నారా చంద్రబాబునాయుడు
- పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
- అన్ని పత్రాలతో ముందుకు రావాలని సూచన
- రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మంచిదే
- ‘ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్’లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల ప్రాంతంగా మలుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ ఉత్పత్తుల తయారీ హబ్‌లను నెలకొల్పుతామన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో ‘ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్’లో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. ఏపీలో 24 గంటల విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘ఏపీకి వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఏ రాష్ట్రానికీ ఇంత తీరప్రాంతం లేదు.
ఈస్ట్‌కోస్ట్‌లో 4 పోర్టులు ఉన్నాయి. మేం మరో 10 పోర్టులను నెలకొల్పుతాం. ఏపీని పోర్ట్ హబ్‌గా, గేట్ వే ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం..’ అని అన్నారు. గత ఐదునెలల్లో విద్యుత్తు సరఫరా సామర్థ్యాన్ని 65 శాతం నుంచి 85 శాతానికి పెంచామన్నారు. అన్ని రకాల పత్రాలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే నెల రోజుల్లో అనుమతులు ఇస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని, రాష్ట్రాలు ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు. ‘సంస్కరణలు తెచ్చి సమీకృత అభివృద్ధిని సాధించడం ద్వారా సంపద సృష్టించవచ్చు.
ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంక్షేమం సమీకృత అభివృద్ధిలో కీలకం. ప్రపంచంలో మన దేశం చాలా వేగంగా ముందుకు సాగడాన్ని మనం గత ఐదు నెలల్లో గమనించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అశాస్త్రీయంగా విభజనకు గురైంది. సాధారణ దృక్పథంతో కాకుండా ఏపీలో ఒక మిషన్ తరహాలో వాణిజ్య అభివృద్ధికి కృషిచేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర పథకాలను సమన్వయంతో అమలుచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం. పరస్పర సహకారం ఉండాలి. ఇది దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు దోహదపడుతుంది. వాణిజ్య రంగం ప్రస్తుతం సానుకూల సంకేతాలను చవిచూస్తోంది. దేశానికి ఇది మంచి కాలం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
బీవోటీ పద్ధతిలో హైదరాబాద్..
‘నేను హైదరాబాద్‌ను బీవోటీ, పీపీపీ పద్ధతుల్లో నిర్మించాను. ఈ విధానాలు హైదరాబాద్ విషయంలో బాగా పనిచేశాయి. అభివృద్ధిని ‘ఆకాంక్షలు-విజయాలు’ ఆధారంగా కొలవవచ్చు..’ అని బాబు చెప్పారు. ‘ఏపీలో 8వ తరగతి నుంచి వృత్తివిద్యలో ఏదైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా?’ అని హీరో మోటార్ కార్ప్ అధినేత పవన్ ముంజల్ ప్రశ్నించగా.. ‘నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ అండ్ నాలెడ్జి మిషన్ ఉంది’ అని బాబు బదులిచ్చారు.
వ్యవసాయం, అనుబంధ రంగంపైనే మా దృష్టి ఉంటుంది. వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. ళీ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఇ-అక్షరాస్యుడిని, ఒక వాణిజ్య వ్యవస్థాపకుడిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ళీ ప్రతి ఇంటికీ 100 ఎంబీపీఎస్ వేగం గల హై బాండ్ విడ్త్‌తో కూడిన ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పిస్తాం.