ఈవైపు చూడరే..
►రాజధాని కమిటీ పరిశీలనే చేయలేదు
►ఒక్క జాతీయ సంస్థకూ నోచుకోలేదు
►దొనకొండ ప్రతిపాదన బుట్టదాఖలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి రావడంతో ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట రాజధాని గుర్తింపు, అభివృద్ధి ప్రతిపాదనల దశలోనే
ప్రకాశం జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అన్ని అవకాశాలు ఉన్న దొనకొండ ప్రాంతాన్ని కనీసం రాష్ట్ర రాజధాని కోసం వేసిన శివరామకృష్ణ కమిటీ పరిశీలించకపోవడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు హామీలిస్తున్నప్పటికీ అవి అమలులోకి తేవడంలో వైఫల్యం చెందుతున్నారు.
- రాజధాని ఎక్కడన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు బిల్లులో పేర్కొన్నట్లు రాష్ట్రానికి ఇచ్చిన 11 జాతీయ సంస్థలు ఎక్కడెక్కడ అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం కమిటీకి వివరించింది. ఆ 11 సంస్థల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లాకు కేటాయించకపోవడం దారుణమని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ, కాకినాడలో పెట్రోలియం యూనివర్శిటీ, విశాఖపట్నంలో ఐఐఎం, గుంటూరులో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీ, అనంతపురం - కర్నూలు మధ్య ఐఐఐటీ, కర్నూలులో ఎన్‌ఐటీ, విజయవాడలో సెంట్రల్ యూనివర్శిటీ, పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి స్పష్టం చేసింది. ఇందులో ప్రకాశం జిల్లాకు చోటు దక్కలేదు.
- ఒంగోలు జాతి పశువులకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో కనీసం వెటర్నటీ యూనివర్శిటీ అయినా కేటాయిస్తారని చూసిన ఈ ప్రాంత వాసులకు నిరాశే మిగిలింది.
- కృష్ణా - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని చెప్పిన కమిటీ భూసేకరణ ఎలా చేస్తారో వివరించలేదు. కనీసం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎన్ని అందుబాటులో ఉన్నాయి. ఎంత భూమిని ప్రైవేటు వ్యక్తులు, రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
- ప్రకాశం జిల్లాలోని దొనకొండ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 54 వేల 483 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు లెక్కలు తీశారు. ఇందులో 34 వేల ఎకరాలు యధాతథంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 వేల ఎకరాలు అటవీ భూమి. దీన్ని డీ-నోటిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ పురాతన విమానాశ్రయంతో పాటు అతి సమీపంలో జాతీయ రహదారి ఉంది. అయినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా... పదేపదే గుంటూరు, విజయవాడ అంటూ ప్రచారం చేయడంలో ఆంతర్యమేంటనే అనుమానం కలుగుతోంది.
- ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే. దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
- ఈ ప్రాంతం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో ఉన్నా ఆయన స్పందించలేదు. ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఒంగోలు - నెల్లూరు మధ్య విమానాశ్రయం, జాతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని జిల్లా మంత్రి ప్రకటిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.