‘పరిసరాల్లో’ అంటే ఎటు?
రాష్ట్ర రాజధానిపై వీడని ఉత్కంఠ
విజయవాడ పరిసరాల్లో అన్నారు కానీ..
నిర్దిష్టంగా ఫలానా చోటని ప్రకటించని సీఎం
గుంటూరు జిల్లాలో అయితే మంగళగిరి, అమరావతి.. కృష్ణాలో హనుమాన్ జంక్షన్, నూజివీడు, నందిగామ ప్రాంతాల్లో రాజధాని రావచ్చని టీడీపీ నేతల్లో చర్చ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని ప్రాంతంపై మూడు నెలలుగా సాగిన ఊహాగానాలు, సందిగ్ధతలకు సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తిస్థాయిలో తెరదించకపోగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల్లో మరింత ఉత్కంఠ రేపింది. దీన్ని అవకాశంగా తీసుకుని బెజవాడకు నలువైపుల ఉన్న రియల్టర్లు గురువారమే భూముల ధరలను లక్షల్లో పెంచేశారు. ‘రాజధాని ఇక్కడే’ అంటూ ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెప్పుకుంటూ ‘రియల్ బూమ్’ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎక్కడెక్కడ ఎంతెంత భూ ములు ఉన్నాయనే దానిపై టీడీపీ నేతల అంచనాలు వాదనలు ఇలా వున్నాయి...
తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో రిజర్వ్ ఫా రెస్ట్ భూములు 1,800 ఎకరాల వరకూ ఖాళీగా ఉన్నాయి. ఆరో ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చెం దిన 143 ఎకరాల్లో 43 ఎకరాలను డీజీపీ కార్యాలయానికి కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈ భూ ముల్లో సర్వే పూర్తయింది. తాడేపల్లి, కొలనుకొండ, ఉండవల్లి కొండల్లో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు మంగళగిరి రూరల్, తుళ్లూరు, తాడేపల్లి, అమరావతి మండలాల్లోని ప్రైవేటు భూములను సేకరించి అభివృద్ధి ప్రాతిపదికన 60:40 నిష్పత్తి ప్రకారం ఆయా రైతులకు నష్టం లేకుండా చూడాల్సి ఉంది. మంగ ళగిరి నుంచి తెనాలి వైపు పోతే అధిక మొత్తంలో వ్యవసాయ భూములను సేకరించాల్సి ఉంటుంది. వీజీటీఎం ఉడా పరిధిలో ప్రస్తుతం మొత్తం 1,200 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఇక నూజివీడు సమీపంలో దేవాదాయ శాఖ భూములు 3,600 ఎకరాలున్నాయి. నూజివీడు కు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే కాట్రేనిపాడులో 6,000 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటి తో పాటు నూజివీడు నుంచి బాపులపాడు, వీరులపాడు వైపు కూడా అటవీ భూములున్నా యి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లోనూ 600 ఎకరాల ఫా రెస్టు భూములున్నాయి. ఇక గన్నవరం, హనుమాన్ జంక్షన్‌ల ప్రాంతం ఐదో నంబరు జాతీ య రహదారి, ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఉంది. మేథ టవర్స్‌లో 24 ప్రభుత్వ కార్యాలయాలకు సౌలభ్యం ఉంది. వెటర్నరీ కళాశాలలోనూ 120 ఎకరాల భూములున్నాయి.
గుంటూరు జిల్లా అమరావతీ తెరమీదకు రావడంతో ఇక్కడున్న అటవీ భూముల విష యం బయటకు వచ్చింది. ఒకప్పుడు అమరావతి, దాని పక్కనే ఉన్న ధరణికోట ప్రాంతాలు భౌద్ధారామాలుగా విలసిల్లాయనీ, అప్పట్లో రాజ ధానిగా వెలుగువెలిగిన ధరణికోట ప్రాంతం శాస్త్రబద్ధంగా నూతన రాజధానికి అనుకూల మన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడకు 8 కి.మీ. దూరంలో ఉన్న నిడుముక్కల, మోతడకకొండ ప్రాం తాల్లో సుమారు 2వేల ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి.
అమరావతికి సమీపంలోని అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 6,000 ఎకరాల అటవీ, ప్రభుత్వ భూముల వివరాల నూ ప్రభుత్వం తెప్పించుకుంది. ఇక్కడ రాజ ధాని ఏర్పాటు చేయాలనుకుంటే కృష్ణా నదికి రెండు వైపులా గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దులను కలుపుతూ రివర్‌వ్యూ రాజధాని నిర్మించే యోచనకూడా సీఎంకు ఉందని టీడీపీ శాసనసభ్యులు చెప్తున్నారు. కృష్ణానది మీద ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కిలోమీటరు పొడవు బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతుందనే భావనా ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్లు ప్రచారంలో వుంది. నూతన రాజధానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న 20 టీఎంసీల నీటిని ఈ ప్రాం తంలో అయితే సులువుగా నిల్వచేసుకోవడంతో పాటు, అవసరమైన చోటుకు సులువుగా తరలిం చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇ క్కడి నుంచి 9వ నంబరు ఎన్‌హెచ్‌ని అనుసంధానం చేసే అవకాశాలూ మెండుగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వీజీటీఎం ఉడా పరిధిలోని విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి ప్రాంతాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాక నూతన రాజధాని నగరానికి మంగళగిరి ప్రాంతమే మంగళకరమని చంద్రబాబు సర్కారు విశ్వసిస్తోన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు.