Petroleum University
-
డిజిటల్లో అగ్రగామిగా భారత్
గాంధీనగర్: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ‘డిజిటల్ రంగం ప్రతీ రోజు, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది భారత్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్ కేవలం 24 నెలల్లోనే నంబర్ వన్ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. -
రాజస్థాన్‌లో పెట్రోలియం వర్సిటీ
జైపూర్ : రాజస్థాన్‌లో త్వరలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదేవిధంగా జోధ్‌పూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పెట్రోలియం ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లమో కోర్సును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌గార్గ్ శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్‌తోపాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆటోమొబైల్ డిజైన్ కోర్సు సిలబస్‌ను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జిల్లాస్థాయిలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. అందులో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కోటాలోని రాజస్థాన్ టెక్నికల్ విశ్వవిద్యాలయంలో 2017–18 విద్యాసంవత్సరం నుంచి చాయిస్ బేస్డ్ క్రెడిట్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. వివిధ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందువల్ల స్వల్పకాలంలోనే 13 స్టార్టప్‌లు రాష్ట్రంలో మొదలయ్యాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృషిలో పెట్టుకుని ఈ యూనివర్సిటీ అనేక శిక్షణా శిబిరాలను నిర్వహించిందని తెలిపారు. 2018–19 విద్యాసంవత్సరానికి గాను ఈ విశ్వవిద్యాలయానికి రూ. కోటి మేర నిధులు మంజూరు చేశామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం విద్యావిభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని గార్గ్ చెప్పారు. -
సీఆర్డీఏకు ఉచితంగా 3,838.86 ఎకరాలు
సాక్షి, అమరావతి : సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)కు రాజధానిలో ఉచితంగా 3,838.86 ఎకరాలను అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని రాజధాని నగర పరిధిలోని ఈ భూమిని సీఆర్డీఏకు ఉచితంగా ఇవ్వాలని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదన రాగా.. దానికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం శాఖమూరు, ఐనవోలు, నేలపాడు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఏడబుŠల్య్‌డీ పోరంబోకు భూమిని సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించనున్నారు. రాజధాని అవసరాల కోసం ఈ భూమిని వినియోగించే అవకాశం ఉంది. కచ్చితంగా ఈ భూమిని ఎందుకు ఉపయోగిస్తారనే విషయం తెలియరాలేదు. దీంతోపాటు మరికొన్ని భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది... ► కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కి లీజు ప్రాతిపదికపై కేటాయించిన ఐదెకరాల భూమికి స్టాంప్ డ్యూటీ మినహాయింపునిస్తూ నిర్ణయం. ► నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, వింజమూరు, అన్నసముద్రంపేట, దగదర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో 664.61 ఎకరాల్ని నడికుడి–శ్రీకాళహస్తి కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణానికి ఉచితంగా రైల్వేశాఖకు ముందస్తుగా ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ► చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె పరిధిలో 38.85 ఎకరాలు, ఎర్రచెర్లోపల్లిలో 22.13 ఎకరాలు, తలుపులపల్లెలో 15.72 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీకి షరతులతో ఇచ్చేందుకు అనుమతి. జీడీ నెల్లూరు మండలం జీడీ నెల్లూరులో 21.62 ఎకరాలను ఎంఎస్ఎంఈ పార్కు స్థాపన కోసం ఉచితంగా కేటాయించేందుకు అనుమతి. ► గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో కంపోస్టు ఎరువు యార్డు ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగానికి 51.24 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు ఆమోదం. చిలకలూరిపేటలో ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కోసం ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు. ► విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి లో పెట్రోలియం వర్సిటీ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి 201.80 ఎకరాల్ని ఉచితంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి బదలాయింపునకు ఓకే. అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటపల్లిలో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం కోసం 160.36 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు అప్పగించేందుకు అనుమతి. ► కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థను నెలకొల్పేందుకు 21.97 ఎకరాల్ని ఏపీఐఐసీకి ముందస్తు బదలాయింపునకు అనుమతి. -
'యనమల ఒక చవట.. దద్దమ్మ'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యనమల ఒక చవట.. దద్దమ్మ' అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. యనమల వల్లే పెట్రోలియం యూనివర్సిటీ వైజాగ్ తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుకపైనే ఆసక్తి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లు ప్రజా ప్రతినిధులా? ఇసుక వ్యాపారులా? అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. -
పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన
పిఠాపురం: పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు కోసం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రూరల్ మండలం మాధాపురంలోని కాసు చెరువు భూములను అధికారులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో అంబేద్కర్ సిబ్బందితో కలసి మంగళవారం మధ్యాహ్నం మాధాపురం చేరుకుని కాసు చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ 215 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా తదితర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కాకినాడ సమీపంలోని వేట్లపాలెంలో జరిగిన సభలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. -
మగతనిద్రలో..మన నేతలు
సొంతానికి కలిసి వస్తుందంటే చాలు కలసికట్టుగా పట్టుబిగిస్తారు. పైసా ప్రయోజనం లేదంటే దరిదాపుల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయరు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ ముఖ్యనేతల తీరు. రాక, రాక జిల్లాకు వచ్చిన పెట్రో వర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయే పరిస్థితి తరుముకు వస్తున్నా వారికి పట్టింపు లేదు. జిల్లా ప్రగతికి దోహదపడే ఈ జ్ఞాననిలయం పట్ల నేతల నిర్లక్ష్యాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఇకనైనా..వచ్చిన అవకాశం చేజారిపోకుండా నడుం బిగించాలని కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :అపార చమురు, సహజవాయువు నిక్షేపాలున్న ప్రాంతంగా జిల్లాకు ప్రపంచ చమురు పటంలో ప్రత్యేక స్థానం ఉంది. ఓఎన్జీసీ, రిలయన్స్, జీఎస్పీసీ తదితర చమురు సంస్థల కార్యకలాపాలకు కృష్ణా, గోదావరి బేసిన్లోనే కీలక కేంద్రంగా ఉంది. అటువంటి జిల్లాలో పెట్రోలియం యూని వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర విభజన అనంతరం కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చమురు, సహజయవాయువు నిల్వలున్న జిల్లాలో పెట్రో ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు సర్కార్ పదేపదే చెబుతూ వస్తోంది. పెట్రో కారిడార్, కాకినాడ ఎస్ఈజడ్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ప్రతిపాదిత పరిశ్రమలు కూడా పెట్రో ఆధారితమైనవే. ఆ క్రమంలోనే కాకినాడ తీరంలో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు కూడా ఇటీవలనే ఆమోదం కూడా లభించింది. ఇన్ని సానుకూలతలున్న జిల్లాలో ఏర్పాటు కావాల్సిన పెట్రో యూనివర్సిటీ పొరుగు జిల్లా విశాఖకు తరలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ పెట్రో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఓపీ గుప్తా ఆధ్వర్యంలో కేంద్రం నియమించిన కమిటీ వర్సిటీ ఏర్పాటుకు రాజానగరం, మండపేట, కాకినాడ తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించింది. దివాన్‌చెరువు సమీపాన వేపాలదిబ్బలు, రిజర్వుఫారెస్టు తదితర ప్రాంతాలను బృందం పరిశీలించింది. వీటిపై కమిటీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కేంద్ర కమిటీ తుది పరిశీలన జరిపిన మండపేట రూరల్ ద్వారపూడికి సమీప ప్రాంతం సానుకూలంగా లేదంటూ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. కేవలం భూములు సానుకూలంగా లేవనే కారణంతో పెట్రో వర్సిటీ మళ్లిపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదని మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాకినాడ సెజ్, ఎల్ఎన్జీ టెర్మినల్, మధురపూడి విమానాశ్రయం...ఇలా పలు కలిసివచ్చే ప్రాజెక్టుల భూ సేకరణకైతే ముందుకు వచ్చే అధికారపార్టీ నేతలు ప్రతిష్టాత్మక పెట్రో వర్సిటీ భూ సేకరణ వైపు కన్నెత్తిచూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీకి 50 నుంచి 80 ఎకరాలు సరిపోతుం దని అంచనా. ప్రాజెక్టుల భూ సేకరణలో చొరవ తీసుకుంటే కలిగే ప్రయోజనం వర్సిటీ వల్ల ఉండదనే ఉద్దేశంతోనే నిమ్మకు నీరెత్తినట్టు, మగత నిద్రలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడుంటేనే అన్నిందాలా మేలు.. సహజవాయువు, చమురు నిక్షేపాలు ఇక్కడ ఉండి, పెట్రో వర్సిటీ మరొక జిల్లాలో ఉండటం ప్రయోజనకరం కాదని ఆ రంగంపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న వారు అభిప్రాయపడుతున్నారు. సహజ నిక్షేపాలు అపారంగా ఉన్న ఈ ప్రాంతంలో పెట్రో వర్సిటీ ఏర్పాటైతే పరిశోధన లకు, సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు, వర్సిటీలో జిల్లావాసులు చదువుకునే అవకాశంతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న వర్సిటీ ఏర్పాటులో ఎదురయ్యే ప్రతిబంధకాలను విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు సానుకూలంగా మలుచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నెల 4న కేంద్ర కమిటీని ఆ జిల్లాకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో అక్కడి నేతలున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి జిల్లా నేతలు తమ వంతు ప్రయత్నం చేయాలని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్దండులంతా కలిసి అడ్డుకోలేరా..? ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన ముఖ్యనేతలు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సర్కార్‌లో నంబర్-2గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వీరిద్దరు కాక అధికారపార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సీఎం చంద్రబాబుతో సాన్నిహిత్యం కలిగిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, కేంద్రస్థాయిలో పదవులపై పదవులు వరిస్తున్న కాకినాడ ఎంపీ తోట నరసింహం, సహజవాయువు నిక్షేపాలున్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వంటి వారు పెట్రో వర్సిటీ తరలిపోకుండా అడ్డుకోలేరా అని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ వద్ద వాకలపూడి, వలసపాక ల, రాజానగరం-కాకినాడపోర్టు రోడ్డు, కాకినాడ-యానాం జాతీయరహదారికి ఇరువైపులా వందలా ది ఎకరాలున్నాయి. వాటిలో వర్సిటీ ప్రతిపాదిం చేలా చిత్తశుద్ధి తో కూడిన ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నా రు. కేంద్ర కమిటీ పెదవి విరిచినా.. కలెక్టర్ అరుణ్‌కుమార్ పట్టువిడవకుండా జిల్లాలో అన్ని మండలాల త హశీల్దార్లను పెట్రోవర్సిటీకి అనువైన భూముల వివరా లు 20 రోజుల్లో పంపాలని కోరారు. జాయింట్ క లెక్టర్ సత్యనారాయణ అదే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకునివర్సిటీ తరలిపోకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధుల వైఫల్యమే.. జిల్లాలో పెట్రో యూనివర్సిటీ విషయంలో జరుగుతున్న అన్యాయానికి ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణం. పెట్రో వర్సిటీని చమురు కార్యకలాపాల వల్ల బ్లో అవుట్లు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతు కోనసీమలో ఏర్పాటు చేయాలి. - కుడుపూడి సూర్యనారాయణరావు, ఓఎన్జీసీ పోరాట సమితి కన్వీనర్, అమలాపురం చంద్రబాబు కృషి చేయాలి.. నవ్యాంధ్రలో ఏర్పాటు చేసే యూనివర్సిటీలను వికేంద్రీకరిస్తామంటున్న చంద్రబాబు కోనసీమలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలి. రాజమండ్రిలో నన్నయ్య, కాకినాడలో జేఎన్టీయూకే ఉన్నందున కోనసీమలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. - డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, ఎస్కేబీఆర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్, అమలాపురం తరలింపు యోచన విరమించాలి.. జిల్లాకు కేటాయించిన పెట్రో వర్సిటీ తరలింపును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీని మరో జిల్లాకు తరలించే ఆలోచన మానుకోవాలి. వర్సిటీకి అనువైన స్థలాలు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. -పెద్దిరెడ్డి రవికిరణ్, బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ ఇక్కడ ఏర్పాటైతే ఎంతో మేలు.. పెట్రో యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైతే ఎంతో మేలు కలుగుతుంది. సహజవనరులు అధికంగా ఉన్న ప్రాంతంలో యూనివర్సిటీ ఉంటేనే మేలు జరుగుతుంది. - ఇ.ధనుంజయరావు, ఆదికవి నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్ -
పెట్రోవర్సిటీ వేదిక ద్వారపూడే!
మండపేట : ద్వారపూడిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 87 ఎకరాల సేకరణకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. నీటి వసతి, రోడ్డు, రైలు మార్గాలు, ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఉండటంతో ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు ఉన్నతస్థాయి నుంచి సానుకూలత లభించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కేంద్ర ప్రభుత్వ కమిటీ భూములను పరిశీలించి తదుపరి కార్యాచరణ చేయనున్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి. పెట్రో యూనివర్సిటీ, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణానికి మొత్తం 87 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. అందుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే జిల్లాలోని రాజానగరం, కాకినాడ, తాళ్లరేవు ప్రాంతాల్లో అధికారులు పరిశీలన చేశారు. ఆయా చోట్ల అవసరమైన మేరకు భూములు లేకపోవడం, యూనివర్సిటీ వలన తమ ప్రాంత అభివృద్ధికి, ఉపాధికి అవకాశాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో అక్కడి ప్రజాప్రతినిధులు విముఖత చూపడంతో ద్వారపూడి వైపు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి, కేశవరం గ్రామాల పరిధిలో సుమారు 300 ఎకరాల అసైన్డ్భూములుండగా, మరో 200 ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయి. స్థానికులకు అప్పగించిన అసైన్డ్ భూములు చాలాచోట్ల అన్యాక్రాంతమై గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో వేములపల్లిలో సుమారు వంద ఎకరాలు, కేశవరంలో సుమారు 47 ఎకరాల అసైన్డ్ భూములను గతంలోనే రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంది. స్థానికంగా వ్యతిరేకత ఏమీ లేకపోవడంతో ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. జడ్.మేడపాడు - రాజానగరం రోడ్డులో వైఎస్సార్ నగర్‌కు పక్కనే ఉన్న 87 ఎకరాలు అనువైనవిగా భావిస్తున్నారు. ద్వారపూడిలో రైల్వే స్టేషన్, సుమారు 20 కిలోమీటర్ల దూరంలో 16వ నంబరు జాతీయ రహదారి, 40 కిలోమీటర్ల దూరంలో మధురపూడి ఎయిర్‌పోర్టు ఉండటంతో ఈ ప్రాంతం రవాణాకు అనుకూలమైనదిగా అధికారులు భావిస్తున్నారు. సేకరించాలని ప్రతిపాదించిన భూముల పక్కనే సుమారు 60 ఎకరాల్లో పంగిడి చెరువు ఉండటంతో నీటి వసతికి సమస్య ఉండదంటున్నారు. ఇటీవల ఈ భూములను పరిశీలించిన కలెక్టర్ నీతూప్రసాద్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైనదిగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సంక్రాంతి తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ భూములను పరిశీలించి తదుపరి కార్యాచరణకు ఉపక్రమించనున్నట్టు సమాచారం. కేశవరంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్.. కేశవరంలోని కోకా కోలా కంపెనీ సమీపంలో గల 47 ఎకరాల్లో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేములపల్లి, కేశవరాల్లో అన్యాక్రాంతమైన మిగిలిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే యోచనలో అధికారయంత్రాంగం ఉంది. -
రాష్ట్రాన్ని పెట్రోకారిడార్‌గా మారుస్తాం
కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అనంతరం సీఎం బాబు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం పెట్రోలియం యూనివర్సిటీ, రిఫైనరీతోపాటు ఎల్ఎన్జీకూడా ఏర్పాటు చే స్తే ఆంధ్రా ప్రాంతం పెట్రోకారిడార్‌గా మార్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్. చంద్రబాబు చెప్పారు. కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో భేటీ అనంతరం ఆయన ఇలా అన్నారు. గురువారం ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన బాబు బిజీగా గడిపారు. తొలుత తాజ్ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. అక్కడినుంచి ఏపీభవన్‌కి చేరుకున్నారు. అనంతరం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు. ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి సాయంత్రం 4-40 నిమిషాలకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో శాస్త్రిభవన్‌లో భేటీ అయ్యారు.పలు అంశాలపై చర్చించారు. అనంతరం ధర్మేంద్ర ప్రదాన్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ , కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెట్రో రంగంలో భారీగా మౌలిక వసతులు ఏర్పాటుచేస్తాయని చెప్పారు. భేటీ విశేషాలను సీఎం వివరిస్తూ... ‘‘విభజన చట్టంలో పెట్రోలియం యూనివర్సిటీ, రిఫైనరీని పొందుపరిచారు. వాటితోపాటు పెట్రో కారిడార్, ఎల్ఎన్జీ కూడా ఏర్పాటుచేయాలని కోరాం’’ అని చెప్పారు. అనంతరం బాబు కృష్ణమీనన్‌మార్గ్-2లోని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరేందుకు సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటనల నేపథ్యంలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు ఏపీలో పెట్టుబడులపై రాయితీలు వస్తాయని చెప్పాల్సి ఉన్నందున, దానిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం ఏపీభవన్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో, జపాన్ ప్రతినిధి బృందంతో బాబు చర్చలు జరిపారు. రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి తిరుగుపయనమయ్యారు. ఏవియేషన్ హబ్‌కు ఇండిగో ఒప్పందం రాష్ట్రంలో విమాన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండిగో సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇండిగో అధ్యక్షుడు ఆదిత్యగోష్ గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏవియేషన్ కంపెనీల అభ్యర్థన మేరకు ఏటీఎఫ్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఒక్కశాతానికి తగ్గించామని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు మీడియాకి తెలిపారు. కాగా విశాఖ నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌కి వెళ్లే విమానాల సంఖ్యను రోజుకు ఐదు నుంచి ఏడుకి పెంచినట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి. విశాఖకు డొమస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల సంఖ్య పెంచేలా విమానాల హబ్‌గా మార్చనున్నట్టు వెల్లడించాయి. -
పుష్కరాల కోసం 10రోజుల్లో కమిటీ
సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో ఏర్పాట్ల కోసం పదిరోజుల్లో ఓ కమిటీని నియమిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఇందులో సంబందిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. రాజమండ్రి పుష్కరాలకు నిధుల విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో తాను మాట్లాడగా ప్రాజెక్టు రిపోర్టుతో రావాల్సిందిగా సూచించారన్నారు. ఆమేరకు ఈ కమిటీని నియమిస్తామని, అది రూపొందించే నివేదికను కేంద్రమంత్రికి సమర్పిస్తామన్నారు. జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ కోసం స్థల పరిశీల నకు వచ్చిన మంత్రి నారాయణ మంగళవారం కాకినాడ, రాజమండ్రిల్లో పర్యటించి అధికారులతో సమావేశమై స్థలాల లభ్యతపై చర్చిం చారు. తాళ్లరేవు మండలం చొల్లంగి, రాజానగరం, దివాన్ చెరువు, కడియం మండలం వేమగిరి ప్రాంతాల్లో పర్యటించి స్థలాలను పరిశీలించారు. అనంతరం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కార్పొరేటర్లు, అధికారులతో నగరపాలక సంస్థ అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. అనంతరం మేయర్ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. రూ. 165 కోట్లతో అంచనాలు వచ్చే ఏడాది జూలై నెలలో నిర్విహించే పుష్కరాలకు రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 165 కోట్లు అవసరం అవుతాయని మేయర్ పంతం రజనీ శేషసాయి మంత్రి నారాయణను కోరారు. ఈమేరకు వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. రాజమండ్రిలో కొత్త మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు రూ. 225 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని మేయర్ కోరారు. క్వారీ మార్కెట్ ఏరియాలో కబేళా నిర్మాణానికి రూ. 20 కోట్లు కావాలని మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. -
ఈవైపు చూడరే..
►రాజధాని కమిటీ పరిశీలనే చేయలేదు ►ఒక్క జాతీయ సంస్థకూ నోచుకోలేదు ►దొనకొండ ప్రతిపాదన బుట్టదాఖలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి రావడంతో ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట రాజధాని గుర్తింపు, అభివృద్ధి ప్రతిపాదనల దశలోనే ప్రకాశం జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అన్ని అవకాశాలు ఉన్న దొనకొండ ప్రాంతాన్ని కనీసం రాష్ట్ర రాజధాని కోసం వేసిన శివరామకృష్ణ కమిటీ పరిశీలించకపోవడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు హామీలిస్తున్నప్పటికీ అవి అమలులోకి తేవడంలో వైఫల్యం చెందుతున్నారు. - రాజధాని ఎక్కడన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు బిల్లులో పేర్కొన్నట్లు రాష్ట్రానికి ఇచ్చిన 11 జాతీయ సంస్థలు ఎక్కడెక్కడ అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం కమిటీకి వివరించింది. ఆ 11 సంస్థల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లాకు కేటాయించకపోవడం దారుణమని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ, కాకినాడలో పెట్రోలియం యూనివర్శిటీ, విశాఖపట్నంలో ఐఐఎం, గుంటూరులో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీ, అనంతపురం - కర్నూలు మధ్య ఐఐఐటీ, కర్నూలులో ఎన్ఐటీ, విజయవాడలో సెంట్రల్ యూనివర్శిటీ, పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి స్పష్టం చేసింది. ఇందులో ప్రకాశం జిల్లాకు చోటు దక్కలేదు. - ఒంగోలు జాతి పశువులకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో కనీసం వెటర్నటీ యూనివర్శిటీ అయినా కేటాయిస్తారని చూసిన ఈ ప్రాంత వాసులకు నిరాశే మిగిలింది. - కృష్ణా - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని చెప్పిన కమిటీ భూసేకరణ ఎలా చేస్తారో వివరించలేదు. కనీసం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎన్ని అందుబాటులో ఉన్నాయి. ఎంత భూమిని ప్రైవేటు వ్యక్తులు, రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. - ప్రకాశం జిల్లాలోని దొనకొండ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 54 వేల 483 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు లెక్కలు తీశారు. ఇందులో 34 వేల ఎకరాలు యధాతథంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 వేల ఎకరాలు అటవీ భూమి. దీన్ని డీ-నోటిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ పురాతన విమానాశ్రయంతో పాటు అతి సమీపంలో జాతీయ రహదారి ఉంది. అయినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా... పదేపదే గుంటూరు, విజయవాడ అంటూ ప్రచారం చేయడంలో ఆంతర్యమేంటనే అనుమానం కలుగుతోంది. - ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే. దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - ఈ ప్రాంతం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో ఉన్నా ఆయన స్పందించలేదు. ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఒంగోలు - నెల్లూరు మధ్య విమానాశ్రయం, జాతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని జిల్లా మంత్రి ప్రకటిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.