ఇప్పుడు చూపు..అమరావతి వైపు
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై రోజుకో పుకారు షికారు చేస్తుండడంతో భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొత్త రాజధాని గుంటూరు- విజయవాడ మధ్య ఏర్పాటు కానుందనే ప్రచారం నేపథ్యంలో పెదకాకాని, వెనిగండ్ల, నంబూరు, కాజ, మంగళగిరి ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెకైగసి తిరిగి కిందకు పడిపోయాయి. తాజాగా, కొత్త రాజధాని ఏర్పాటుకు అమరావతి ప్రాంతం అనుకూలమని వెలువడిన సమాచారంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు మొలిచాయి. భూములపై పెట్టుబడి పెట్టాలనే ఉత్సాహవంతుల రాకపోకలతో అమరావతి ప్రాంతం సందడిగా మారింది.
అమరావతి: అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న పుకార్లతో రూ. లక్షల్లో ఉన్న భూముల ధరలు నేడు రూ.కోట్లు పలుకుతున్నాయి. మండల పరిధిలో భూముల కొనుగోలుకు నిత్యం వందలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు, రాజకీయనాయకులు ఎర్రని ఎండను సై తం లెక్కచేయకుండా పొలాలగట్ల వెంట తిరుగుతున్నారు.
= నిన్న మొన్నటి వరకు మండల కేంద్రమైన అమరావతిలో గజం రెండు వేలు పలికితే గొప్పగా ఉంటే నేడు 10 నుంచి 12 వేల రూపాయల వరకు చెపుతున్నారు. దీంతో ఎకరం భూమి విలువ రూ. కోట్లకు చేరింది.
= అమరావతిలో విజయవాడ రోడ్డు, గుంటూరు రోడ్డులో భూముల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండగా, సత్తెనపల్లి రోడ్డులో అడపాదడపా అమ్మకాలు సాగుతున్నాయి.
= నిన్నటి వరకు విజయవాడ, గుంటూరు రోడ్డులో ఎకరం 20 నుంచి 30 లక్షల రూపాయల ధర పలికితే నేడు కోటి నుంచి రెండు కోట్ల రూపాయలకు కూడా కొనుగోలు చేయటానికి వెనుకాడటం లేదని చెపుతున్నారు.
= రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూసి యజమానులు భూమిని అమ్మాలా వద్దా అని అయోమయానికి గురవుతున్నారు.
= {పస్తుతం కోట్లతో కొనుగోలు చేసిన భూములకు అడ్వాన్స్‌లిచ్చి అగ్రిమెంట్‌లు రాసుకోవటంతో తప్ప రిజిస్ట్రేషన్‌లు జరిగిన దాఖలాలు లేవు.
= మండల పరిధి గ్రామాల్లో కూడా రోడ్డు పక్క భూములు 30 నుంచి 50 లక్షలు, లోపల భూములు 10 లక్షల రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి.
= ఇక వాగుల పరివాహక ప్రాంతంలో వర్షాకాలంలో నీట మునిగే భూములను ఎకరా 30 నుంచి 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు.
అమరావతి కేంద్రంగా రాజధాని ?
అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తున్నారని, కృష్ణానదిపై పలు చోట్ల బ్రిడ్జిల నిర్మాణం జరగనుందంటూ ఈ ప్రాంతంలో గత వారం రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు మిగులు భూములు వున్నట్టు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం ఈ పుకార్లుకు బలం చేకూరుస్తుంది.
= పక్కనే ఉన్న అచ్చంపేట మండలంలో కూడా అటవీ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు ఉండటంతో రాజధాని ఏర్పాటుకు అనుకూలమని ఎవరికి వారే ఊహించుకుంటూ భూముల ధరలు పెంచేస్తున్నారు.
= ఇదిలావుంటే, మూడు నెలలుగా రెవెన్యూ కార్యాలయంలో అడంగుల్ తప్ప పట్టాదారుపాస్ పుస్తకాలు ఇవ్వటం లేదు. ఒక్కసారిగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి పోవటంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా పాస్ పుస్తకాలు లేకుండానే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నట్లు సమాచారం.
నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు
మా కార్యాలయంలో ఇంతవరకు రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండా పొలాలకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్‌లు చేయలేదు. అలాంటి వాటిని తిప్పి పంపుతున్నాం. అన్నీ నిబంధనల ప్రకారమే జరుపుతున్నాం.
- సిహెచ్ బుజ్జిబాబు, అమరావతి సబ్ రిజిస్ట్రార్