‘బీ-ట్రాక్’..ప్రమాదాలకు చెక్! | 'Bee-track' check .. accidents! | Sakshi
Sakshi News home page

‘బీ-ట్రాక్’..ప్రమాదాలకు చెక్!

Published Wed, Oct 15 2014 1:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

‘బీ-ట్రాక్’..ప్రమాదాలకు చెక్! - Sakshi

‘బీ-ట్రాక్’..ప్రమాదాలకు చెక్!

  • బెంగళూరు ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం
  •  2006లోనే రూ.350 కోట్లతో శ్రీకారం
  •  ఏటా తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు
  • సాక్షి,హైదరాబాద్: ఉద్యాననగరిగా పేరొం దిన బెంగళూరు మహానగరం ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యేది. ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలు తగ్గించే పని ట్రాఫిక్ పోలీసులది. అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ సమస్య పరిష్కారానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ (బీ-ట్రాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2006-07లో దీనిని అమలులోకి తెచ్చింది. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. బెంగళూరు నగరానికి..హైదరాబాద్ నగరానికి ఎన్నో సారూపత్యలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ‘బీ-ట్రాక్’ పథకం అమలే పరిష్కార మార్గం.
     
    ఎన్నో సారూప్యతలు...

    కర్ణాటక రాజధాని బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ కూడా ఎంతో పాత నగరం. దీంతో అనేక రహదారులు చిన్నవిగా, బాటిల్‌నెక్స్‌తో నిండి ఉంటాయి. వినియోగంలో ఉన్న వాహనాల్లో అత్యధిక శాతం ద్విచక్ర వాహనాలే. పీక్ అవర్స్‌లో రోడ్లపై అడుగుపెట్టాలంటే నరకమే. వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉండవు. ఇక్కడ మాదిరిగానే సాఫ్ట్‌వేర్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతూనే ఉండేది. ఈ కారణాల నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ నరకాన్ని చవిచూడటంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు. క్షతగాత్రులు, మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటేది. చిన్న చిన్న మౌలికవసతుల కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు జీహెచ్‌ఎంసీ మీద ఆధారపడినట్లే అక్కడి అధికారులు బీఎంసీ అనుమతికి ఎదురుచూడాల్సి వచ్చేది.
     
    ‘బీ-ట్రాక్’తో మారిన పరిస్థితులు

    బీఎంసీ నుంచి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిందే బీ-ట్రాక్ పథకం. సాధారణ మౌలికవసతుల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనల ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలు. 2006-07లో రూ.350 కోట్లు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం నాలుగేళ్లల్లో ఈ నిధులను వినియోగించుకోవాలని నిబంధన పెట్టింది. అక్కడి ట్రాఫిక్ పోలీసుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కాలపరిమితిని ఎత్తివేసింది. ఏటా ట్రాఫిక్ పోలీసులు సమర్పించే యాక్షన్ ప్లాన్ ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. 2013-14 నాటికి రూ.139 కోట్లు కేటాయించింది.
     
    పరిజ్ఞానం, మౌలికవసతులకు వినియోగం...


    బీ-ట్రాక్ నిధులను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు మౌలికవసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కోసం 179 ప్రాంతాల్లో సర్వైలెన్స్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చే ఫీడ్‌ను అధ్యయనం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాంతాల వారీగా ఏరియా ట్రాఫిక్ సెంటర్లతో పాటు ఇన్‌ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ హెడ్-క్వార్టర్స్‌లో భారీ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను (టీఎంసీ) ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉల్లంఘనులకు కౌన్సెలింగ్  కోసం అత్యాధునిక వసతులతో ట్రాఫిక్ ట్రైనింగ్ అండ్ రోడ్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు.
     
    ఏడేళ్లల్లో సమకూరినవి..


    బీ-ట్రాక్ నిధుల్ని వినియోగించి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏడేళ్లల్లో సమకూర్చుకున్నవి, అభివృద్ధి చేసిన జాబితా ఇది.
     
     179 సర్వైలెన్స్, 5 ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు, 9 ఇంటర్‌సెప్ట్ వాహనాలు .
     
     నగరంలోని 340 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఉన్నవాటిని అప్-గ్రేడ్ చేయడం.
     
     బెంగళూరులోని 625 ప్రాంతాల్లో వార్నింగ్ సిగ్నల్స్, 49 చోట్ల పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు.
     
     క్షేత్రస్థాయిలో ఉల్లంఘనుల్ని నమోదు చేయడానికి సిబ్బందికి ప్రింటర్‌తో కనెక్టివిటీ ఉన్న 650 బ్లాక్‌బెర్రీ ఫోన్లు.
     
     కీలక, అవసరమైన ప్రాంతాల్లో 30 వేల రోడ్ సైనేజస్, వెయ్యి ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటు.
     
     85 జంక్షన్లను సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేయడంతో పాటు రెండు లక్షల చదరపు మీటర్ల రోడ్ మార్కింగ్స్.
     
     మద్యం తాగి వాహనం నడిపే వారిని పట్టుకోవడం కోసం 125 బ్రీత్ అనలైజర్ల సమీకరణ.
     
     భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణ. వాణిజ్య సముదాయాలు చిన్న వర్టికల్ పార్కింగ్ ఏర్పాటు.
     
     రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే
     బెంగళూరులో అమలవుతున్న బీ-ట్రాక్ పథకం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతోనే జరుగుతోంది. ఇలాంటి స్కీమ్‌లను ఇతర నగరాల్లో అమలు చేయాలంటే రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ట్రాఫిక్ పోలీసు లు ఏటా వసూలు చేసి ఇస్తున్న నిధుల్లో కొంత మొత్తం తిరిగి వారికే కేటాయిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ వల్ల బెంగళూరులో రోడ్డు ప్రమాదాలతో పాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.                                  
     -  బి.సదానంద, ట్రాఫిక్ చీఫ్, బెంగళూరు
     
     ప్రమాదాలు తగ్గాయి
     బెంగళూరులో ఒకప్పుడు రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ పక్కాగా లేక జరిమానాల విధింపు, వసూళ్లు తక్కువగా ఉండేవి. ‘బీ-ట్రాక్’తో సమకూరిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నాం. తద్వారా వసూలైన జరిమానాలు పెరగడమే కాదు... ప్రమాదాలు సంఖ్య  తగ్గుతూ వచ్చింది.
      - వసంత్, టీఎంసీ సబ్-ఇన్‌స్పెక్టర్, బెంగళూరు ట్రాఫిక్.
     
     ప్రమాదాలు తగ్గడమే సక్సెస్

     బెంగళూరులో ‘బీ-ట్రాక్’ నిధులతో రూపొందించిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఏర్పాటుతో చలాన్ల వసూలు భారీ స్థాయిలో పెరిగింది. అయితే ఇది సక్సెస్‌కు ఏమాత్రం సూచిక కాదు. కేవలం ప్రమాదాల సంఖ్య తగ్గడాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. ఆ కోణంలోనే ముందుకు వెళ్లాల్సిందిగా స్పష్టం చేస్తున్నాం
     -  ప్రవీణ్ సూద్, హోం శాఖ కార్యదర్శి, కర్ణాటక.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement