నిర్మాణంలో ఉన్న బయోడైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్
సాక్షి సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)... నగరంలో ట్రాఫిక్ చింతలను తీర్చేందుకు, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం. ఈ ప్రాజెక్టు కింద వివిధ దశల్లో రూ.25 వేల కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించగా... దాదాపు రూ.7వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.300 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గాయి. మరికొన్ని ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గడిచిన 10 నెలల కాలంలో వివిధ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉండడం, బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు మార్కెట్ పరిస్థితి బాగాలేకపోవడం, వడ్డీ రేటు అధికంగా ఉండడం తదితర కారణాలతో జీహెచ్‌ఎంసీ బాండ్లకు వెళ్లలేదు. కొన్ని మార్గాల్లో భూసేకరణ, యుటిలిటీస్ తరలింపు పనుల్లో జాప్యం లాంటి కారణాలతో పనుల్లో వేగం తగ్గింది. త్వరలోనే బాండ్ల ద్వారా రూ.400 కోట్లు సేకరించేందుకు, భూసేకరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్, సిబ్బందిని నియమించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్సార్డీపీ పనుల్లో తిరిగి వేగం పుంజుకుంటుందని కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పనులు, ఎదురవుతున్న అవాంతరాలు, ఆయా దశల్లోని పనుల స్థితిగతులపై ‘సాక్షి’ రిపోర్టు.
మూడేళ్ల క్రితం ప్రారంభం
గ్రేటర్‌లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీ ప్రయాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఎస్సార్డీపీ ప్రాజెక్టు చేపట్టింది. గతేడాది వరకు ఈ పనులు వేగంగానే జరగ్గా... ఇటీవల కొంత మందగించాయి. ఈ పనుల కోసం రెండు దశల్లో జీహెచ్‌ఎంసీ రూ.395 కోట్లు సేకరించింది. ఈ నిధులను ఇతర పనులకు కేటాయించే వీలు లేకపోవడంతో పనులు ముందుకు సాగాయి. అయితే ఏప్రిల్ నుంచి నిధులు లేకపోవడంతో బాండ్లు/ బ్యాంకు రుణాల ద్వారా తీసుకునేందుకు చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ త్వరలోనే రూ.400 కోట్లు సేకరించనుంది.
ప్రాజెక్టుల వివరాలివీ...
♦ ఎల్‌బీనగర్ ఐదు జంక్షన్లలో (ఎల్‌బీనగర్, కామినేని, నాగోల్, బైరామల్‌గూడ, చింతల్‌కుంట) 8 ఫ్లైఓవర్లు, 2 అండర్‌పాస్‌లు. అంచనా వ్యయం రూ.448 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.167 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సవరానికి రూ.105 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. 35 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి.
♦ మైండ్‌స్పేస్, బయో డైవర్సిటీ పరిసరాల్లో పనులకు అంచనా వ్యయం రూ.379 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.284 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.40 కోట్లు అవసరం. భూసేకరణకు రూ.64 కోట్లు ఖర్చు చేశారు. 80 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. బయో డైవర్సిటీ వద్ద మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది.
♦ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లేన్ల రహదారి (ఎలివేటెడ్ కారిడార్)కి అంచనా వ్యయం రూ.150 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.65 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.40 కోట్లు, భూసేకరణకు రూ.20 కోట్లు అవసరం. సివిల్ పనులు 52 శాతం పూర్తయ్యాయి. 21 ఆస్తులు సేకరించాల్సి ఉంది.
♦ దుర్గం చెరువుపై కేబుల్ స్టే బ్రిడ్జి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.90 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.94 కోట్లు అవసరం. సివిల్ పనులు 63 శాతం పూర్తయ్యాయి.
♦ షేక్‌పేట – విస్పర్‌వ్యాలీ... సెవెన్ టూంబ్స్ (షేక్‌పేట), ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ వరకు ఆరు లేన్లుగా రెండువైపులా రాకపోకలకు ఫ్లైఓవర్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.333.55 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.181 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. 88 ఆస్తులు సేకరించాల్సి ఉండగా.. 13 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది.
♦ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో ఫ్లైఓవర్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.263 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.138 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. సివిల్ పనులు 63 శాతం పూర్తయ్యాయి. 160 ఆస్తులు సేకరించాల్సి ఉండగా... 40 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది.
♦ ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.63 కోట్లు కాగా.. ఇప్పటి వరకు చేసిన రూ.15 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.37 కోట్లు అవసరం. 19 శాతం మేర పనులు పూర్తయ్యాయి. 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్‌కు 38 పిల్లర్లకు గాను 13 పూర్తయ్యాయి. 13 ఆస్తులు సేకరించాల్సి ఉంది.
♦ బహదూర్‌పురా జంక్షన్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.69 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.28 కోట్లు అవసరం. 780 మీటర్ల పొడవుండే దీనికి 9 పిల్లర్లకు గాను నాలుగింటి పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 47 ఆస్తులకు గాను ఆరింటిని సేకరించారు.
నిధులకు కొరత లేదు
బాండ్ల ద్వారా నిధుల సేకరణ కోసం శుక్రవారం ముంబై వెళ్తున్నాం. రూ.400 కోట్లు సేకరిస్తాం. రానున్న 6 నెలల్లో మరో రూ.3,000 కోట్ల మేర పనులకు టెండర్లు పూర్తి చేసి ప్రారంభిస్తాం. భూసేకరణ, యుటిలిటీస్ తరలింపులో జాప్యం నిజమే. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్, సిబ్బందిని నియమిస్తాం. నిధుల లేమితో పనులు ఆగిపోలేదు. బాండ్ల నిధులు ఖర్చయ్యాక కూడా దాదాపు రూ.100 కోట్లు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేశాం. వడ్డీ భారం పెరగకుండా ఉండేందుకు పనుల పురోగతి మేరకు ఎప్పటి కప్పుడు నిధులు సేకరిస్తాం. – ఎం.దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్
పూర్తయిన పనులివీ...
♦ అయ్యప్పసొసైటీ అండర్‌పాస్
♦ మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్
♦ మెండ్‌స్పేస్ ఫ్లైఓవర్
♦ చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్
♦ కామినేని ఎడమవైపు ఫ్లైఓవర్
♦ ఎల్‌బీనగర్ ఎడమవైపు ఫ్లైఓవర్
♦ రాజీవ్‌గాంధీ ఫ్లైఓవర్
మొత్తం రూ.6,759 కోట్లు
ఎస్సార్డీపీ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన వాటిలో ఎన్జీటీ తీర్పులు, టెండర్లకు ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉండడం తదితర కారణాలతో దాదాపు రూ.1297 కోట్ల పనులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. రూ.292 కోట్ల పనులు పూర్తయి.. పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment