- కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అనంతరం సీఎం బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం పెట్రోలియం యూనివర్సిటీ, రిఫైనరీతోపాటు ఎల్‌ఎన్‌జీకూడా ఏర్పాటు చే స్తే ఆంధ్రా ప్రాంతం పెట్రోకారిడార్‌గా మార్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్. చంద్రబాబు చెప్పారు. కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో భేటీ అనంతరం ఆయన ఇలా అన్నారు. గురువారం ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన బాబు బిజీగా గడిపారు. తొలుత తాజ్‌ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. అక్కడినుంచి ఏపీభవన్‌కి చేరుకున్నారు.
అనంతరం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు. ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి సాయంత్రం 4-40 నిమిషాలకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో శాస్త్రిభవన్‌లో భేటీ అయ్యారు.పలు అంశాలపై చర్చించారు. అనంతరం ధర్మేంద్ర ప్రదాన్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ , కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెట్రో రంగంలో భారీగా మౌలిక వసతులు ఏర్పాటుచేస్తాయని చెప్పారు. భేటీ విశేషాలను సీఎం వివరిస్తూ... ‘‘విభజన చట్టంలో పెట్రోలియం యూనివర్సిటీ, రిఫైనరీని పొందుపరిచారు.
వాటితోపాటు పెట్రో కారిడార్, ఎల్‌ఎన్‌జీ కూడా ఏర్పాటుచేయాలని కోరాం’’ అని చెప్పారు. అనంతరం బాబు కృష్ణమీనన్‌మార్గ్-2లోని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరేందుకు సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటనల నేపథ్యంలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు ఏపీలో పెట్టుబడులపై రాయితీలు వస్తాయని చెప్పాల్సి ఉన్నందున, దానిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం ఏపీభవన్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో, జపాన్ ప్రతినిధి బృందంతో బాబు చర్చలు జరిపారు. రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి తిరుగుపయనమయ్యారు.
ఏవియేషన్ హబ్‌కు ఇండిగో ఒప్పందం
రాష్ట్రంలో విమాన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండిగో సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇండిగో అధ్యక్షుడు ఆదిత్యగోష్ గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏవియేషన్ కంపెనీల అభ్యర్థన మేరకు ఏటీఎఫ్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఒక్కశాతానికి తగ్గించామని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు మీడియాకి తెలిపారు. కాగా విశాఖ నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌కి వెళ్లే విమానాల సంఖ్యను రోజుకు ఐదు నుంచి ఏడుకి పెంచినట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి. విశాఖకు డొమస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల సంఖ్య పెంచేలా విమానాల హబ్‌గా మార్చనున్నట్టు వెల్లడించాయి.