మొదట రెండు
- కేబీఆర్ పార్కు, ఎల్‌బీ నగర్‌లలోనే మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్లు
- మిగిలిన ప్రాంతాల్లో ఆలస్యం
- నిధులు విడుదలైనా పనులు కష్టమే
- సంపన్నులకే తొలి అవకాశం
- సామాన్యుల బాధలు షరా మామూలే నా?
- ఎస్‌ఆర్‌డీపీ పనులపై సందేహాలు
సాక్షి, సిటీబ్యూరో: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా గ్రేటర్‌లోని 20 ప్రాంతాల్లో మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లై ఓవర్లు.. ఎక్స్‌ప్రెస్ కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2631 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రెండు ప్రాంతాల్లో మాత్రమే తక్షణం పనులకు అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన 20 ప్రదేశాల్లో ఎల్‌బీనగర్, కేబీఆర్ పార్కుల వద్ద మాత్రమే పెద్దగా ఇబ్బందులు లేవు.
మిగతా ప్రాంతాల్లో మరి కొన్ని నెలలు ఆగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రెండున్నరేళ్లలో 20 ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. భూ సేకరణ పూర్తయితేనే అది సాధ్యమవుతుంది. వంద శాతం స్థలం అందుబాటులో ఉండి... ఎలాంటి ఆటంకాలు ఉండని ప్రాంతాల్లో మాత్రమే కాంట్రాక్టు పొందే సంస్థతో వెంటనే అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ లెక్కన అవకాశం ఉన్న చోటనే పనులు చేపడతారు. మిగిలిన ప్రాంతాల్లో నూరు శాతం స్థలం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి.
భూ సేక‘రణమే’...
ప్రాజెక్టులోని 20 ప్రదేశాల్లో 49.15 ఎకరాలు ప్రభుత్వ సంస్థల భూములే కాక మరో 581 ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు 30 ఎకరాలు. వీటి సేకరణ పెనుభారంగా మారనుంది. ఇవన్నీ ప్రధాన మార్గాల్లో... భారీ డిమాండ్ ఉన్నవి. నష్ట పరిహారం సంగతటుంచి...వీటిని కోల్పోయేందుకు ప్రైవేట్ వ్యక్తులు అంగీకరించడం అనుమానమే.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద ఆరు లేన్లతో మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ. 170 కోట్లు. మిగతా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల ఖర్చు సగటున దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా.. రెడ్ సిగ్నళ్లు పడకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. జంక్షన్లలో అవసరాన్ని బట్టి ఫ్లై ఓవర్లు.. అండర్‌పాస్‌లు.. ఒకటి/ రెండు/ మూడు లెవెల్స్‌లో ఫై ్లఓవర్లు నిర్మిస్తారు. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ దిగువ వరుసలో కానీ ఏర్పాటు చేయనున్నారు.
ఎల్‌బీనగర్ వద్ద అండర్‌పాస్
హయత్‌నగర్-నాగోల్, హయత్‌నగర్-దిల్‌సుఖ్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్-హయత్‌నగర్, నాగోల్-సాగర్ రింగ్‌రోడ్డు మార్గాల్లో రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో సాగర్ రింగ్ రోడ్డు నుంచి కామినేని ఆస్పత్రి వరకు దాదాపు 2 కి.మీ.లు అండర్‌పాస్ ఏర్పాటు చేయనున్నారు.
ఆ ప్రాంతాలపైనే అంత మోజెందుకో..
ఎస్‌ఆర్‌డీపీ పనులిలా ఉండగా... తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ (వైట్ టాపింగ్) రోడ్డును సైతం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లోని సిటీ సెంట్రల్ నుంచి జోహ్రానగర్ సెంట్రల్ వరకు వేస్తున్నట్లు శనివారం జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. పేపర్ అండ్ మిషన్ పద్ధతిలో దీనిని నిర్మించనున్నారు. దీని ఎంపికపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంత ఖర్చు అవసరమా?
ఇదిలా ఉండగా... రహదారుల కోసం రూ. 2631 కోట్లు వెచ్చించడం అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేబీఆర్ పార్కు, ఎల్‌బీనగర్‌ల వద్ద మాత్రమే తొలుత పనులు జరగనుండటంతో సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేబీఆర్ పార్కు వద్ద ఇప్పటికే మెరుగైన రహదారులు ఉన్నాయి. సంపన్నులు, వీఐపీలకు మరింత సౌకర్యం తప్ప సామాన్యులకు కాదంటున్నారు. ఇక ఎల్‌బీనగర్‌లో విశాలమైన రహదారులు ఉన్నాయి. త్వరలోనే మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏమాత్రం సదుపాయాలు లేని మార్గాల్లో తొలుత పనులు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ప్రజామోదం ఉండాలి
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికే దాదాపు రూ.15 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించారు. మరో ఏడాదిన్నరలో ఇది అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల 30 శాతం రద్దీ తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. అదలా ఉండగానే మరో రూ.2631 కోట్లతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పనులు చేపట్టడం సమంజసం కాదు. వీటిలో ఎక్కువ నిధులు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి సంపన్న ప్రాంతాలకే కేటాయించనున్నారు. నగరంలోని బస్తీల ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా ఈ పనులు చేపట్టడం కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయనేతలు, అధికారుల లబ్ధికోసమేననే అభిప్రాయం కలుగుతోంది. వీటికయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీయే చెల్లించాలి. అంటే ప్రజలు కట్టే పన్నుల నుంచే. ఈ భారం ప్రజలపైనే పడుతుంది. ప్రజలతో చర్చించకుండా... వారి ఆమోదం లేకుండా పనులు చేపట్టడం తగదు.
-పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్
అఖిలపక్ష సమావేశం అవసరం
20 ఫ్లైఓవర్లలో జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే 11 ప్రతిపాదించారు. నగరంలో గతంలో జరిగిన అభివృద్ధి అంతా కొన్ని వర్గాలు, ప్రాంతాలకే పరిమితమైంది. ప్రస్తుత టీఆర్‌ఎస్ కూడా అదే బాటలో కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీకి ఉన్న కొద్దిపాటి నిధులను సంపన్నుల ప్రాంతాలకే వెచ్చిస్తే... మురికివాడలు, శివారు ప్రాంతాలు, పాతబస్తీ అభివృద్ధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ఈ పనులపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి.
- ఎం. శ్రీనివాస్, సీపీఐ(ఎం), గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి