ప్రత్యామ్నాయ రహదారి మార్గం (గూగుల్ మ్యాప్)
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నేషనల్ హైవే, జీహెచ్‌ఎంసీల భాగస్వామ్యంతో చేపట్టనున్న పనులు ఇంకొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరిగేటప్పుడు సిటీజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి మళ్లింపులతో నరకం అనుభవిస్తున్నారు. ఫ్లైఓవర్ల పనులు పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుండడంతో సుదీర్ఘకాలం ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేవు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల పనుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తప్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని భావించిన జీహెచ్‌ఎంసీ... ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యేంత వరకు ప్రజలు సాఫీగా ప్రయాణించేందుకు 100–150 అడుగుల మేర విశాలమైన రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప్పల్, అంబర్‌పేట్ చేనెంబర్ వద్ద త్వరలో ప్రారంభం కానున్న ఫ్లైఓవర్ల పనుల్ని దృష్టిలో ఉంచుకొని... ఆ మార్గంలో ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించేందుకు ఆలోచన చేసింది. ఇందుకుగాను మేయర్, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అంబర్‌పేట్ అలీకేఫ్ నుంచి బోడుప్పల్‌లోని ఏషియన్ సినీస్క్వేర్ మల్టీప్లెక్స్ వరకు 150అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించాలని నిర్ణయించారు.
తద్వారా యాదాద్రి, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి అంబర్‌పేట్ మీదుగా కోర్ సిటీలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు సదుపాయం కలుగనుంది. దీంతోపాటు మలి దశలో అంబర్‌పేట్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూసీ వెంబడి సమాంతరంగా మరో రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు. తద్వారా అంబర్‌పేట్, మలక్‌పేట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల వారికి సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ఆస్తుల సేకరణ వంటివి ఉండటంతో ప్రస్తుతానికి అలీకేఫ్ నుంచి ఏషియన్ సినీ స్క్వేర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే రూపొందించాల్సిందిగా మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు సూచించారు. అంబర్‌పేట్, ఉప్పల్‌ల వద్ద ఫ్లైఓవర్ల పనులు ప్రారంభమయ్యేలోగా ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి ఆస్తుల సేకరణ అవసరం లేకపోవడంతో వీలైనంత తొందనగా పనులు చేపట్టనున్నారు. అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లైఓవర్లకు సంబంధించి ఆస్తుల సేకరణ ప్రక్రియ ముమ్మరం చేశారు. మరోవైపు అలీకేఫ్ నుంచి జిందా తిలస్మాత్ వరకు 80అడుగుల వెడల్పుతో వైట్‌టాపింగ్ రోడ్డునిర్మించనున్నారు.
అంబర్‌పేట్ చేనెంబర్ వద్ద రద్దీ సమయంలో గంట కు 15వేల వాహనాలు వెళ్తుండగా, ఉప్పల్ వద్ద దాదాపు 20వేల వాహనాలు వెళ్తున్నాయి. భవిష్యత్‌లో ఇవి మరింత పెరగనుండడంతో ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి ఈ ప్రాజెక్టులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment