petrochemical corridor
-
పెట్రో కెమికల్ కారిడార్‌తో భారీ పెట్టుబడులు
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో : పెట్రో కెమికల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తాయని, ఇందుకు పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తూ ‘ఫెసిలిటేటర్’గా పని చేస్తుందన్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘సీపెట్’ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లో.. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా ప్రత్యేక హోదా చాలా సంక్లిష్టమైన అంశం. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తే.. దేశంలోని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి. హోదా అనే పదం తప్ప.. అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం సిద్ధం. పెట్రో కెమికల్ కారిడార్ ద్వారా, ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దేశంలోని నాలుగు ప్రధాన యూరియా ప్లాంట్లు 2002లో మూతబడ్డాయి. వాటిని పునురుద్ధరించడానికి రూ.1,500 కోట్లు వ్యయం చేశాం. త్వరలో రామగుండం యూనిట్ ప్రారంభం కానుంది. మిగతావీ కూడా దశల వారీగా పునరుద్ధరించనున్నాం. 2023 నాటికి యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నాం. వినియోగం ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు నీటితో నిండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో యూరియా అదనంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరారు. డిమాండ్‌కు అనుగుణంగా అదనపు యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాస్పరస్, పొటాష్ తయారీకి ముడి సరుకుల కోసం పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడాలి. అంతర్జాతీయంగా టెండర్లు ముందుగానే పిలుస్తున్నాం. ధర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తప్పించుకోవడానికి అంతర్జాతీయ కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పరిశోధనలకు ప్రోత్సాహం ‘రసాయన’ పదం వినగానే పర్యావరణానికి హాని అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. దాని వల్ల ఉపయోగాలను మరిచిపోకూడదు. పర్యావరణానికి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఎరువుల ఉత్పత్తి రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సవాళ్లు పెరిగాయి. వాటిని అధిగమించే వినూత్న మార్గాలను కనిపెట్టే విధంగా పరిశోధనలు జరగడం లేదు. ఇటీవల నేను జర్మనీ వెళ్లాను. సాంకేతిక, వినూత్న ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలిగింది. దేశంలోని ప్రతి ఉత్పత్తి ప్లాంటులోనూ పరిశోధన కేంద్రం ఉండాలి. అన్ని రంగాల్లో పరిశోధనలు విస్తృతంగా చేపట్టడానికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుంది. ఆర్గానిక్ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత వచ్చే ఐదు సంవత్సరాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని కనీసం 25 శాతం తగ్గించి, ఆమేరకు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ‘సిటీ కంపోస్ట్’ విధానాన్ని తీసుకొచ్చాం. దేశంలో రోజూ 1.5 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు పోగవుతున్నాయి. అందులో 30–70 శాతం వ్యర్థాలు.. సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగపడే పదార్థాలే. దీని కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ కంపోస్ట్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించాం. తొలుత నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా రైతులకు అవసరమైన సేంద్రియ ఎరువులను అందించడంతో పాటు ఘన వ్యర్థాల సమస్యనూ పరిష్కరించడానికి అవకాశం ఉంది. ‘స్వచ్ఛ భారత్’ లక్ష్యాలు కూడా నెరవేరతాయి. -
రాష్ట్రాన్ని పెట్రోకారిడార్‌గా మారుస్తాం
కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అనంతరం సీఎం బాబు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం పెట్రోలియం యూనివర్సిటీ, రిఫైనరీతోపాటు ఎల్ఎన్జీకూడా ఏర్పాటు చే స్తే ఆంధ్రా ప్రాంతం పెట్రోకారిడార్‌గా మార్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్. చంద్రబాబు చెప్పారు. కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో భేటీ అనంతరం ఆయన ఇలా అన్నారు. గురువారం ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన బాబు బిజీగా గడిపారు. తొలుత తాజ్ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. అక్కడినుంచి ఏపీభవన్‌కి చేరుకున్నారు. అనంతరం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు. ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి సాయంత్రం 4-40 నిమిషాలకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో శాస్త్రిభవన్‌లో భేటీ అయ్యారు.పలు అంశాలపై చర్చించారు. అనంతరం ధర్మేంద్ర ప్రదాన్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ , కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెట్రో రంగంలో భారీగా మౌలిక వసతులు ఏర్పాటుచేస్తాయని చెప్పారు. భేటీ విశేషాలను సీఎం వివరిస్తూ... ‘‘విభజన చట్టంలో పెట్రోలియం యూనివర్సిటీ, రిఫైనరీని పొందుపరిచారు. వాటితోపాటు పెట్రో కారిడార్, ఎల్ఎన్జీ కూడా ఏర్పాటుచేయాలని కోరాం’’ అని చెప్పారు. అనంతరం బాబు కృష్ణమీనన్‌మార్గ్-2లోని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరేందుకు సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటనల నేపథ్యంలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు ఏపీలో పెట్టుబడులపై రాయితీలు వస్తాయని చెప్పాల్సి ఉన్నందున, దానిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం ఏపీభవన్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో, జపాన్ ప్రతినిధి బృందంతో బాబు చర్చలు జరిపారు. రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి తిరుగుపయనమయ్యారు. ఏవియేషన్ హబ్‌కు ఇండిగో ఒప్పందం రాష్ట్రంలో విమాన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండిగో సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇండిగో అధ్యక్షుడు ఆదిత్యగోష్ గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏవియేషన్ కంపెనీల అభ్యర్థన మేరకు ఏటీఎఫ్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఒక్కశాతానికి తగ్గించామని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు మీడియాకి తెలిపారు. కాగా విశాఖ నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌కి వెళ్లే విమానాల సంఖ్యను రోజుకు ఐదు నుంచి ఏడుకి పెంచినట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి. విశాఖకు డొమస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల సంఖ్య పెంచేలా విమానాల హబ్‌గా మార్చనున్నట్టు వెల్లడించాయి. -
నెలలోనే అనుమతులిస్తాం
పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం అన్ని పత్రాలతో ముందుకు రావాలని సూచన రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మంచిదే ‘ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్’లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల ప్రాంతంగా మలుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ ఉత్పత్తుల తయారీ హబ్‌లను నెలకొల్పుతామన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో ‘ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్’లో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. ఏపీలో 24 గంటల విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘ఏపీకి వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఏ రాష్ట్రానికీ ఇంత తీరప్రాంతం లేదు. ఈస్ట్‌కోస్ట్‌లో 4 పోర్టులు ఉన్నాయి. మేం మరో 10 పోర్టులను నెలకొల్పుతాం. ఏపీని పోర్ట్ హబ్‌గా, గేట్ వే ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం..’ అని అన్నారు. గత ఐదునెలల్లో విద్యుత్తు సరఫరా సామర్థ్యాన్ని 65 శాతం నుంచి 85 శాతానికి పెంచామన్నారు. అన్ని రకాల పత్రాలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే నెల రోజుల్లో అనుమతులు ఇస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని, రాష్ట్రాలు ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు. ‘సంస్కరణలు తెచ్చి సమీకృత అభివృద్ధిని సాధించడం ద్వారా సంపద సృష్టించవచ్చు. ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంక్షేమం సమీకృత అభివృద్ధిలో కీలకం. ప్రపంచంలో మన దేశం చాలా వేగంగా ముందుకు సాగడాన్ని మనం గత ఐదు నెలల్లో గమనించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అశాస్త్రీయంగా విభజనకు గురైంది. సాధారణ దృక్పథంతో కాకుండా ఏపీలో ఒక మిషన్ తరహాలో వాణిజ్య అభివృద్ధికి కృషిచేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర పథకాలను సమన్వయంతో అమలుచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం. పరస్పర సహకారం ఉండాలి. ఇది దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు దోహదపడుతుంది. వాణిజ్య రంగం ప్రస్తుతం సానుకూల సంకేతాలను చవిచూస్తోంది. దేశానికి ఇది మంచి కాలం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. బీవోటీ పద్ధతిలో హైదరాబాద్.. ‘నేను హైదరాబాద్‌ను బీవోటీ, పీపీపీ పద్ధతుల్లో నిర్మించాను. ఈ విధానాలు హైదరాబాద్ విషయంలో బాగా పనిచేశాయి. అభివృద్ధిని ‘ఆకాంక్షలు-విజయాలు’ ఆధారంగా కొలవవచ్చు..’ అని బాబు చెప్పారు. ‘ఏపీలో 8వ తరగతి నుంచి వృత్తివిద్యలో ఏదైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా?’ అని హీరో మోటార్ కార్ప్ అధినేత పవన్ ముంజల్ ప్రశ్నించగా.. ‘నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ అండ్ నాలెడ్జి మిషన్ ఉంది’ అని బాబు బదులిచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగంపైనే మా దృష్టి ఉంటుంది. వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. ళీ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఇ-అక్షరాస్యుడిని, ఒక వాణిజ్య వ్యవస్థాపకుడిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ళీ ప్రతి ఇంటికీ 100 ఎంబీపీఎస్ వేగం గల హై బాండ్ విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తాం.