మండపేట : ద్వారపూడిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 87 ఎకరాల సేకరణకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. నీటి వసతి, రోడ్డు, రైలు మార్గాలు, ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఉండటంతో ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు ఉన్నతస్థాయి నుంచి సానుకూలత లభించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కేంద్ర ప్రభుత్వ కమిటీ భూములను పరిశీలించి తదుపరి కార్యాచరణ చేయనున్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి.
పెట్రో యూనివర్సిటీ, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణానికి మొత్తం 87 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. అందుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే జిల్లాలోని రాజానగరం, కాకినాడ, తాళ్లరేవు ప్రాంతాల్లో అధికారులు పరిశీలన చేశారు. ఆయా చోట్ల అవసరమైన మేరకు భూములు లేకపోవడం, యూనివర్సిటీ వలన తమ ప్రాంత అభివృద్ధికి, ఉపాధికి అవకాశాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో అక్కడి ప్రజాప్రతినిధులు విముఖత చూపడంతో ద్వారపూడి వైపు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి, కేశవరం గ్రామాల పరిధిలో సుమారు 300 ఎకరాల అసైన్డ్‌భూములుండగా, మరో 200 ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయి. స్థానికులకు అప్పగించిన అసైన్డ్ భూములు చాలాచోట్ల అన్యాక్రాంతమై గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో వేములపల్లిలో సుమారు వంద ఎకరాలు, కేశవరంలో సుమారు 47 ఎకరాల అసైన్డ్ భూములను గతంలోనే రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంది.
స్థానికంగా వ్యతిరేకత ఏమీ లేకపోవడంతో ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. జడ్.మేడపాడు - రాజానగరం రోడ్డులో వైఎస్సార్ నగర్‌కు పక్కనే ఉన్న 87 ఎకరాలు అనువైనవిగా భావిస్తున్నారు. ద్వారపూడిలో రైల్వే స్టేషన్, సుమారు 20 కిలోమీటర్ల దూరంలో 16వ నంబరు జాతీయ రహదారి, 40 కిలోమీటర్ల దూరంలో మధురపూడి ఎయిర్‌పోర్టు ఉండటంతో ఈ ప్రాంతం రవాణాకు అనుకూలమైనదిగా అధికారులు భావిస్తున్నారు.
సేకరించాలని ప్రతిపాదించిన భూముల పక్కనే సుమారు 60 ఎకరాల్లో పంగిడి చెరువు ఉండటంతో నీటి వసతికి సమస్య ఉండదంటున్నారు. ఇటీవల ఈ భూములను పరిశీలించిన కలెక్టర్ నీతూప్రసాద్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైనదిగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సంక్రాంతి తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ భూములను పరిశీలించి తదుపరి కార్యాచరణకు ఉపక్రమించనున్నట్టు సమాచారం.
కేశవరంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్..
కేశవరంలోని కోకా కోలా కంపెనీ సమీపంలో గల 47 ఎకరాల్లో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేములపల్లి, కేశవరాల్లో అన్యాక్రాంతమైన మిగిలిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే యోచనలో అధికారయంత్రాంగం ఉంది.
పెట్రోవర్సిటీ వేదిక ద్వారపూడే!
Published Sat, Jan 3 2015 2:53 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
Advertisement
Advertisement