మళ్లీ అప్పు! | GHMC Request to Banks For Loan Again | Sakshi
Sakshi News home page

మళ్లీ అప్పు!

Published Fri, Jul 5 2019 8:04 AM | Last Updated on Mon, Jul 8 2019 1:19 PM

GHMC Request to Banks For Loan Again - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మరోసారి అప్పు బాట పట్టనుంది. ఎస్సార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు, రహదారుల విస్తరణ తదితర పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ పనుల కోసం మొత్తం రూ.3500 కోట్లు రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అనుమతించింది. ఇందులో రూ.1000 కోట్లు  బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ.2500 కోట్లు బ్యాంకు లోన్ల(రుపీ టర్మ్‌లోన్‌–ఆర్‌టీఎల్‌) ద్వారా తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అనుమతి పొందింది. బాండ్ల జారీ ద్వారా ఒకసారి రూ.200 కోట్లు, మరోసారి రూ.195 కోట్లు మొత్తం రూ.395 కోట్లు సేకరించారు. సదరు నిధులు గత మార్చినాటికి ఖర్చయిపోయాయి. అప్పటి నుంచే బాండ్ల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికలు రావడం, కొన్ని ఆర్థిక సంస్థలు భారీ మొత్తాలు చెల్లించక డిఫాల్ట్‌ కావడం.. బాండ్ల మార్కెట్‌ స్థిరంగా లేకపోవడంతో పరిస్థితులు కుదుటపడ్డాక బాండ్ల జారీకి వెళ్లాలనుకున్నారు. ప్రస్తుతం ముంబైలో వరదలతో పాటు బాండ్ల ద్వారా రుణాలు సేకరిస్తే ఎక్కువ వడ్డీ పడే అవకాశం ఉండటంతో ‘రుపీ టర్మ్‌లోన్‌’కు వెళ్లాలని నిశ్చయించారు. ఈ మేరకు గ్రేటర్‌ ఉన్నతాధికారులు ఇప్పటికే బ్యాంకర్లతో ఒక దఫా సమావేశం కూడా నిర్వహించారు. 

టెండర్‌ ద్వారా బ్యాంక్‌ ఎంపిక
తొలిసారిగా బాండ్ల ద్వారా జీహెచ్‌ఎంసీ రూ.200 కోట్లను 8.90 శాతం కూపన్‌రేటు(వడ్డీ)కు తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే 9.5 శాతం.. అంతకంటే ఎక్కువ కూపన్‌రేటు ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఈ వడ్డీకి బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. టెండరు ఆహ్వానిస్తే పోటీపడి బ్యాంకులు మరింత తక్కువ వడ్డీకే ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎస్‌బీఐ క్యాపిటల్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. బాండ్ల ద్వారా, బ్యాంకుల ద్వారా నిధులు సేకరించే సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ ఎస్‌బీఐ క్యాపిటల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైన ప్రక్రియ పూర్తిచేసి ఈ నెలాఖరు నాటికి రూ.305 కోట్లు సేకరించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే రూ.395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించడంతో మరో రూ.305 కోట్లు సేకరిస్తే మొత్తం ఎస్సార్డీపీ పనుల కోసం రూ.700 కోట్లు సేకరించినట్లవుతుంది. ఈ నిధులు ఖర్చయ్యాక అవసరాన్ని బట్టి మళ్లీ బాండ్ల జారీ ద్వారా కానీ, బ్యాంక్‌ రుణాల ద్వారా కానీ తీసుకోనున్నారు.

తెచ్చిన నిధులన్నీ ఖర్చు
ఎస్సార్‌డీపీ పనుల కోసమే ఈ రుణాల నిధులు ఖర్చు చేయాల్సి ఉండటంతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించే వీలులేదు. మరోవైపు ఇతర పద్దులకు చెందిన నిధులను ఎస్సార్‌డీపీ పనులకు ఖర్చు చేసినా, రుణం పొందాక సదరు పద్దులోకి మళ్లించే అవకాశం లేదు. గత మార్చిలో బాండ్ల నిధులు ఖర్చయిపోవడంతో తర్వాత పెండింగ్‌లోని బిల్లులు చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ జనరల్‌ ఫండ్స్‌ నుంచే ఇప్పటి వరకు దాదాపు రూ.52 కోట్లు చెల్లించారు. ఇది ఇతర పనులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్సార్‌డీపీ పనులకు సంబంధించి ప్రస్తుతం దాదాపు రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఖజానాలో కూడా నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఇక నిధులు సేకరించడం తక్షణాసరం కావడంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి కానీ, వచ్చేనెల తొలివారం లోగా కానీ నిధులందనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి, వివిధ పన్నుల వసూళ్లు తదితరమైనవి అధ్యయనం చేసిన ఆర్థిక సంస్థలు ఏఏ (స్టేబుల్‌) రేటింగ్‌నిచ్చాయి. ఆ రేటింగ్‌తోనే జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీకి వెళ్లింది. తొలివిడతలో 2018 ఫిబ్రవరిలో రూ.200 కోట్లు 8.90 వడ్డీకే లభించినప్పటికీ, ఆగస్టులో రెండో విడత రూ.195 కోట్లను 9.38 వడ్డీకి తీసుకున్నారు. మూడో విడత రూ.305 కోట్ల సేకరణ కూడా బాండ్ల ద్వారానే చేయాలనుకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బ్యాంకుల వైపు మళ్లారు. బాండ్ల ద్వారా సేకరిస్తే మొత్తం రూ.305 కోట్లలో రూ.205 కోట్లను ‘గ్రీన్‌షూ ఆప్షన్‌’ ద్వారా తీసుకునేందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. గ్రీన్‌ షూ ఆప్షన్‌ అంటే.. బాండ్ల ద్వారా నిధులిచ్చేందుకు ముందుకొచ్చే సంస్థల్లో రెండు మూడు సంస్థల నుంచి నిధులు సేకరించేందుకు సిద్ధమైనప్పుడు వాటిలో దేనికి ఎక్కువ వడ్డీ చెల్లిస్తే.. అదే వడ్డీని తక్కువ వడ్డీకి ముందుకొచ్చిన వాటికి కూడా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

విడతల వారీగానే సేకరణ
ఎస్సార్‌డీపీ పనుల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు కాగా, వీటిలో రూ.395 కోట్లు బాండ్ల జారీ ద్వారా సేకరించారు. భూసేకరణ వంటి పనులన్నీ పూర్తయితే ఈ ఏడాది మరో రూ.1500 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఒకేసారి అన్ని నిధుల్ని తీసుకుంటే వడ్డీ ఎక్కువవుతుంది కనుక పనుల పురోగతిని బట్టి విడతల వారీగా నిధులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రూ.305 కోట్ల సేకరణకు సిద్ధమయ్యారు. ఎస్పార్‌డీపీలో భాగంగా ఎల్‌బీనగర్, బయోడైవర్సిటీ, రోడ్‌ నెంబర్‌ 45, షేక్‌పేట, కొండాపూర్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. వీటిలో దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిని ఈ ఏడాది లోగా ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement