Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.? | Heavy Rains Made A Big Disturb In Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.?

Published Tue, Sep 5 2023 2:58 PM | Last Updated on Tue, Sep 5 2023 3:42 PM

Rain made Hyderabad a big disturb - Sakshi

హైదరాబాద్ : జంట నగరాల్లో వానలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బిక్కుబిక్కు‍మంటూ గడుపుతున్నారు. కొన్ని పాంత్రాల్లో కరెంట్‌ లేకపోవడంతో​ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇక, మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షంతో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచే భారీ వ‌ర్షం కురవడంతో.. రోడ్లు, లోత‌ట్టు నీట మునిగాయి. అక్కడ‌క్కడా పిడుగులు ప‌డ‌టంతో ప్రజలు వణికిపోయారు. షేక్ పేటలో పరిస్థితిని ఓ సిటిజన్ ఇలా వీడియోతో రిపోర్ట్ చేశాడు.

భూపాలపల్లి జిల్లాలో పిడుగుల బీభత్సం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు గూడూరు రాజేశ్వర్ రావు (46) మృతి చెందారు. పొలంలో కలుపు తీస్తుండగా రైతు పిడుగుపాటుకు గురయ్యారు. చిట్యాల మండలం శాంతినగర్‌లో మిరప నారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు చెలివేరు సరిత(30), నెరిపటి మమత(32) మరణించారు. 

మరో ఇద్దరు మహిళలు అరెపల్లి కొమురమ్మ, మైదం ఉమకు గాయాలయ్యాయి. వారిని  చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఇద్దరు మహిళల స్వగ్రామం చిట్యాలగా గుర్తించారు. ఇక పిడుగుల వర్షంతో  గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

చాలా చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనంతగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా...మ్యాన్‌హోల్స్, నాలాలు పొంగిపోర్లుతున్నాయి.  టోలిచౌకిలో దాదాపు కాలనీ అంతా నీళ్లు చేరాయి.

ట్రాఫిక్‌.. నరకయాతన 

కుండపోత వర్షంతో నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ పోలీసులు వీలైనంత వరకు వాహనదారుల్ని అలర్ట్ చేస్తూ కనిపించారు.

ప్రధానంగా పంజగుట్ట నిమ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, కేబీఆర్‌ పార్క్, జూబ్లీహిల్స్, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్‌ రోడ్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్,  అబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆఫీసులకు  వెళ్లే టైంలో భారీవర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంత్ నగర్ లో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది.

క్షేత్రస్థాయిలో అధికారులు 
నగరంలో వర్షం కురుస్తున్నందున మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌తో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితి చక్కదిద్దుతున్నారని GHMC తెలిపింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 191 వద్ద పరిస్థితి ఇలా ఉంది.

బీ అలర్ట్‌ 
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రజలకు చుక్కలు కనిపించాయి.

వరద నష్టం

వరద ఒక్కసారిగా పోటెత్తడంతో భారీ ఆస్తినష్టం జరిగిందని పలువురు సిటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరి వాహనాలు కొట్టుకుపోతే.. మరికొందరి వాహనాలు నీట మునిగాయి. ఇంకొందరి ఇళ్లలో నీళ్లు చేరాయి.

వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు DRF టీమ్స్‌ అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. వరదలు, చెట్లు కూలడం తదితర సమస్యల నుంచి రక్షణకు ప్రజలు 040–21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని పేర్కొంది.   


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement