సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది.. సోమవారం మధ్యాహ్నం కుండ పోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్ర నగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, మెహిదిపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.
హైదరాబాద్‌లో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతలోనే భారీ వర్షం కమ్ముకొచ్చింది. తొలుత చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన ఉన్నవాళ్లు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునేలోపు పూర్తిగా తడిచిపోయారు. దీనికి తోడు ఓ వైపు ట్రాఫిక్ జామ్, రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్షంగా నరకం చూసినంత పనైంది.
మరోవైపు నగరంలో మరో రెండు మూడు గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment