
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం.. ఏ విభాగంలో పని చేసినా.. అక్కడ అత్యుత్తమ సేవలందించడం.. డిపార్ట్ మెంట్‌లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్‌లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు.. హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ నరసింహరావు. మియాపూర్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్‌ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్ )కు ఎంపిక చేసింది.
2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన.. ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం... అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ... తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది. ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment