కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు అవ్వారు మల్లికార్జున,సంగటి మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
1956లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా విలీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించినప్పుడు రాయలసీమలో ఉన్న రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆ విధంగా రాయలసీమ వాసులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో గతంలో లాగానే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, అలా కాకుండా కృష్ణా,గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం సరికాదన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో భాగమైన రాయలసీమ వాసులతో కనీసం చర్చించకుండానే కోస్తా నాయకులు రాజధాని విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రాయలసీమలో పర్యటించపోవడం దారుణమని విమర్శించారు. వెనుకబడిన ‘సీమ’లోనే రాజధాని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంపా తిరుపతి, జేవీ రమణ, బండి ప్రసాద్, ఈ.బాలవీరప్ప, బి.దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
‘సీమ’లో రాజధాని ఏర్పాటు చేయాలి
Published Tue, Jun 3 2014 2:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement