రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్షంగా వ్యవహరించారని, కర్నూలు ప్రజల డిమాండ్‌ను పెడచెవిన పెట్టి మోసగించారని కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్షంగా వ్యవహరించారని, కర్నూలు ప్రజల డిమాండ్‌ను పెడచెవిన పెట్టి మోసగించారని కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు శాసనసభ్యులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
భూకంపాలు, వరదలకు అవకాశమున్న విజయవాడ రాజధానికి అనువైన ప్రాంతం కాదని సర్వేలు స్పష్టం చేసినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను కాదని విజయవాడను రాజధానిగా ప్రకటించడంలో అర్థం లేదన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాకు ఇచ్చిన హామీల్లో సగం కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదన్నారు. పదేళ్ల వైఎస్ పాలన అంటూ విమర్శలు గుప్పించడంతోనే సరిపెట్టారని.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలించింది ఐదేళ్లు మాత్రమేనన్న విషయం కూడా చంద్రబాబుకు తెలియకపోవడం శోచనీయమన్నారు. హంద్రీనీవాకు చంద్రబాబునాయుడు తన హయాంలో రూ.13 కోట్లు కేటాయిస్తే.. వైఎస్ రూ.3,398 కోట్లు కేటాయించారన్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు బాబు రూ.3కోట్లిస్తే.. వైఎస్‌ఆర్ రూ.148 కోట్లు కేటాయించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. బడ్జెట్‌లో గుండ్రేవుల ప్రాజెక్టు విషయమే ప్రస్తావించలేదన్నారు. నంద్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి బదులు విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామంటున్నారని, ఇప్పటికే అక్కడ విత్తనోత్పత్తి కేంద్రం అభివృద్ధి చెందిన విషయం తెలుసుకోవాలన్నారు.
ముస్లింలు అత్యధికంగా ఉన్న కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కడపకు తరలించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కడపవాసులు వ్యతిరేకించిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామనం సమంజసం కాదన్నారు. స్పీకర్‌గా ఎంపికైన వ్యక్తి పార్టీకి రాజీనామా చేస్తారని, ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రెడ్డి మాత్రం టీడీపీ నేతలానే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీకి రూ.5వేల కోట్లను కేటాయించడం, దాని అమలుపై స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు.
డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగుల భృతి ఊసే కరువైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగడుగునా అడ్డుపడ్డారన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటులో ఆంధ్ర ప్రాంతానికే అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. వైఎస్ హయాంలో యేటా రూ.కోటి చొప్పున ప్రతి ఎమ్మెల్యేకు ఏసీడీపీ నిధులు ఇచ్చారని.. ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినా పట్టించుకోలేదన్నారు. అమలుకాని హామీలతో కర్నూలు ప్రజలను చంద్రబాబు మోసగిస్తున్నారన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అసెంబ్లీ సమయమంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలను విమర్శించేందుకే సరిపోయిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ తరహాలోనే శివరామకృష్ణన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టి రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేయడం చంద్రబాబు నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు తన హామీలను ఏవిధంగా అమలు చేస్తారో స్పష్టం చేయాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసిన గుండ్రేవుల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కి అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయమై మాట్లాడే ప్రయత్నం చేస్తే మైకులు విరగ్గొట్టారనే ఆపవాదును అంటగట్టారన్నారు. అసెంబ్లీలో మైకులు, కుర్చీలు పట్టుకుంటే ఊడిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. కేవలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీకి పెట్టిన ఖర్చుతో ఓ జిల్లాను అభివృద్ధి చేయవచ్చన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటకృష్ణారెడ్డి, పి.జి.నరసింహులు యాదవ్, ఎస్సీ సెల్ నాయకులు కిషన్, మైనార్టీ నాయకులు సలీం, షరీఫ్, రాజధార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.