ఊహల రాజధానిలో ‘రియల్’ రెక్కలు! | Assumptions, the capital of the 'real' wings! | Sakshi
Sakshi News home page

ఊహల రాజధానిలో ‘రియల్’ రెక్కలు!

Published Sat, Jun 14 2014 1:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఊహల రాజధానిలో ‘రియల్’ రెక్కలు! - Sakshi

ఊహల రాజధానిలో ‘రియల్’ రెక్కలు!

  • పుట్టుకొస్తున్న అక్రమ లే అవుట్లు
  •  కృష్ణా పరీవాహక ప్రాంతంపై కన్ను
  •  రెట్టింపయిన ధరలు
  • పెడన/ నందిగామ :  రాష్ట్ర రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేయనున్నారనే ఊహల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లోనున్న భూముల ధరలకు సైతం  రెక్కలొస్తున్నాయి.  నిన్నమొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ప్రకటనల మూలంగా ఒక్కసారిగా ఊపందుకుంది. కమిషన్ ఏజెంట్లు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల రేట్లను ఒక్కసారిగా చుక్కల్లో చూపుతున్నారు.

    గతంలో  సెంటు రూ.లక్ష కూడా ఉండకపోగా నేడది ఒక్కసారిగా రూ.6,7 లక్షలు చెబుతున్నారు. ఎకరా రూ.50 లక్షల విలువ చేయని వ్యవసాయ భూమి నేడు రెండు కోట్ల రూపాయల పైనే  చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ కొనకుండా పడిఉన్న వెంచర్లలో  పిచ్చి కంపచెట్లు తొలగించి అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు.  

    రైతులు   ఒక రోజు చెప్పిన ధర మరో రోజు చెప్పకుండా రోజురోజుకు తమ భూముల రేట్లను రూ.లక్షల్లో నుంచి రూ.కోట్లలోకి  పెంచుకుంటూపోతున్నారు. కొంతమంది రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.అక్రమాలను అరికట్టాల్సిన అధికార యంత్రాగం  నిద్ర నటిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై  ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
     
    పెడనలో అక్రమ లేఅవుట్లు...
     
    పెడన-గుడివాడ, మచిలీపట్నం-పెడన, పెడన- బంటుమిల్లి రోడ్డుల్లో అక్రమ లే అవుట్లు రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్నాయి.   పెడన పట్టణంలో జగపతి థియేటర్, చోడుదిక్కులు, బైపాస్ రోడ్డు, 216 జాతీయ రహదారి, బ్రహ్మాపురం, గుడివాడ రోడ్డుకు వెళ్లే బైపాస్ రోడ్డు, బంటుమిల్లి రోడ్డు, తోటమూల ఏరియా, చూజీ వెనుక, బుద్ధాలపాలెం రోడ్డు , డంఫింగ్ యార్డు సమీపంలో  వందకు పైగా అక్రమ లేఅవుట్లు  వెలసినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో   వ్యవసాయ భూముల నుంచి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ప్లాట్లు వేసి అమ్మకాలు చేసినవే అధికంగా ఉన్నాయని తెలుస్తుంది.  
     
    గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు...
     
    అక్రమ లేఅవుట్ల ద్వారా  మునిసిపాలిటీకి చెల్లించాల్సిన ఆదాయం రూ.3.22 కోట్లవరకు గండి పడినట్లు మున్సిపల్ అధికారులు  విజిలెన్స్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జగదీశ్వరరెడ్డికి గతంలో  నివేదించారు. ఈ నివేదికపై  విజిలెన్స్ ఎన్స్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు చేసి పెడన మున్సిపాల్టీలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నివేదికల  ఆధారంగా రియల్టర్లకు ఎలాంటి జరిమానా వేసిన ధాఖలాలు లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.  రియల్టర్లుకు పాలకులు  పూర్తీసహాయ సహకారాలు అందించడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది.
     
    కృష్ణానది పరీవాహక ప్రాంత పొలాలకు మంచి డిమాండ్...
     
    నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉండటంతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారు నదీ తీర ప్రాంతంలో భూములు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే చందర్లపాడు, నందిగామ, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలాల్లో నదీ తీరంలో 20కి పైగా కెమికల్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు ప్రారంభం కానున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒకరు కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో రెండు పరిశ్రమల నిర్మాణం ప్రారంభించారు.

    ఇప్పటికే వందలాది ఎకరాలు కారుచౌకగా కొనుగోలు చేశారు. ఆ క్రమంలోనే కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు స్థల సేకరణకు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. పరిశ్రమలోని వ్యర్థాలను కృష్ణానదిలో వదిలేందుకు అనువుగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ‘రాాజధాని’ ఎర చూపి రియల్ మాఫియా ఇష్టారాజ్యం వ్యవహరిస్తుందనే విమర్శలొస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement