కలల లైన్‌కు పచ్చజెండా | Dream line greenlight | Sakshi
Sakshi News home page

కలల లైన్‌కు పచ్చజెండా

Published Thu, Nov 20 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

కలల లైన్‌కు పచ్చజెండా

కలల లైన్‌కు పచ్చజెండా

  • కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించిన రైల్వే బోర్డు  
  • యాన్యుటీ పద్ధతిలో ఐదేళ్ల నష్టాలనూ భరించాల్సిందే
  • సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ నుంచి సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది.

    ఈ మేరకు కేంద్ర రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజుమ్ పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దాదాపు 149 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల కింద కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడి మేరకు రైల్వే శాఖ ఈ లైన్ సర్వేకు సమ్మతించగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఆయన ప్రయత్నం ఫలించి పనులు ప్రారంభించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 925 కోట్లు అవసరమవుతాయని తాజా అంచనా.
     
    మనోహరాబాద్ లైన్‌తో లింకు

    సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు ఈ రైల్వేలైన్ నిర్మించనున్నారు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రక్షణ శాఖ భూములుండటంతో... ఈ లైన్‌ను నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌తో అనుసంధానం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు మనోహరాబాద్ వద్ద అనుసంధానిస్తారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాటిన తరువాత మనోహరాబాద్ వస్తుంది. అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లికి ఈ రైల్వేలైన్ చేరుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నేరుగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది.
     
    మూడు షరతులకు ఓకే అన్నాకే..

    ఈ ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అంత సులభంగా అంగీకరించలేదు. నష్టాలను బూచిగా చూపి షరతుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. వాటి ప్రకారం.. నిర్మాణ వ్యయంలో మూడోవంతు (33 శాతం) భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత లెక్కన దాదాపు రూ. 308 కోట్లను రాష్ట్రం భరించాలి. ఇక భూసేకరణ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనికితోడు ఐదేళ్లదాకా ఏవైనా నష్టాలు వస్తే.. వాటిని రాష్ట్రప్రభుత్వమే భరించాలనే (యాన్యుటీ విధానం) షరతు కూడా ఉంది. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో... రైల్వే లైన్‌కు ఆమోదం వచ్చింది.
     
    కేసీఆర్ ప్రతిపాదన ఇదీ...

    ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు ఇదని, 2004లో ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ప్రతిపాదన చేశారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రాంచంద్రు, ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం వెల్లడించారు. 2006-07 బడ్జెట్‌లోనే సర్వేకోసం దీన్ని పొందుపరిచారని, దక్షిణ మధ్య రైల్వే సమగ్ర అంచనా నివేదికను తయారు చేసి రైల్వే బోర్డుకు ఇచ్చిందని వారు చెప్పారు. ‘‘సాధారణంగా రేట్ ఆఫ్ రిటర్న్ (ఆర్‌ఓఆర్) 14 శాతం ఉంటే గానీ కొత్త రైల్వేలైన్ మంజూరు చేయరు. ఈ లైన్ ఆర్‌ఓఆర్ 2.64 శాతం మాత్రమే ఉండడంతో.. కేంద్రం పలు షరతులు పెట్టింది. టీఆర్‌ఎస్ 2006లో యూపీఏ నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. మేం ముగ్గురం తరచుగా రైల్వే బోర్డు అధికారులను కలసి ఒత్తిడి తెచ్చాం. దాంతో పాటు షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వెనకబడిన ప్రాంతంలో కొత్త రైల్వే లైను రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైలు మార్గం ద్వారా భవిష్యత్‌లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఢిల్లీకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశముంది.’’ అని వారు పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement