చట్టంతో కొట్టేద్దాం..
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి పెద్దఎత్తున భూములను సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రైతుల నుంచి కారుచౌకగా భూములను స్వాధీనం చేసుకోవడంపై దృష్టిని సారించారు. ఉన్నపళంగా భూములను సేకరించడానికి 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం అడ్డంకిగా మారుతోంది. అన్ని చోట్లా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో చట్టంలో సవరణలు చేసి, రైతులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించారు. 2013 భూ సేకరణలో అడ్డంకులను అధిగమించడం, నామమాత్రపు పరిహారం చెల్లించి భూములను సేకరించడం కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని ఈ కొత్త చట్టాన్ని చేసే పనిలో పడింది. తమిళనాడు తరహాలో భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని అధ్యయనం చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)ను, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పరిశ్రమలు, రహదారులకు అవసరమైన భూములను ఏకపక్షంగా సేకరించడం కోసం ఏడాదిపాటు అమల్లో ఉండేలా తమిళనాడు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. భూసేకరణ చట్టంలోని ఒక క్లాజు ఆధారంగా ఈ సవరణలు చేసింది. భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, 80 శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూసేకరణ చేయాలని, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్ర భూ సేకరణ చట్టంలో నిర్దేశించారు.
అయితే, తమిళనాడు ప్రభుత్వం ఏడాదిపాటు కేంద్ర భూ సేకరణ చట్టంలోని నిబంధనలను మినహాయిస్తూ సవరణలు చేపట్టింది. తద్వారా పరిశ్రమల కోసం రైతుల నుంచి ఏకంగా 53 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భూ సేకరణ చట్టంలో సవరణలు తీసుకువచ్చి రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది.
2013 భూ సేకరణ చట్టమే ప్రస్తుతం అమల్లో ఉంది. అందులో సవరణలు తీసుకువస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోయింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ సేకరణ చేయాలంటే తొలుత సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో భూ సేకరణకు మార్కెట్ విలువపై నాలుగింతల పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. అదే పట్టణ ప్రాంతాల్లో భూ సేకరణకు మార్కెట్ విలువ పై రెండింతల పరిహారం చెల్లించాలి. భూమి కోల్పోయిన రైతులకు ఇళ్లతోపాటు ఒకసారి అలవెన్స్ గానీ లేదా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గానీ ఇవ్వాలి.
ప్రైవేట్ సంస్థల కోసం భూ సేకరణ చేయాలంటే 80 శాతం మంది భూమి యజమానుల అంగీకారం ఉండాలి. ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్య ప్రాజెక్టులకైతే 70 శాతం మంది భూమి యజమానుల అంగీకారం అవసరం. వీటన్నింటినీ లెక్కచేయకుండా తమిళనాడు ప్రభుత్వం పరిశ్రమలు, రహదారుల కోసం భూ సేకరణ చట్టంలో సవరణలు చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. పరిశ్రమల కోసమే 10 లక్షల ఎకరాలను సేకరించాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమిళనాడు భూ సేకరణ చట్టం అత్యుత్తమంగా ఉందని ముఖ్యమంత్రి ఇటీవల ఒక సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.