్లు పడుతుంటే ఫ్లై ఓవర్లు కావాలని ఎవరు అడిగారు...తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఉపసంహరించుకోవాలి. - ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త ఫ్లై ఓవర్లు సర్వరోగ నివారిణి కాదు నగరంలో కొన్ని ఫ్లైవోవర్లు నిర్మిస్తే అవి సర్వరోగ నివారిణి కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపరచడం, ఎంఎంటీఎస్ సమర్థ వినియోగం. కార్ పూలింగ్ ప్రొత్సహించడం, నగర వికేంద్రీకరణ ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కరించవచ్చు. ఎన్నో పక్షి జాతులు, పచ్చటి చెట్లతో నగరం నడిబొడ్డున కళకళలాడే కేబీఆర్ పార్క్‌ను అందరం కాపాడుకోవాలి. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో సహజ సౌందర్యంతో ఉండే పార్క్ మొత్తం నగరానికి ఆక్సిజన్ మాస్క్ లాంటిది. - అనంత్ మరింగంటి , హైదరాబాద్ అర్బన్ల్యాబ్స్ డెరైక్టర్ వేల కోట్లు వృథా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఫ్లైఓవర్లు నిర్మించడం మానేశారు. ఇది పాత పద్ధతి. బెంగళూర్, మైసూర్ మధ్య కనెక్టివిటీ పెంచే ఉద్దేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం 1998లో ప్రారంభించిన నైస్ ప్రాజెక్ట్ సుదీర్ఘంగా సాగి కొద్దికాలం క్రితమే పూర్తయింది. ఇన్ఫ్రా సైకిల్, పొలిటికల్ సైకిల్ వేరువేరు. తరచూ అధికారం చేతులు మారే ప్రజాస్వామంలో కొత్త పార్టీ రాగానే పాత ప్రాజెక్టులు పక్కన పడేస్తున్నారు. దీంతో వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. శాశ్వత ప్రాతిపదికన పర్యావరణహితమైన ప్రాజెక్టులు మాత్రమే మనుగడ సాగిస్తాయి. - కరుణాగోపాల్, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు -
మొదట రెండు
- కేబీఆర్ పార్కు, ఎల్బీ నగర్లలోనే మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్లు - మిగిలిన ప్రాంతాల్లో ఆలస్యం - నిధులు విడుదలైనా పనులు కష్టమే - సంపన్నులకే తొలి అవకాశం - సామాన్యుల బాధలు షరా మామూలే నా? - ఎస్ఆర్డీపీ పనులపై సందేహాలు సాక్షి, సిటీబ్యూరో: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా గ్రేటర్‌లోని 20 ప్రాంతాల్లో మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లై ఓవర్లు.. ఎక్స్‌ప్రెస్ కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2631 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రెండు ప్రాంతాల్లో మాత్రమే తక్షణం పనులకు అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన 20 ప్రదేశాల్లో ఎల్బీనగర్, కేబీఆర్ పార్కుల వద్ద మాత్రమే పెద్దగా ఇబ్బందులు లేవు. మిగతా ప్రాంతాల్లో మరి కొన్ని నెలలు ఆగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రెండున్నరేళ్లలో 20 ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. భూ సేకరణ పూర్తయితేనే అది సాధ్యమవుతుంది. వంద శాతం స్థలం అందుబాటులో ఉండి... ఎలాంటి ఆటంకాలు ఉండని ప్రాంతాల్లో మాత్రమే కాంట్రాక్టు పొందే సంస్థతో వెంటనే అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ లెక్కన అవకాశం ఉన్న చోటనే పనులు చేపడతారు. మిగిలిన ప్రాంతాల్లో నూరు శాతం స్థలం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి. భూ సేక‘రణమే’... ప్రాజెక్టులోని 20 ప్రదేశాల్లో 49.15 ఎకరాలు ప్రభుత్వ సంస్థల భూములే కాక మరో 581 ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు 30 ఎకరాలు. వీటి సేకరణ పెనుభారంగా మారనుంది. ఇవన్నీ ప్రధాన మార్గాల్లో... భారీ డిమాండ్ ఉన్నవి. నష్ట పరిహారం సంగతటుంచి...వీటిని కోల్పోయేందుకు ప్రైవేట్ వ్యక్తులు అంగీకరించడం అనుమానమే. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద ఆరు లేన్లతో మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ. 170 కోట్లు. మిగతా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల ఖర్చు సగటున దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా.. రెడ్ సిగ్నళ్లు పడకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. జంక్షన్లలో అవసరాన్ని బట్టి ఫ్లై ఓవర్లు.. అండర్‌పాస్‌లు.. ఒకటి/ రెండు/ మూడు లెవెల్స్‌లో ఫై ్లఓవర్లు నిర్మిస్తారు. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ దిగువ వరుసలో కానీ ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీనగర్ వద్ద అండర్‌పాస్ హయత్‌నగర్-నాగోల్, హయత్‌నగర్-దిల్సుఖ్నగర్, దిల్సుఖ్నగర్-హయత్‌నగర్, నాగోల్-సాగర్ రింగ్‌రోడ్డు మార్గాల్లో రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో సాగర్ రింగ్ రోడ్డు నుంచి కామినేని ఆస్పత్రి వరకు దాదాపు 2 కి.మీ.లు అండర్‌పాస్ ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతాలపైనే అంత మోజెందుకో.. ఎస్ఆర్డీపీ పనులిలా ఉండగా... తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ (వైట్ టాపింగ్) రోడ్డును సైతం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లోని సిటీ సెంట్రల్ నుంచి జోహ్రానగర్ సెంట్రల్ వరకు వేస్తున్నట్లు శనివారం జీహెచ్ఎంసీ ప్రకటించింది. పేపర్ అండ్ మిషన్ పద్ధతిలో దీనిని నిర్మించనున్నారు. దీని ఎంపికపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత ఖర్చు అవసరమా? ఇదిలా ఉండగా... రహదారుల కోసం రూ. 2631 కోట్లు వెచ్చించడం అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేబీఆర్ పార్కు, ఎల్బీనగర్ల వద్ద మాత్రమే తొలుత పనులు జరగనుండటంతో సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేబీఆర్ పార్కు వద్ద ఇప్పటికే మెరుగైన రహదారులు ఉన్నాయి. సంపన్నులు, వీఐపీలకు మరింత సౌకర్యం తప్ప సామాన్యులకు కాదంటున్నారు. ఇక ఎల్బీనగర్లో విశాలమైన రహదారులు ఉన్నాయి. త్వరలోనే మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏమాత్రం సదుపాయాలు లేని మార్గాల్లో తొలుత పనులు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రజామోదం ఉండాలి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికే దాదాపు రూ.15 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించారు. మరో ఏడాదిన్నరలో ఇది అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల 30 శాతం రద్దీ తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. అదలా ఉండగానే మరో రూ.2631 కోట్లతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పనులు చేపట్టడం సమంజసం కాదు. వీటిలో ఎక్కువ నిధులు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి సంపన్న ప్రాంతాలకే కేటాయించనున్నారు. నగరంలోని బస్తీల ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా ఈ పనులు చేపట్టడం కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయనేతలు, అధికారుల లబ్ధికోసమేననే అభిప్రాయం కలుగుతోంది. వీటికయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీయే చెల్లించాలి. అంటే ప్రజలు కట్టే పన్నుల నుంచే. ఈ భారం ప్రజలపైనే పడుతుంది. ప్రజలతో చర్చించకుండా... వారి ఆమోదం లేకుండా పనులు చేపట్టడం తగదు. -పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం అవసరం 20 ఫ్లైఓవర్లలో జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే 11 ప్రతిపాదించారు. నగరంలో గతంలో జరిగిన అభివృద్ధి అంతా కొన్ని వర్గాలు, ప్రాంతాలకే పరిమితమైంది. ప్రస్తుత టీఆర్ఎస్ కూడా అదే బాటలో కొనసాగుతోంది. జీహెచ్ఎంసీకి ఉన్న కొద్దిపాటి నిధులను సంపన్నుల ప్రాంతాలకే వెచ్చిస్తే... మురికివాడలు, శివారు ప్రాంతాలు, పాతబస్తీ అభివృద్ధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ఈ పనులపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. - ఎం. శ్రీనివాస్, సీపీఐ(ఎం), గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి