రామాయపట్నం పోర్టులో వేగంగా జరుగుతున్న బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు
రామాయపట్నం పోర్టు నుంచి చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి ప్రతినిధి: ఎక్కడైనా ఓ అభివృద్ధి పథకం కోసమో.. లేక ప్రాజెక్టు కోసమో ప్రభుత్వం భూ సేకరణకు దిగిందంటే ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు పెల్లుబుకుతుంటాయి. అయితే రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా స్థానికులే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. పరిహారం, పునరావాసం విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మానవతా దృక్ఫథ విధానం వల్లే స్థానిక గ్రామాల నుంచి పూర్తి మద్దతు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.
జూలై 20న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఒక్క రోజు కూడా విరామం లేకుండా రేయింబవళ్లు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పైలాన్ ఆవిష్కరించి వెళ్లిపోయిందని, అయితే ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోజు నుంచే పనులు ప్రారంభించిందని ప్రశంసిస్తున్నారు. రామాయపట్నం పోర్టు రాక వల్ల తమ ప్రాంతం అభివృద్ధి కానుండటంతో సంతోషంగా తమ గ్రామాలను ఖాళీ చేయడానికి గ్రామస్తులు ముందుకు వస్తున్నారు.
భూ సేకరణ దగ్గర నుంచి పునరావాస ప్యాకేజీ వరకు ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించిందని, దీంతో గ్రామాలను ఖాళీ చేయడానికి అంగీకరిస్తున్నామని మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామస్తులు ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం పోర్టు కోసం 850 ఎకరాలు సేకరించి, నష్ట పరిహారం కింద రూ.89 కోట్లు చెల్లించింది. ఇప్పుడు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో మూడు గ్రామాలను ఖాళీ చేయించడంపై దృష్టి సారించింది. మూడు గ్రామాలకు తోడు సమీపంలోని సాలిపేట గ్రామం వద్ద ఉన్న 25 కుటుంబాలతో కలిపి మొత్తం 594 కుటుంబాలను ఖాళీ చేయించనున్నారు.
తొలి దశలో మొండివారిపాలెం, ఆవులవారిపాలెంకు చెందిన 220 కుటుంబాలకు మంగళవారం నుంచి పరిహారం చెక్కుల పంపిణీ ప్రారంభించనున్నారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.9.96 లక్షలు, 5 సెంట్ల భూమిని ఇవ్వనుంది. ఒక కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ఆడ లేదా మగ పిల్లలు ఉన్నా, లేక పెద్ద వయసుఉన్న తల్లిదండ్రులు ఉన్నా.. వారిని వేరే కుటుంబాలుగా లెక్కించి పరిహారం అందించడాన్ని గ్రామస్తులు స్వాగతిస్తున్నారు. ఈ విధంగా 594 ఇళ్లకు గాను సుమారు 675 కుటుంబాలుగా పరిగణించి, పునరావాస ప్యాకేజీ అందిస్తున్నారు. ఇంటి విస్తీర్ణం ప్రకారం విలువ లెక్కించి మార్కెట్ విలువ కంటే రెట్టింపు పరిహారం ఇస్తున్నారు. పునరావాస ప్యాకేజీ కింద రూ.160 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
సర్కారు పెద్ద మనసు..
► తాజాగా 3 గ్రామాలకు చెందిన 594 ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు
► వీరికి తెట్టుగ్రామం వద్ద 23 ఎకరాల్లో 675 ప్లాట్ల కేటాయింపు
► మేజర్ పిల్లలు, వృద్ధులు ఉంటే వేరే కుటుంబంగా పరిగణన
► రూ.19 కోట్లతో పాఠశాల, ఆస్పత్రి, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన
► ఒక్కో కుటుంబానికి రూ.9.96 లక్షలు చొప్పున పునరావాస ప్యాకేజీ
► ఇప్పుడున్న ఇంటి విస్తీర్ణం విలువ మదింపు చేసి రెట్టింపు పరిహారం
23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం
రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద ప్రభుత్వం 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి కేటాయిస్తూ.. ఇందుకు అనుగుణంగా రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. కేవలం మౌలిక వసతుల కల్పనకే రూ.19 కోట్లు వ్యయం చేస్తోంది. ఇప్పటికే 23 ఎకరాలను చదును చేసి, ప్లాట్లుగా విభజించే కార్యక్రమం మొదలు పెట్టారు. గ్రామస్తులు తామే ఇంటిని నిర్మించుకుంటామని చెప్పడంతో ఆ విధంగా పునరావాస ప్యాకేజీ అందిస్తున్నామని, రెండు గ్రామాల ప్రజలు దీనికి అంగీకరిస్తూ సంతకాలు చేసినట్లు రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
రూ.3,600 కోట్లతో పోర్టు అభివృద్ధి
సుమారు రూ.3,600 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు తొలి దశలో నాలుగు బెర్తుల నిర్మాణానికి సంబంధించి రూ.2,634 కోట్ల విలువైన పనుల కోసం అరబిందో నవయుగ గ్రూపు భాగస్వామ్య కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో ఒకటి కేవలం బొగ్గు దిగుమతికి సంబంధించిన కోల్ బెర్తు కాగా, మిగతా మూడు మల్టీమోడల్ బెర్తులు. ఇప్పటికే 850 ఎకరాల భూమిలోని చెరువులను పూడ్చి చదును చేయడంతో పాటు, పోర్టులో కీలకమైన బ్రేక్ వాటర్ పనులు చేపట్టారు. ఉత్తర, దక్షిణాలకు చెందిన బ్రేక్ వాటర్ పనులు అర కిలోమీటరు పైగానే పూర్తయ్యాయి. త్వరలో డ్రెడ్జింగ్‌తో పాటు, భవన నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టు ఆథారిత పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వం వలే శంకుస్థాపనలకు పరిమితం కాకుండా, రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టుకు ఆనుకొనే రూ.43,000 కోట్లతో ఇండోసోల్ భారీ సోలార్ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు కూడా ప్రారంభిస్తాం.
– గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలిషిప్
నిర్దేశిత లక్ష్యం కంటే ముందుగానే పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ నాటికి తొలి ఓడను రామాయపట్నం పోర్టుకు తీసుకొస్తాం. తొలి దశలో నాలుగు బెర్తులకు అదనంగా మరో క్యాపిటివ్ బెర్త్ నిర్మాణం కోసం చర్చలు జరుగుతున్నాయి. వర్షాకాలం ముగియడంతో పనుల్లో వేగం మరింత పెంచుతాం.
– ప్రతాప్ రెడ్డి, ఎండీ, రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్
గత ప్రభుత్వం సర్వే కూడా చేయలేదు
గత ప్రభుత్వం ఎన్నికల ముందు రామాయపట్నం పోర్టు పైలాన్ ఆవిష్కరించి వెళ్లిపోయింది. ఏ ఒక్క అనుమతి రాలేదు. సర్వే కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో సహా అన్ని తెచ్చి, భూ పరిహారం ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించింది. గత మూడు నెలలుగా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అనేక మంది స్థానికులకు ఉపాధి లభిస్తోంది. పోర్టు ప్రారంభమైన తర్వాత విద్యార్హతలను బట్టి 50 శాతం ఉద్యోగాలు స్థానిక గ్రామ ప్రజలకే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ బాగా ఇవ్వడం వల్లే గ్రామాన్ని ఖాళీ చేయడానికి అంగీకరించాం.
– కొల్లూరి సుధాకర్, స్థానిక రైతు, మొండివారిపాలెం
కొంచెం బాధ.. అంతకంటే ఎక్కువ సంతోషం
నాలుగు తరాలుగా ఇక్కడే ఉంటున్నా. గతంలో తుపాను సమయంలో ఇండ్లు కూలిపోతే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారు. అటువంటి గ్రామాన్ని ఖాళీ చేయాలంటే కొంచెం బాధగా ఉన్నప్పటికీ, ఈ పోర్టు వల్ల అందరం అభివృద్ధి చెందుతామని రెట్టింపు ఆనందంగా ఉన్నాం. చివరి రోజు గ్రామస్తులందరం రాములోరి సంబరం చేసుకొని కళశం తీసుకొని తెంటు గ్రామానికి వెళ్లిపోతాం.
– పోలయ్య, గ్రామపెద్ద, మొండివారిపాలెం
Comments
Please login to add a commentAdd a comment